అంజన్న దీక్ష..ఆరోగ్య రక్ష

ABN , First Publish Date - 2022-05-08T05:28:39+05:30 IST

‘జై భోలో హనుమాన్‌ మారాజ్‌కీ’ నినాదం, ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం’ అనే దండకం ఆలయాల్లో హోరెత్తుతున్నది. ‘జయ హనుమాన జ్ఞానగుణ సాగర’ చాలీసా మంత్రం భక్తుల నోట నానుతున్నది. కరోనా నేపథ్యంలో గడిచిన రెండేళ్లు చాలా మంది హనుమాన్‌ భక్తులు మాలధారణకు దూరమయ్యారు.

అంజన్న దీక్ష..ఆరోగ్య రక్ష
సిద్దిపేటలోని రావిచెట్టు హనుమాన్‌ ఆలయ ట్రస్టు భవనంలో భిక్ష చేస్తున్న భక్తులు

  పెద్ద సంఖ్యలో హనుమాన్‌ మాలధారణ

 కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం

 ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణంలో వేలాది భక్తులు

 పలు ఆలయాల్లో నిత్యం స్వాములకు భిక్ష


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 7: ‘జై భోలో హనుమాన్‌ మారాజ్‌కీ’ నినాదం, ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం’ అనే దండకం ఆలయాల్లో హోరెత్తుతున్నది. ‘జయ హనుమాన జ్ఞానగుణ సాగర’ చాలీసా మంత్రం భక్తుల నోట నానుతున్నది. కరోనా నేపథ్యంలో గడిచిన రెండేళ్లు చాలా మంది హనుమాన్‌ భక్తులు మాలధారణకు దూరమయ్యారు. రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ కాషాయ దుస్తుల్లో దీక్షా స్వాములు కళకళలాడుతున్నారు.  

40ఏళ్ల క్రితం సిద్దిపేటలో ఈ మాలధారణ ప్రారంభమైందని చెబుతున్నారు. విజయవాడకు చెందిన హనుమాన్‌ ఆశ్రమ పీఠాధిపతి దుర్గాప్రసాద్‌ స్వామి ఆనాడు ఇక్కడ మాలధారణ గురించి విస్త్రృతంగా ప్రచారం చేయడంతో తొలుత ఐదుగురితో ఈ దీక్ష ప్రారంభమైందని అంటుంటారు. ఇప్పటికీ దుర్గాప్రసాద్‌ స్వామి ఏటా సిద్దిపేటకు వచ్చి దీక్షాపరులతో మమేకమవుతుంటారు. ఆనాడు ఐదుగురితో ప్రారంభమైన ఈ దీక్ష నేడు లక్షల మందికి విస్తరించింది. జిల్లాలో 20వేల మందికిపైగానే హనుమాన్‌ భక్తులు మాలధారణ చేస్తారు. ఈ సీజన్‌లో హనుమాన్‌ భక్తులకు చాలామంది ఇళ్లలో భిక్షలు ఏర్పాటు చేస్తారు. సిద్దిపేటలోని రావిచెట్టు హనుమాన్‌ ఆలయం, గణేశ్‌నగర్‌ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాల్లో సుమారుగా నిత్యం 3వేల మందికిపైగానే భిక్ష చేస్తుంటారు. ఆలయాల ట్రస్టులు, దాతల సహకారంతో మంచి భోజనం పెడుతున్నారు. రావిచెట్టు రామరాజ్‌ హనుమాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 45 రోజులు, గణేశ్‌నగర్‌ ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో 25 రోజులు నిరాటంకంగా ఈ భిక్షలు జరుగుతుంటాయి. 


ఆధ్యాత్మికం.. ఆరోగ్యం


దీక్ష సమయంలో భక్తులు కఠిన నిబంధనలు ఆచరిస్తుంటారు. ఉదయం పూజ పూర్తయ్యేదాకా మౌనం పాటిస్తారు. మధ్యాహ్నం ఒక్కపూటే భోజనం చేస్తారు. కటిక నేలపై నిద్రిస్తారు. కాళ్లకు చెప్పులు లేకుండానే నిత్యకృత్యాల్లో పాల్గొంటారు. ఈ ప్రక్రియతో శరీరం శుద్ధి అవుతుంది. ప్రతీరోజు రెండుపూటలా చన్నీళ్ల స్నానంతో శరీరం చల్లబడుతుంది. కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆపాదమస్తకం నాడులన్నీ ఉత్తేజితమవుతాయి. పూర్తి శాఖాహార భోజనంతో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. నేలపై నిద్రించడంతో నడుము, మెడ, కాళ్ల నొప్పులు నియంత్రణలో ఉంటాయి. ప్రతీరోజు రెండు చేతులతో చప్పట్లు కొడుతూ భజన చేయడం కూడా ఒక ఆసనం లాంటిదే. 


 

Read more