అంజిబాబు అటా.. ఇటా

ABN , First Publish Date - 2020-08-10T10:59:36+05:30 IST

విశాఖలో వైసీపీలో చేరడానికి ఘంటానాథం..

అంజిబాబు అటా.. ఇటా

రసవత్తరంగా భీమవరం రాజకీయం

గంటా బాటలో పయనిస్తారా..?

టీడీపీలో కొనసాగుతారా...?

నోరు మెదపని మాజీ ఎమ్మెల్యే

తేల్చుకోలేకపోతున్న టీడీపీ


ఏలూరు-ఆంధ్రజ్యోతి: విశాఖలో వైసీపీలో చేరడానికి ఘంటానాథం వినిపించారు.. మరి జిల్లాలో పరిస్థితి ఏమిటి.. ప్రస్తుతం ఇదే జిల్లా అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో అత్యంత కీలకమైన భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పార్టీని వీడతారా, కొనసాగుతారా అనే దానిపై తర్జన భర్జన జరుగుతున్నది. ఆయనకు సమీప బంధువు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే భీమవరంలో అంజిబాబు కొనసాగే అంశం సస్పెన్స్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడానికి సిద్ధం అవుతున్న తరుణంలో అంజిబాబు అంశంపై సమాలోచనలో పడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. 


ఇంతకు ఏమి జరగబోతుంది...

భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఒక ప్రత్యేక గుర్తింపు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కీలక రాజకీయాలు, వ్యవహారాల్లో ఈ నియోజకవర్గానిదే పైచేయిగా ఉండేది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అంజిబాబు విభజన నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీతో జతకట్టారు. పార్టీ పరంగా కీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాలో గంటా శ్రీనివాసరావుతో భీమవరం నుంచి అంజిబాబుకు సీటు ఖరారు చేశారు. కొందరు సీనియర్లను బుజ్జగించి మరీ ఆయన్ను సైకిలెక్కించారు. తెలుగుదేశం పాలనలో ఐదేళ్ల పాటు వివాదాలకు దూరంగా మెలిగారు. పార్టీ వ్యవహారాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి భీమవరం నుంచి పోటీ చేసిన అంజిబాబు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల పట్ల కొంత దూరంగా ఉన్నారు.


ఒకవైపు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పార్టీలో కూడా పెద్దగా కలిసిరాలేదని అసంతృప్తితోనే గడుపుతూ వచ్చారు. పార్టీ అధిష్ఠానం ముందస్తు హామీతో ఆర్థికభారాన్ని వ్యక్తిగతంగా మోయాల్సి వచ్చిందని, దాని సంగతి కూడా తేల్చాలన్నట్టుగా అధిష్ఠానానికి సన్నిహితుల ద్వారా సమాచారం పంపారు. దీనిపై అధిష్ఠానం నోరు మెదపకపోవడంతో ఎన్నికల తరువాత సైలెంట్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు. దీంతో జిల్లాలో కొందరు అంజిబాబును బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ అధిష్ఠానం అంతా చూసుకుంటుందని ఇప్పటికే భరోసా ఇచ్చిందని, ఇవేమీ పట్టించుకోకుండా యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు సైలెంటే... ఇటువంటి తరుణంలో ఇదే నియోజకవర్గానికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మెంటే పార్ధసారథి, కోళ్ళ నాగేశ్వర రావు వంటి నేతలంతా టీడీపీ ఇచ్చిన పిలుపుకు స్పందించి కొన్ని కార్యక్రమాలను విజయవంతం చేయగలిగారు. 


మారడమా... తటస్థమా...?

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం నుంచి వైదొలగడమా, లేక క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వెళ్లిపోవడమా అనే అంశంలో అంజిబాబు వ్యక్తిగతంగా తర్జనభర్జన పడుతున్నారు. దీనికి తోడు అంజిబాబు వియ్యంకుడు విశాఖలో కీలకనేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయంగా తేలింది. ఆయనతో పాటే అంజిబాబును కూడా వైసీపీలోకి తీసుకువెళతారన్న ప్రచారం ముమ్మరం అయ్యింది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు చేరికకు వైసీపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో మరి అంజిబాబు వ్యూహమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


కొందరు సన్నిహితులు ఆయన ముందు ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నప్పుడు చిరునవ్వుతో సరిపెడుతున్నారు. దీంతో అంజిబాబు ఆంతర్యం తెలియక పార్టీలో కొంత తికమక ఉంది. తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరుగా ఇప్పటికీ వైసీపీలో చేరారు. కానీ మెంటే పార్ధసారథి వంటి సీనియర్‌ నేతలు మాత్రం పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఈలోపే లోక్‌సభ నియోజక వర్గాల కమిటీలు ప్రకటిస్తే నరసాపురం నుంచి సీతారామలక్ష్మికి మరోసారి అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే అంజిబాబు యథావిధిగా పార్టీలోనే కొనసాగితే నియోజకవర్గ నాయకత్వ బాధ్యతలు ఆయనే సారధ్యం వహించేలా చూస్తారు. లేదంటే ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషణ ప్రారంభిస్తారు.

Updated Date - 2020-08-10T10:59:36+05:30 IST