Abn logo
May 10 2021 @ 00:56AM

అక్షరంపై ఆంక్షలా!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16 ప్రజా సంఘాలపై నిషేధం విధించింది. అందులో విప్లవ రచయితల సంఘం కూడా ఉంది. విరసంపై నిషేధంపై పలువురు రచయితల స్పందనలివి.వివిధ


ప్రజాసంఘాలపై రాజ్యహింస

దేశమంతటా కరోనా మృత్యు ఛాయలు విస్తరిస్తున్న ఈ విషాద కాలాన, తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజాసంఘాలను నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ 16 సంఘాలలో విప్లవ రచయితల సంఘం (విరసం) గత 50 సంవత్సరాలకు పైగా భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోనే పని చేస్తున్నది. తాను నమ్ముకున్న ప్రజా పోరాటాల ఆశయాల కనుగుణంగా విరసం సాహిత్య - సాంస్కృతిక రంగంలో క్రియా శీలంగా ఉంది. అనేక రకాల ఆటుపోటుల మధ్య కూడా తన సాహిత్యాన్ని ప్రజలకు అందించగలుగుతున్నది. ఆయా దశల్లో ప్రభుత్వ నిర్బంధకాండను ఎదుర్కొంటూ నిలుచున్నది. 1975 దాకా విరసంలో క్రియాశీలంగా వున్న నాలాంటి కవులకు-- పుస్తక నిషేధాలు, జైలు నిర్బంధాలు, పోలీసుల వేధింపులు ఎలాంటివో-- అనుభవంలోకి వచ్చినవే. 


ఈనాటి కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పాలకులు ప్రజా రోగ్య రంగంలోని తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ప్రజా సంఘాలను నిషేధించి ప్రజల దృష్టిని మళ్లిస్తూ న్నారు. ఒకవైపు ప్రకృతి పగబడితే మరోవైపు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఊపా) అనే రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని అనుసరిస్తున్నది తెలంగాణ సర్కార్‌! ఈ నిషేధాల ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవడమే ప్రజాశ్రేయస్సుకు సరైన మార్గం. 

నిఖిలేశ్వర్‌

మన కాలపు కావ్యాలంకారం

కలల్ని ఎలా నిషేధిస్తారు? ఎంత మొనగాళ్ళైనా కడలి అలల్ని ఎలా నిలిపేస్తారు? రెండూ అసాధ్యం. అయినా, పాలకులు పదేపదే ఎందుకలా వెర్రిగా ప్రయత్నిస్తారు? పదారో మరెన్నో సంఘాలను నిషేధించారు. రచ యితల సంఘాన్ని కూడా. సరే, ఇక, నిశ్చింతగా నిద్రించగలరా? శాంతిగా సుఖించగలరా? అవి కాకపోతే మరేవో. వాళ్లు కాకపోతే ఇంకెవరో. ఉన్న సమాజం చెత్త అయినప్పుడు ఉన్న సమాజం చెత్త అని చెప్పే వాళ్లుంటారు. ఒకరు కాక పోతే ఒకరు నిజాన్ని గాఠ్ఠిగానో, గుసగుసగానో అరిచి ఉడాయి స్తుంటారు, బజార్లో పిచ్చివాన్ని గేలిచేసి పారిపోయే పిల్లల్లాగ. పాలకుడా! చూడబోతే నువ్వు మానసిక రోగివయినా కాదు. భోగాల రోగివి. ‘హెహ్హే, రాజు సూడు, ఉత్త బిత్తల ఊరేగు తున్నాడ’ని ఎగిరి నవ్వే అల్లరి పిల్లలు ప్రతి బజారులో ఉంటారు. సత్యాన్ని నిషేధిస్తావు. బాల్యాన్ని నిషేధించగలవా? చర్యను నిషేధించగలవు. చర్చకు చెవులు మూయగలవా? ప్రజలకు అన్నం కావాలి. వాళ్ల నోటికి పంటకు అడ్డంగా నువ్వున్నావు. ప్రజలకు పువ్వులు కావాలి. వాళ్ల చేతికి తోటకు అడ్డంగా నువ్వున్నావు. తప్పుకో. వాళ్ల రైతులెవరో, వాళ్ల తోట మాలులెవరో ప్రజల్ని చెప్పనీ. చెప్పడాన్ని నిషేధిస్తే, కోరిక అణిగిపోతుందా? అణగదు. సన్నికల్లు దాచేస్తే పెండ్లి అగి పోతుందా? ఆగదు. మాటలతో వీలు కానప్పుడు చేతులు వ్యక్తీకరణ సాధనాలవుతాయి. నిషేధిస్తే, మూలమూలల్లోని స్వేచ్ఛాకాంక్ష నడివీధిలోనికి వొస్తుంది. నీ మొదటికి మోసం తెస్తుంది. అంతటి జారు తన ప్యాలెస్‌ను నిలబెట్టుకోలేక పోయాడు. ఒద్దురా వొద్దు. ఈ దారి సరి కాదు. ఇది నీ అంతిమ నిరాశకు రహదారి. మేమేమంటున్నాం. మాకు అన్నం కావాలి. మాకు పువ్వులు కావాలి. మాకు స్వేచ్ఛ కావాలి. నువ్వు ఏది ఏమేరకు ఎంత ఇవ్వగలవో అంతే, అంత వరకే, అంత కాలమే ఉంటావు; నువ్వున్నది వాషింగ్టనయినా, హస్తినాపురమైనా, హైదరాబాద్‌, అమరావతి, విశాఖ ఏదయినా ఫరక్‌ పడదు. నిషేధించబడినది ఏదీ నిశ్శబ్దంగా ఉండిపోదు. మేము మరిమరి అదే మాట చెబుతున్నామా? నువ్వు మరిమరి అదే పని చేస్తున్నావాయె! విను. సంకెళ్లతో కూడా సంగీతం పుడుతుంది. నిషేధం కూడా ఒక కావ్యాలంకారమవుతుంది.

హెచ్చార్కె

‘‘సంఘటిత శక్తి సౌందర్యాన్ని విధ్వంసం చేసే నిషేధం...’’


దేశంలో విస్తరిస్తున్న ఫాసిస్ట్‌ నీడలు ప్రజాస్వామిక విలువ లకు ప్రమాదకరంగా మారిన గత రెండు మూడేళ్ళ కాలంలో భిన్నరూపాలలో పెరుగుతున్న నిర్బంధాల మధ్య విరసంపై ఈ నిషేధం అనూహ్యం కాదు. ప్రజాస్వామ్య సంస్కృతి ఎంత అట్టడుగుకు పడుతున్నదనేదే ఆందోళన. 


సంఘాలు ఏవైనా ఎందుకు ఏర్పడతాయి? ప్రజల గొంతుకకు ప్రాతినిధ్యం కల్పించటానికి. ప్రభుత్వాలు చూడ లేని, వినలేని ప్రజల అవసరాలను ఆకాంక్షలను చర్చలోకి తెచ్చే ప్రతిపక్షాలు పూరకాలే కానీ శత్రుపక్షం కాదు. ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలతో నడవటానికి ప్రతిపక్షం ఎప్పుడూ ఒక హెచ్చరికగా ఉంటుంది. అందుకే కాళోజి రచయితలు ఎప్పుడూ ప్రతిపక్షంగానే ఉండాలంటాడు. అటువంటి రచయితల సంఘాలను నిషేధించటం అంటే ప్రజాస్వామ్య సారం, స్వభావం వదులుకోవటమే అవుతుంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రజలు వినియోగించుకొనే అవకాశాలు అభావం అవుతున్న పరిస్థితులలో అందుకు కారణమవుతున్న సామాజిక ఆర్థిక రాజ్య అధికార శక్తుల వైపు వేలుచూపిస్తున్నాయని- పౌరహక్కుల సంఘాల వేళ్ళు నరికేస్తాను, నోళ్లు నొక్కేస్తాను అనటం రాజ్యాంగ విరుద్ధం కాదా! మహిళల జీవితాలు మరింత జటిలం అవుతూ ఇరవై ఏళ్ళ నుండి జపిస్తున్న సాధికారతా మంత్రానికి ఏ చింతకాయలూ రాలకపోవటం అనుభవం అవుతున్నప్పుడు పితృస్వామిక మనువాద బ్రాహ్మణీయ సంస్కృతితో తల పడటానికి ఎన్ని స్త్రీ సంఘాలైనా సరిపోవే..!? అలాంటప్పుడు ఉన్న సంఘాలను నిషేధించటం ఏమిటి? 


మావోఇస్టులతో సంబంధాలు అనే బూచిని చూపి, శాంతి భద్రతల సమస్యగా చెప్పి సంఘటిత శక్తి సౌందర్యాన్ని విధ్వంసం చేసే ఈ నిషేధం ప్రజాస్వామ్య నీతికి, స్ఫూర్తికి భంగకరమైనది. అందువలన తెలంగాణ ప్రభుత్వం ఈ నిషేధపు ఉత్తరువులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. 

కాత్యాయనీ విద్మహే

‘‘అనియత మహాస్మశాన హోరులో ఇంకా ఏం భయపెడ్తారు.’’

నిషేధం అన్న పదమే వొక పెద్ద political farce. అది, ఎందువల్ల, దేనికొరకు విధిస్తారు? అన్న విషయం కూడా నమ్మ దగిన కారణాల వల్ల వుండదు. నిషేధ ఫలితం... సంస్థల మీద యినా పుస్తకాల మీదయినా... ఇతర ఏ art forms మీద యినా, ప్రత్యేక భావ ప్రపంచాల మీదయినా... ఎక్కువ కాలం కొనసాగితే... reverse mechanismలో విధించినవారి మీదనే పని చేస్తుంటుంది. నిషేధం లేకుండా తెలంగాణ అస్తిత్వమే లేదు. ఇది కొత్తేం కాదు. మానవ స్వభావం, స్వేచ్ఛ పట్ల, దానిని హరించే శక్తుల మధ్య ఎప్పటికీ పెనుగులాడుతూనే వుంటుంది. అయినా ఇది చాలా... outdated political farce. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలనయినా, వాటి రాజకీయాల నయినా, ఉద్యమాలనయినా మార్కెట్‌ ఎకానమీయే స్టేజింగ్‌ చేస్తున్నప్పుడు, భావజాల ప్రపంచాన్ని నిషేధాల ద్వారా క్రమబద్ధీకరణ, లేదా ధ్వంసం చేయాలనుకోవడం... ఏమిటి? ప్రతీ ban/ నిషేధంవల్ల తాత్కాలిక ప్రయోజనాలుంటాయే కాని దృష్టిలోపమే అవుతుందది. వీటివల్ల తెలంగాణ అస్తిత్వంలో మనల్ని ఎప్పటికీ పీడనకు గురిచేసే dystopian horror తెర మీదికి వస్తుంది, పొడుచుకు వస్తుంది. కొత్తగా భయాలు నేర్చుకోవాల్సిన దుస్థితిలో సమాజం లేదు. అంతటా మృత్యువే విశ్వతాండవం చేస్తున్న ఈ పరిస్థితిలో పార్టీలూ, పాలకులూ పట్టించుకోని అనియత మహాస్మశాన హోరులో ఇంకా ఏం భయపెడ్తారు. వీటన్నింటికీ వొకే... సమాధానం- కొత్త సామాజిక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య బహుజన ఉద్యమాలు. ఇదే అన్ని వైరస్‌లకూ పొలిటికల్‌ వాక్సిన్‌. 

సిద్ధార్థ

ప్రభుత్వాలు సంయమనం పాటించాలి!

భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటి ప్రవేశికలో ‘‘ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో’’ పౌరులందరికీ సమానమైన స్వేచ్ఛను కల్పించారు. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అందరికీ సమానంగా వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ ప్రవేశికను బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రాసిండు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వారు ఇవ్వాళ దాని స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారు. ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడమే నేరంగా భావి స్తున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే అసమ్మతికి, భిన్నా భిప్రాయాలకు నమ్మిన భావజాల ప్రచారానికి తావుండాలి. ఒకవేళ ‘విరసం’ సంస్థ సభ్యులు చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. కోర్టుల్లో నేరారోపణలు ఋజువు చేయించి శిక్షలూ వేయించవచ్చు. అది చట్టబద్ధమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రజలకు, ప్రభుత్వాలకూ ఒకేవిధంగా వర్తిస్తుంది. 


ఎక్కడో విదేశాల్లో ఉన్న యువ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్‌ ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తే ఇక్కడి ప్రభుత్వాల పీఠాలు కదలిపోయి ‘లబ్ధప్రతిష్టు’ల తోటి కౌంటర్‌ ట్వీట్లు ఇప్పించిండ్రు. మంత్రులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టిండ్రు. అంటే బయటి దేశస్తులను ఏమీ చేయలేకుండా (చేయాలని నా ఉద్దేశం కాదు. అక్కడ చట్టాలు సవ్యంగా అమలు జరుగుతున్నాయనేది గుర్తించాలి) ఇక్కడ నిరసన/ అసమ్మతి వ్యక్తం జేసిన దేశీయులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఏది ఏమైనా ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఐఎ మాధ్యమంగా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరిస్తూ అజమాయిషీ చేస్తున్నది. ‘విరసం’ నిషేధం ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిఘాసంస్థల ఒత్తిడి మేరకు జరిగినట్లయితే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలి. లేదా తమంత తామే ఆ నిషేధాన్ని విధించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.  

సంగిశెట్టి శ్రీనివాస్‌

‘‘విరసం భిన్నాభిప్రాయాలకు వేదిక కాలేకపోయింది!’’


నా వయసు 65 సంవత్స రాలు. వెనుకకు తిరిగి చూసు కుంటే అనేక విషయాలు నా ఎరుకలోకి వస్తున్నాయి. విరసానికి ఉన్న రాజకీయ తాత్విక భూమిక అర్థం కాక దూరం నుంచి ఆకర్షింపబడిన నేను ఆ రోజుల్లో ఒకటి రెండు నెలలు మాత్రమే అందులో ఉండి ఆ సంస్థలో గ్రూపుల గొడవలతో రాజకీ యాలదే పైచేయి అని తెలిసి వెంటనే బయటకు వచ్చేసాను. విరసం తను గిరిగీసుకున్న పరిమితుల కంచెలను దాట లేకపోయినది. దీనికి అనేక కారణాలు. కార్మికవర్గం అధికంగా ఉన్న దేశాలను దృష్టిలో పెట్టుకొని రాయబడిన మార్క్సిజం అనేక కులాలు వర్గాలు కలిగి ఉండి ప్రధానంగా వ్యవసా యిక దేశమైన మన దేశానికి పూర్తిగా అన్వయం కాలేక పోయింది. 


ఇటీవల విరసం తన అవగాహనను విస్తృత పరచుకునే ప్రయత్నాలను ప్రారంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో పునరుజ్జీవం పొందలేకపోయింది. మన దేశ వామపక్ష ఉద్యమాల్లో, దాని అనుబంధ సంఘాల్లో, అగ్రవర్ణ కుల వర్గాలకు ఏదో తెలియని, ఇదీ అని విడమరిచి చెప్పలేని ఫ్లెక్సిబిలిటీ ఉంది. అందుకే నాయకులు, పచ్చ ఇంకు మేధావులు అందులో కొనసాగుతున్నారు. మిగతా అట్టడుగు వెనుకబడిన వర్గాలు పద్మవ్యూహంలో చిక్కుకుపోయి వీర మరణాల కీర్తిని గడిస్తారు. మేల్కొన్న వారు విభేదించి వారిదైన దారి ఎంచుకొని నడుస్తారు ఇటువంటి విఫలమైన వాతావరణం నుంచి పుట్టినవే వివిధ అస్తిత్వ ప్రాంతీయ ఉద్యమాలతో పాటు సాహిత్య కళా రంగాలు కూడా అనుకుంటాను. అందుకే అవి ఇప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరలేకపోయాయి. దీనికి విరసం మినహాయింపేమీ కాదు. విభిన్న ఆలోచనలకు భిన్న అభిప్రాయాలకు అది వేదికగా నిలువలేకపోయింది. అయితే విభేదాలు అరెస్టులు కోర్టులు జైళ్ళు ఆ సంఘానికి కొత్త విషయం ఏమీ కాదు. దీన్ని రాజ్య వ్యవస్థలకూ మార్పుకోరే సంస్థలకూ మధ్య జరిగిన, జరుగుతున్న అంశంగా మాత్రమే గుర్తెరగాలి, చూడాలి. ప్రజాస్వామ్యంలో ఖండనలు మండనలు రాజ్యంతో దోబూచులాటలు వేరు వేరు విషయాలు. 

జూకంటి జగన్నాథం

నిషేధంపై ఎందుకీ నిర్లిప్తత?

ఇప్పటివరకూ విరసం రెండు సార్లు నిషేధానికి గురయింది. కానీ గత యాభై ఏళ్లుగా ఆ సంస్థది అదే నిబద్ధత, ఆచరణ. మరి రెండు సందర్భాల్లో మాత్రమే విరసం ప్రమాదకర సంస్థగా కనపడి, మిగతా సమయాల్లో ప్రభుత్వాలకి నిరపాయకరంగా తోచిందా?! సమస్యల్లా ప్రభుత్వాల్లో, వాటిని నడిపే రాజకీయపార్టీల్లో, వాటికున్న మతతత్వ ఎజెండాల్లో, రాజకీయ ప్రయోజనాల్లో ఉన్నది. ప్రశ్నలను సరే, చివరికి వేరే అభిప్రాయాలను కూడా సహించలేని స్థితి. అయిదు దశాబ్దాల కాలంలో విరసం తెలుగు సాంస్కృతిక రంగపు చైతన్యానికి తను నమ్మిన మార్గంలో కృషి చేసింది. సాహిత్య కళలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలు కూడా ఉంటాయని నమ్మడం, గ్రహించిన వాటిని రాయడం, మాట్లాడటం చేసినందుకే ఈరోజు విరసం నిషేధానికి గురైంది. 


2005లో ఆంధ్రప్రదేశ్‌ మొదటిసారిగా విరసాన్ని నిషేధించి నపుడు అది పెద్దవార్త. ప్రజల పక్షాన మాట్లాడే రచయితల సంస్థని నిలబెట్టుకోవడం తమ బాధ్యతగా భావించారు చాలా మంది. కానీ ఇప్పటి నిషేధంపై చాలామంది నిర్లిప్తంగా ఉన్నారు. రెండవ వేవ్‌ కరోనా వల్ల కావొచ్చు, గత నాలుగై దేళ్లుగా ఊపిరి సలపని వరుస నిర్బంధాలు, నిషేధాల వల్ల కావొచ్చు, తెలంగాణలోని చాలామంది రచయితలు, కళాకారులు ప్రభుత్వంలోపల ఉండటం వల్ల కావొచ్చు. త్రాసు అటువైపే భారీగా తూగుతూ ఉండటం, సందిగ్ధ మౌనం పచ్చి వాస్తవం.  

కె. ఎన్‌. మల్లీశ్వరి

పునరాలోచన చేయాలి

తెలుగు సాహిత్యం భిన్న భావాలు విభిన్న ఆలోచనల ప్రవాహం. ఏ సాహిత్య సంస్థ అయినా తను నిర్ధారించుకున్న తాత్విక సారస్వతాన్ని వ్యక్తీకరి స్తుంది. దానిని బయటకు రానీ యకుండా నిలువరించడం తగని పని. తెలంగాణ సాధన క్రమంలో సకల ప్రజాస్వామిక సంస్థలతో కలిసి ఉద్యమించిన చరిత్ర మనది. సాహిత్య సంస్థను నిషేధానికి గురి చేయడంపై స్వయంగా సాహిత్యకారుడైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి.

అన్నవరం దేవేందర్‌


‘‘ఈ టైమింగ్‌ అనుమానాస్పదం’’

ఏదో ఒకటి రాసేవాళ్ళనే కదా రచయితలు అంటారు. పాపం చాలామంది రచయితలు దేవుని భజనో, దేశ భజనో, ప్రభుత్వ భజనో చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు- దిక్కుండో, దిక్కులేకో! ఎవరో కొద్దిమంది ‘పిచ్చివాళ్ళు’ మాత్రం ప్రజలు అని, వాళ్ళకి తిండి అని, చదువని, ప్రజల ఆరోగ్యం అని, ఇలాంటివి వాళ్ళ హక్కులని మాట్లాడుతున్నారు. వీళ్ళే ప్రత్యేక తెలంగాణ కోసం కూడా మాట్లాడారు. ‘నక్సలైట్‌ ఎజెండానే మా ఎజెండా’ అని తెలంగాణ భవన్‌లో ఉద్యమ సారథి కెసిఆర్‌ ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. సరిగ్గా పదేళ్ళు తిరిగే సరికి ‘విరసం’తో సహా 16 సంస్థల్ని నిషేధించారు! ఇవేమో రాజ్యాంగబద్ధ సంస్థలు. ‘నక్సల్స్‌దీ మాదీ ఒకే ఎజెండా’ అని కెసిఆర్‌ అంత ధైర్యంగా మూతి బద్ధలు కొట్టినట్టు ఇప్పటి దాకా అయితే చెప్పలేదు. అయినా గానీ నిషేధం! 


అసలు నిషేధం విధించిన ఈ టైమింగ్‌ అనుమానాస్పదంగా ఉంది. ఈ పాండమిక్‌ టైమ్‌లో సి.ఎ.ఎ., ఎన్‌.ఆర్‌.సి., ఫార్మ్‌ బిల్స్‌, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ లాంటి పెద్ద పెద్ద దిక్కు మాలిన నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అవి తప్పు అని చెప్పటం కూడా ఈ సంస్థలు చేసిన నేరం అట! కరోనా కట్టడి విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ.. ఎట్ల విఫలమయ్యాయో ప్రజలకు చెప్పే, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అడిగే ‘నేరం’ చేస్తారేమో అనే భయంతో.. ఆ ఇంత గొంతుని కూడా పెగల్చకుండా, సఫా చేసే కార్యక్రమమే ఈ నిషేధాజ్ఞలు అనిపిస్తోంది. 

చైతన్య పింగళి

నిషేధమా! నీ ముల్లెక్కడ ?

విరసం మిగతా సంస్థలతో కలిసి మావోయిస్టులను ప్రోత్స హిస్తుంది అన్నది ఈ నిషేధ మూలాంశం. విరసం పూర్తి పేరులోనే విప్లవం అని ఉంది. ‘‘విప్లవాన్ని ఆశించే రచయితలం మేము’’ అని మొహమాటం లేకుండానే 1970 నుండి చెప్పు కుంటున్నారు వాళ్ళు. అంటే - ఒక తరహాలో సామాజిక మార్పును ఆశించే రచనలు చేసే గుంపు మేము అని నీళ్ళు నమలకుండా చెప్పుకుంటున్నారు. ఇందులో కొత్తగా బయటకు వచ్చిన సీక్రెట్‌ ఏమీ లేదు భాషకు మూలం ఊహ. ఊహ లేనిదే భాష లేదు. ప్రతి మనిషికి ఈ సమాజం పట్ల, దాని మార్పు పట్ల ఒక్కో ఊహ ఉంటుంది. అందులో యథాతథ వాదం నుండి ప్రోయాక్టివ్‌గా సమాజాన్ని మార్చాలనే దుగ్ధ కలిగి ఉన్న ఎన్నో వాదాలు ఉండవచ్చు. వాదం అన్నది ఊహల ఆలోచనల సమూహం. ఆ ఊహలు ఆలోచనల సమూహానికి ఒక తీరు తెన్నులు కలిగించేది భాష. భాషకు చైతన్యం తోడైనప్పుడే సాహిత్యం ఉద్భవిస్తుంది. 


ఊహలతోనే సమాజాలు మారేట్టు ఉంటే, పోర్న్‌ సాహిత్యం ఇంకా ఎందుకు బతికుందో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. ఊహ ఆలోచనగా మారడం, ఆ ఆలోచన పంచుకోగలిగే రాతగా మారడం, ఆ రాత క్రియాశీలంగా మారడం ఇదంతా గొప్ప ప్రక్రియ. ఒకటి రెండు సంస్థలకు, ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదిది. మనిషి ఆర్థిక జీవన గతిలో ప్రాడక్టివిటీ పెరిగేంతవరకు భాష అవసరం లేకుండానే మూగ సైగలతో జీవితం గడిపేసాడు. 


ఆర్థిక ప్రగతిని అందుకోడానికి, మరింత ప్రభావవంతంగా కమ్యూనికేట్‌ చేయడానికి, భాష ఏర్పడింది. ‘ఊహ’ అన్న ఒక మిథ్యా రూపానికి, పదార్థం చేర్చబడి, ఒక చైతన్యాన్ని సృష్టించడం జరిగింది. ఈ భాష, సాహిత్యం - మనిషి, సమాజంతో ముడివడి వేల సంవత్సరాల కొద్దీ జరిపిన ఈ పయనంలో మనం ఎన్నో ఫలాలు అనుభవించాము. ఇది మరిచి - ఈ ఊహ నాకు నచ్చదు కాబట్టి, దానికి సంబంధించిన భాష కాని, సాహిత్యం కాని నాకు నచ్చదు అనడం వెర్రితనం. ఆ వెర్రితనంతో ప్రభుత్వం వ్యక్తుల్లో ఒక టెర్రర్‌ను సృష్టించ గలదు. అయితే- ఒక phenomenon లా పాతుకుపోయిన అసంతృప్తిని ఏ మాత్రం ఆర్పలేదు. ప్రభుత్వం చెప్పే ప్రతి విషయము బై డీఫాల్ట్‌ నిజం అయిపోతే - మనకు ఈ సమాచార మాధ్యమాలు, సాహితీ మాధ్యమాలు ఎందుకు కేవలం ప్రభుత్వ డాక్యుమెంట్‌లు జీవోలు తప్ప?


విరసం చేస్తుంది తప్పా ఒప్పా అన్నది ప్రశ్న కాదు. విరసం రాజ్యాంగాతీతంగా ఏమన్నా తప్పు చేస్తుందా అన్నదే ప్రశ్న. అది కోర్టులో తేలాలి. అయితే ప్రభుత్వం ఒక పక్క UAPAలు పెడుతుంది. ఇంకో పక్క కుట్ర కేసులు పెడుతుంది. వీటితో ప్రభుత్వానికి తన బలం మీద ఇంకా నమ్మకం రావటం లేదులా ఉంది. తెరాసా పార్టీ అయితే ఏకంగా విరసాన్ని వేసుకుని ఏడేళ్ళ క్రితం తెలంగాణ కోసం పోరాడింది. మరి ఏడేళ్ళలో తమ పార్టీ మాత్రం అలాగే ఉండి విరసం సామాజిక తిరోగమన సంఘం ఎలా అయ్యిందో జనాలకు ఈ పార్టీ, ప్రభుత్వం తెలపాలి. అంబేద్కర్‌ చెప్పినట్టు రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే బలం ఉపయోగించా లనుకునే రోజు రాజ్యాంగం విఫలమైనట్టే. ఈ నిషేధం ప్రభుత్వం ఎంత బలమైనదో అంత బలహీనమైనది అని కూడా తెలియజేస్తోంది. 

పి. విక్టర్‌ విజయ్‌ కుమార్‌

‘‘దీన్ని వొక సంస్థపైన నియంత్రణగానే చూడలేం!’’

అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు- అని మా కాలేజీ గోడల మీద రాసుకున్న రోజుల నించి ఇప్పుడు ఎక్కడికి వచ్చామో ఆలోచిస్తూ వెళ్తే, మన జాడ తెలియదు. కానీ, ఆ సూర్యకాంతిని అరుదైన దీపంలా రెండు చేతులా కాపాడుకొస్తున్న సంస్థలో, వ్యక్తులో కొందరైనా అలా మిగిలే వున్నందుకు కొంచెం గుండె దిటవుగా వుంటుంది. రాజ్యవ్యవస్థ ఆలోచ నల్ని అపహరించి, ఖండించడానికి ఏ మారణాయుధం విసిరినా ఎదురుచెప్పే ప్రతిఘటన స్వరం వొకటి వుంది కదా అన్న నమ్మకం ఈ తరానికి ఇంకా వుంది. అట్లాంటి వొక నమ్మకమే విరసం. 


గత రెండు దశాబ్దాలుగా ముఖ్యంగా రాజ్యం అనేది మతాన్ని మాత్రమే ఏకైక అస్త్రంగా వుపయోగించుకొని, మనుగడ సాగిస్తున్న వికృత సందర్భంలో ఇవాళ పీడిత స్వరాలన్నీ వొకే వైపు నిలబడే సన్నివేశం అనివార్యంగానే ఏర్పడుతోంది. ఆ వైపు నిలబడే సంస్థల్లో విరసం వొకటి అని నేను గట్టిగా నమ్ముతున్నా. ముఖ్యంగా మా తరం ఎదుర్కొంటున్న ఆలోచనల రాపిడికి కావల్సిన భాషనీ, తాత్విక నుడికారాన్నీ అందించిన శక్తిగా విరసం పాత్రని ఇప్పుడు మరోసారి మననం చేసుకోవాల్సిన స్థితి కూడా వుంది. రాజ్యం వైపా, ప్రజల వైపా అన్నది ఈ కాలానికీ, ఈ తరానికీ కూడా తప్పనిసరి సంఘర్షణే. ప్రజ అంటే ఇప్పుడు ఇంతకుముందులాంటి అమూర్తమైన భావన కాదు. ఇప్పుడు అది ఇంకాస్త నిర్దిష్టమైన వాడుక. ఈ నేపథ్యంలో విరసంపై నిషేధాన్ని కేవలం వొక సంస్థ పైన నియంత్రణగానే చూడలేం. అంతకుమించిన కుట్రగానే దాన్ని భావించాలి. ఆ కుట్ర ప్రజాస్వామ్యం మీద! జనం గొంతుక మీద! విరసం కేవలం కవులూ రచయితల సమూహం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెడ్తున్న మూల స్తంభాల్లో వొకటని చెప్పడానికి ఆ సంస్థ యాభై ఏళ్ల చరిత్రే సాక్షి. ఖమ్మం కేంద్రంగా సంస్థాగత రూపం తీసుకున్న విరసం ఆ తరవాత అనేక మలుపులు తిరిగింది. ప్రతిఘటన అనే భావనకి విశాలమైన వేదికగా మారింది. పాట, వచన కవిత్వం, వచన సాహిత్యం, విమర్శ వంటి ప్రక్రియలుగా  విరసం విస్తరించిన దారులు మనల్ని తీర్చిదిద్దాయి. అంతకంటే ఎక్కువగా ఈ యాభై యేళ్ళల్లో తెలుగు వాళ్ళ భవిష్యద్‌ దృక్కోణానికి అవసరమైన సాధనాలు కొన్ని విరసం సమకూర్చి పెట్టింది. ఇప్పుడీ నిషేధం అట్లాంటి దృక్కోణంపై ఎక్కుపెట్టిన అస్త్రమే!

అఫ్సర్‌

‘‘ఈ నిషేధం తెలంగాణ తన అస్తిత్వాన్ని తానే చెరిపేసుకోవడం లాంటిది!’’


ఐదు దశాబ్దాల ధిక్కార స్వరం విరసం. ఉష్ణ కాసారంలా పుటంపెట్టిన ఉద్యమ వాహికగా సిలుగురి నుండి సిక్కోలు మీదుగా బస్తర్‌ దాకా విస్తరించింది. అదొక నిత్య నిర్బంధాల చరిత్ర. కేవలం చరిత్ర తెలియనివాడే విరసాన్ని కాలరాయాలని చూస్తాడు. విరసం మొదలు రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌, తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌, తెలంగాణ జనసభ లాంటి సంఘాలు సంయుక్త కార్యాచరణ వివిధ దశల్లో తెలంగాణ ఉద్యమ నినాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకొని పోయాయి అనేది దాచేస్తే దాగని సత్యం. ఇవాళ తెలంగాణ  రాజ్య దృష్టిలో అవి దేశ ద్రోహులు అవడం విషాదం.


విరసం ఆవిర్భావం అది నిలబెట్టిన చర్చ.. ఆ పునాదుల మీదుగానే సకల జనుల నెరవేరని స్వప్నంలా తెలంగాణ ఫీనిక్షు పక్షిలా పడుతూ లేస్తూ విజయాన్ని ముద్దాడింది. ఒక చారిత్రక సంధి దశలో ఆవిర్భవించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను, కనీస ప్రజాస్వామిక విలువలను నిలబెట్టుకోలేని సంక్షోభం లోకి పోయింది. ఆ సంక్షోభమే దశాబ్దాల ప్రజా ఆందోళనలకు వాహిక అయిన విరసాన్ని నిషేధించడం. నిజంగా ఇది ఆత్మహత్య సదృశ్యం. ఏ త్యాగాల పునాదిగా లక్షలాదిగా కదిలి తెలంగాణను కాపాడుకున్నారో అవే శక్తులు ఏకమై విరసాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం మనందరి ముందు ఉంది. విరసం మీద నిషేధం అంటే తెలంగాణ తన అస్తిత్వాన్ని తాను చెరిపేసుకోవడమే.

గుఱ్ఱం సీతారాములు

Advertisement
Advertisement
Advertisement