దిక్కూ మొక్కులేని అన్న క్యాంటీన్లు

ABN , First Publish Date - 2022-05-25T06:48:32+05:30 IST

పేదలకు నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్‌లు మూడేళ్లుగా మూతపడి ఉన్నాయి.

దిక్కూ మొక్కులేని అన్న క్యాంటీన్లు
తుప్పల మధ్య తాటిచెట్లపాలెంలోని అన్న క్యాంటీన్‌

నిరుపయోగంగా భవనాలు

పేదల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో  32 చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు

ఒక్కో భవనం నిర్మాణానికి రూ.30 లక్షల వ్యయం

ఒక్కోచోట పూటకు 350 మందికి ఆహారం

వైసీపీ అధికారంలోకి వచ్చాక మూసివేత

చెత్తాచెదారం పేరుకుపోయి అధ్వానంగా పరిసరాలు

కొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలు...


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

పేదలకు నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్‌లు మూడేళ్లుగా మూతపడి ఉన్నాయి. నాడు కళకళలాడిన ఆ భవనాలన్నీ నేడు నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని 32 ప్రాంతాల్లో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు చొప్పున వెచ్చించి నిర్మించిన భవనాలన్నీ ఆలనాపాలనా లేక శిధిలావస్థకు చేరుకుంటున్నాయి. 

అర్ధాకలితో అలమటించే నిరుపేదలతో పాటు, వేర్వేరు అవసరాల కోసం నగరానికి వచ్చే మధ్యతరగతి వారికి కూడా నామమాత్రపు ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లకు రూపకల్పన చేసింది. 2018 జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా 204 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. జీవీఎంసీ పరిధిలో దఫదఫాలుగా 32 చోట్ల అన్న కాంటీన్లను ఏర్పాటుచేసింది. అన్ని భవనాలు ఒకేలా ఉండేలా డిజైన్‌ చేసి...నిర్మాణ బాధ్యతలను ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది.  ఒక్కో భవనం నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఖర్చుచేసింది. క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేసేలా ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏదైనా రూ.5కే అందుబాటులో ఉంచింది. ఆహారం రుచి, నాణ్యత కలిగి ఉండడంతో వీటికి ఆరంభం నుంచి మంచి ఆదరణ లభించింది. ఒక్కో క్యాంటీన్‌లో పూటకు కనీసం 350 మంది వరకూ ఆహారం తీసుకునేవారు. అయితే 2019లో అధికారం చేపట్టిన వైసీపీ...ఈ అన్న క్యాంటీన్లను మూసివేసింది. క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని మంత్రులు ప్రకటనలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విమ్స్‌ సమీపంలోని సంజయ్‌గాంధీ కాలనీ, ఆరిలోవలోని క్యాంటీన్‌ భవనాలను మాత్రం వార్డు సచివాలయాలకు వినియోగించుకుంటున్నారు. గాజువాక ఆటోనగర్‌లోని అన్న క్యాంటీన్‌ను ఐలా అధికారులు జీవీఎంసీ అధికారుల అనుమతి లేకుండానే ప్రైవేటు వ్యక్తికి రెస్టారెంట్‌ నిమిత్తం అద్దెకు ఇచ్చారు. ఎంతో ఉన్నతాశయంతో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు మూతపడడం, భవనాలు నిరుపయోగంగా మారడం పట్ల నగరవాసులు తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నారు.


ఇదీ అన్న క్యాంటీన్ల పరిస్థితి

- గోపాలపట్నం రైతుబజారు సమీపంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ పరిసరాలు చెత్తాచెదారంతో నిండి, అధ్వానంగా మారింది. ఫర్నీచర్‌ చాలావరకు మాయమైంది.

- గాజువాకలోని వంటిల్లు జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌లో డైనింగ్‌ టేబుల్స్‌, ఇతర ఫర్నీచర్‌ చోరుల పాలయ్యాయి.

- శ్రీహరిపురం, గాజువాక ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌లలో ఆసుపత్రులకు చెందిన సామగ్రి ఉంచారు. భవనాల పరిస్థితి అధ్వానంగా ఉంది.

- పెందుర్తి అన్న క్యాంటీన్‌ పరిసరాలు చీకటిపడితే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.

- తగరపువలస సమీపంలోని చిట్టివలస, పెందుర్తి సమీపంలోని వేపగుంట అన్న క్యాంటీన్‌ భవనాలు వాహనాల పార్కింగ్‌ స్టాండ్‌లుగా మారాయి.

- భీమిలి అన్న క్యాంటీన్‌ భవనం తుప్పలతో నిండి శిథిలావస్థకు చేరింది.

- మారికవలస రాజీవ్‌ గృహకల్ప వద్ద అన్న క్యాంటీన్‌ మందుబాబులకు అడ్డాగా మారింది.

- ఆరిలోవ సంజయ్‌గాంధీ కాలనీలో గల అన్న క్యాంటీన్‌ భవనాన్ని  వార్డు కార్యాలయంగా, దుర్గాబజారు వద్ద గల క్యాంటీన్‌ భవనాన్ని డ్వాక్రా సమావేశాలకు వినియోగిస్తున్నారు.

- ఎంవీపీ కాలనీ రైతుబజారు ఆవరణలోని అన్న క్యాంటీన్‌ 18వ వార్డు సచివాలయంగా మారింది.

- తాటిచెట్లపాలెం వైఎస్సార్‌ నగర్‌లో గల అన్న క్యాంటీన్‌ భవనం నిరుపయోగంగా ఉంది. పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.

- కేజీహెచ్‌ ఆసుపత్రి ఓపీ గేట్‌, పూర్ణా మార్కెట్‌ సవీపంలోని టర్నర్‌ చౌలీ్ట్ర, పాతబస్టాండ్‌ సమీపంలో ఇందిరా గాంధీ స్టేడియంలలో ఏర్పాటైన అన్న క్యాంటీన్‌ భవనాలు అధ్వానంగా ఉన్నాయి.



Updated Date - 2022-05-25T06:48:32+05:30 IST