దళిత ఏఎన్‌ఎంపై వైసీపీ నేతల వేధింపులు

ABN , First Publish Date - 2020-09-20T15:51:49+05:30 IST

ఆయన గ్రామంలో పెద్దమనిషి. పైగా పలు పదవులు అలంకరించిన నాయకుడు..

దళిత ఏఎన్‌ఎంపై వైసీపీ నేతల వేధింపులు

గ్రామంలో బహిరంగంగానే అసభ్య ప్రవర్తన

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన బాధితురాలు

సరిగ్గా నెల రోజులకు ఏఎన్‌ఎంపై బదిలీ వేటు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఆయన గ్రామంలో పెద్దమనిషి. పైగా పలు పదవులు అలంకరించిన నాయకుడు. అందులోనూ అధి కార వైసీపీ నేత. అందుకే తాను ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నాడు. గ్రామంలో విధులు నిర్వర్తించే ఏఎన్‌ఎం పట్ల బహిరంగంగానే అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీనిపై ఆమె స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేను కలిసి ఫిర్యాదు చేసిన పాపానికి ఉన్నట్టుండి బదిలీ వేటు వేశారు. అధికార పార్టీ నాయకు డి అకృత్యం బయటకు రాకుం డా అధికారులు బదిలీ ఉత్తర్వుల్లో బాధితురా లిపైనే గ్రామస్థులు ఫిర్యాదులు చేసినట్టు పేర్కొనడం గమనార్హం.


తాడిగడపకు చెందిన చుక్కా రేణుక పెనమలూరు మండలం చోడవరం గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. 2019లో నిర్వహించిన సచివాలయ పరీక్షల్లో ఈమె ఉద్యోగాన్ని సంపాదించింది. నవంబర్‌ ఐదో తేదీ నుంచి చోడవరంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తోంది. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ కాకర్ల వెంకట రత్నం తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నారని రేణుక మీడియా ముందు శనివారం వాపోయింది. గ్రామంలో కనిపించినప్పుడు నమస్కారం పెట్టినప్పుడు తనపై చేయి వేసి మాట్లాడేవాడని ఆరోపించింది. ఆయనతోపాటు మానికొండ సూర్యతేజ, మండూరి కోటేశ్వర రావు అనే వైసీపీ నేతలు కూడా తనపై కక్ష కట్టి వేధిస్తున్నారని వాపోయింది. ఇలా ఐదారు నెలల నుంచి జరుగుతోందని తెలిపింది.


తొలుత జరిగిన విషయాన్ని ఎంపీడీవో విమా దేవి దృష్టికి తీసుకెళ్లగా.. సర్దుకుపోతూ పనిచే సుకోవాలని సూచించారని బాధితురాలు వాపోయారు. తర్వాత పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని కలిసినా తనకు న్యాయం జరగకపోగా, అన్యాయంగా బదిలీ చేశారని వాపోయింది. ఆగస్టు 15న ఎమ్మెల్యే పార్థసారధిని కలిసి జరిగిన విషయాన్ని వివరించినట్లు రేణుక తెలిపారు. రాతపూర్వ కంగా కూడా ఫిర్యాదు ఇచ్చానని చెప్పారు. తర్వాత ఈనెల 17న ఆమెను చోవడరం నుంచి కానూరులోని సచివాలయం 2కి బదిలీ చేస్తూ ఎంపీడీవో విమాదేవి ఉత్తర్వులు జారీ చేశారని రేణుక తెలిపారు. బాధితురాలి పైగ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదులు చేయడంతో ఈవోపీఆర్డీతో విచారణ చేయించామని, ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే రేణుకను బదిలీ చేస్తున్నామని ఎంపీడీవో ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.


తనపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే తనను బదిలీ చేశారని రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వెంకటరత్నం వల్ల ఇబ్బంది పడింది నేను. బాధితురాలిగా ఉన్న నాపైనే గ్రామస్తులు ఫిర్యాదులు చేసినట్టుగా చెబుతు న్నారు. వెంకటరత్నంతో జాగ్రత్తగా ఉండమని గ్రామస్తులే నాకు చెప్పారు. నన్ను మామూలుగా బదిలీ చేస్తే ఆర్డర్‌ కాపీ తీసుకుని వెళ్లి విధుల్లో చేరిపోయే దాన్ని. గ్రామస్తుల ఫిర్యా దుతో విచారణ చేయించి, బదిలీ చేస్తున్నామని ఉత్తర్వులు ఇవ్వడం నన్ను బాధించింది. నాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని రేణుక కన్నీరుమున్నీరైంది. 

Updated Date - 2020-09-20T15:51:49+05:30 IST