అంకమ్మ దేవతకు 150వ జాతర

ABN , First Publish Date - 2022-05-20T04:11:20+05:30 IST

ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామ దేవత అష్టపద్మాల అంకమ్మతల్లి 150వ జాతర మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరగనుంది.

అంకమ్మ దేవతకు 150వ జాతర
అమ్మ వారి మూల విరాట్‌

నేడు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

ఆరు విద్యుత్‌ ప్రభలు 


ముండ్లమూరు, మే 19 : మండలంలోని ఈదర గ్రామ దేవత అష్టపద్మాల అంకమ్మతల్లి 150వ జాతర మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రతి ఏడాది మే నెల మూ డో వారంలో అమ్మవారి జాతర చేస్తారు. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలిరానున్నారు. శ్రీశుభకృత నామసంవత్సరం ఉత్తరాయణం వైశాఖమాసం కృష్ణపక్షం వసంత రుతువు రోజున శనివారం జాతర జరగనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కుంకుమార్చన, పసుపు, కుంకుమతోపాటు అంకమ్మ తల్లికి నాలుగు రోజులపాటు జంతు బలి చేయడం ఆనవాయితీ. జాతర చివరి రోజున అమ్మవారికి పొంగళ్లు పెట్టిన నైవేద్యాన్ని సమర్పించనున్నారు. 

జాతర నేపథ్యం

150 ఏళ్ల క్రితం ఈదర గ్రామానికి చెందిన నాగమల్లి వంశస్థులు గాజుల వ్యాపారం నిమిత్తం తెలంగాణ వెళ్లి నదిలో స్నానం చేస్తుండగా కొందరి వద్దకు ఒక ట్రంకు పెట్టె కొట్టుకొచ్చింది. అందులో బంగారం ఉందని నాగమల్లి వంశస్థులు ఈదర తీసుకొచ్చి తెరిచి చూడగా అందులో అష్ట పద్మాల అంకమ్మ తల్లి విగ్రహం కనిపించింది. అందులో కొంతమందికి ఒంటిలో పూనకం వచ్చి నేను గణసాల వంశస్థుల ఆడపిల్లనని, కొన్ని దశాబ్దాల క్రితం నేను తెలంగాణాకు వెళ్లానని చెప్పటంతో గ్రామస్థులు ఆ ఏడాదే నాగమల్లి వంశస్థుల కోడలిగా భావించి ఆలయం కట్టించి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నేటికి ఆలయం ఏర్పడి 150 ఏళ్లు కాగా జాతర కూడా ఆ ఏడాది నుంచే నిర్వహిస్తున్నారు. గణసాల వంశస్థుల ఆడ బిడ్డ అయిన అంకమ్మ తల్లిని జాతరకు ఐదు రోజుల ముందుగా దేవాలయం నుంచి వారి ఇంటికి తీసుకుపోవటం,జాతరకు ముం దు రోజు నాగమల్లి వంశస్థులకు కోడలు కావటంతో తిరిగి ఊరేగింపుగా కోడలిని దేవాలయంలో ఉంచుతారు. మరుసటి రోజు అమ్మవారి జాతర జరుగుతుంది. అంకమ్మ సోదరి కాట్ల అంకమ్మకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పర్యవేక్షణలో సీఐ భీమానాయక్‌ ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఎస్‌ఐలు, 50 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


టీడీపీ వర్గీయుల తడిక ప్రభ

బొప్పూడివారిపాలేనికి చెందిన టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన తడిక ప్రభ గురువారం సాయంత్రం భారీ ఊరేగింపుతో తరలివచ్చింది.  పెద్దఎత్తున మహిళలు ప్రభ పగ్గాలు పట్టుకొని తరలించుకొచ్చారు.


జాతరకు ఆరు విద్యుత్‌ ప్రభలు 

బొప్పూడివారిపాలేనికి చెందిన టీడీపీ ఏర్పాటు చేసిన రెండు విద్యుత్‌ ప్రభలు, ఈదరకు చెందిన టీడీపీ ప్రభ, జనసేన పార్టీ ప్రభ, ఈదర, కొమ్మారంలకు చెందిన వైసీపీ ఆఽధ్వర్యంలో రెండు ఏర్పాటు చేశారు. 

 

Updated Date - 2022-05-20T04:11:20+05:30 IST