అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం

ABN , First Publish Date - 2021-07-31T07:50:16+05:30 IST

తిరుమలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి స్పష్టం చేశారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం

అంతర్జాతీయ వెబినార్‌లో సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి


తిరుపతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి స్పష్టం చేశారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’ అంశంపై శుక్రవారం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో రెండు రోజుల వెబినార్‌ ప్రారంభమైంది. ఆహ్వానిత వక్తలు మాత్రమే పాల్గొన్న జూమ్‌ వెబినార్‌ వివరాలతో టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకారం.. అంజనాద్రి ఆంజనేయుడు జన్మస్థలం అనే  విషయంలో ఎలాంటి సందేహం లేదని, వివాదం అవసరమే లేదని సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి చెప్పారు.  అనేక పురాణాలు ఈ విషయాన్ని పేర్కొన్నట్టు స్వామి వివరించారు. కిష్కింధకు శాస్త్ర పురాప్రమాణాలు లేవన్నారు. మహీంద్రా విశ్వవిద్యాలయం న్యాయకళాశాల డీన్‌ మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ.. రామాయణాన్ని కూడా అనుమానించే యుగంలో ఉన్నామన్నారు. ధనుష్కోటిలోని రామసేతు వంతెనలాంటి అనేక ఆధారాలున్నాయని తెలిపారు. 2007లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ముద్రించిన హనుమాన్స్‌ కేం అనే పుస్తకంలోనూ అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని రాశారని చెప్పారు. టీటీడీ కంటే ముందే చాలా మంది ఈ విషయం రాశారన్నారు. ఆంజనేయుడి జన్మస్థలం విషయంలో అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్రమైన పుస్తకం ముద్రిస్తామని సంస్కృత విద్యాపీఠం వీసీ, పండిత పరిషత్‌ అధ్యక్షుడు మురళీధర్‌ శర్మ పేర్కొన్నారు. 


అవసరమైతే మరోసారి సమావేశం 

తాను ఈవోగా బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం అనే విషయం గురించి పలు మెయిల్స్‌ వచ్చాయని జవహర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు ఆధారాలు ఉన్నాయని పండితులు తనకు చెప్పాక గతేడాది డిసెంబరులో పండిత పరిషత్‌  ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జార్ఖండ్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రలో ఆంజనేయుడి జన్మస్థలాలుగా అక్కడి వారు నమ్ముతున్న ప్రాంతాలను కూడా పండిత పరిషత్‌ పరిశీలించిందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా బుక్‌లెట్‌ విడుదల చేశామని, అయినా ఈ అంశాన్ని సశేషంగానే ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను సూచనలను ఆహ్వానించినట్టు చెప్పారు. ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపటానికి వస్తే చర్చ పెట్టామన్నారు. కానీ, వారు మాట్లాడిన భాష, వ్యవహరశైలి అభ్యంతరకరంగా ఉండటంతో ఇక మాట్లాడలేదన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ వెబినార్‌లో తిరుమల పెద్ద జీయర్‌ స్వామి, రమ్యానందభారతి స్వామి, సముద్రాల రంగరామానుజాచార్యులు, వెంపడి కుటుంబరావు, కె.మునిరత్నం, శంకరనారాయణ, జాదవ్‌ విజయకుమార్‌, ప్రసన్నకుమార్‌, సింగరాచార్యులు, గోపీకృష్ణ, ఆకేళ్ల విభీషణ శర్మ, సదాశివమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T07:50:16+05:30 IST