Abn logo
Sep 26 2021 @ 00:04AM

ఇంటినుంచే సాధికారత

అమ్మ టీచర్‌, నాన్న సైన్యంలో అధికారి. దాంతో మా ఇంట్లో డిసిప్లిన్‌, చదువుకు ప్రాధాన్యం ఉండేది. అలాగే చదువు విషయంలో స్వేచ్ఛ నిచ్చారు. నేను ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో బీకామ్‌ ఆనర్స్‌ చదివాను. అక్కడ సీటు తెచ్చుకోవడం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. డిగ్రీ వరకు నా చదువంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. నాన్న వేరే రాష్ట్రానికి చెందినప్పటికీ మేం హైదరాబాదీల కిందే లెక్క.  మా అమ్మ పని చేసే నాసర్‌ స్కూల్‌లో చదువుకున్నాను. అక్కడ చదువుకు తోడు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. 


ఆడపిల్లలం, మేం అన్నింటిలో పాల్గొనేవాళ్ళం. చదువు, జాబ్‌, ఆరోగ్యం... ఇలా ప్రతి విషయంలో పురుషుడితో సమానంగా హక్కులు ఉన్నప్పుడు మాత్రమే ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ సాధ్యమవుతుంది. ఇది ఎవరో ఇస్తే పుచ్చుకునేదిగా ఉండకూడదన్నది నా అభిప్రాయం. పురుషుడు మాదిరిగానే మహిళ కూడా తన విషయంలో తనకే సంపూర్ణ అధికారం ఉండాలి. సర్వసమగ్ర వ్యక్తిత్వంతోనే అన్నీ సాధ్యమవుతాయి. స్త్రీ, పురుషుల మధ్య అన్నింటికంటే ఉండాల్సింది పరస్పరం అవగాహన. అదే ఇంట్లో ఆరంభమైతే, సమాజానికి అన్వయించవచ్చు. విద్య, ఆరోగ్యం సమానంగా అందించినప్పుడు స్త్రీ సాధికారికత దానంతట అదే వస్తుంది. ఒక అధికారిగా మున్ముందు నేను అవకాశం ఉన్న చోటల్లా ఆ విషయం మీదే పనిచేయడానికి ప్రయత్నిస్తాను.


నా సివిల్స్‌ ప్రిపరేషన్‌ విషయానికి వస్తే ‘కనిసిస్టెన్సీ’ ముఖ్యం అని భావించేదానిని. మెయిన్స్‌లో ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా చదివాను. రోజుకు ఎనిమిది గంటలకుపైగా కష్టపడేదాన్ని. టెస్ట్‌ సిరీస్‌ ఎక్కువ రాశాను. లోపాలు గుర్తించి సవరించుకునేదాన్ని. చదువు పూర్తయిన తరవాత కొంతకాలం డెలాయిట్‌లో చేశాను. నా ఆప్షనల్‌ కూడా కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ. అంటే నా కోర్‌ సబ్జెక్టు. దీంతో ఇంటర్వ్యూలో ప్రశ్నలు కూడా ఆ పరంగానే వచ్చాయి. ఆడిటింగ్‌, బ్యాంకింగ్‌, టాక్స్‌పై ఎక్కువ అడిగారు. అవికాకుండా అంటే ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇప్పటి పరిణామాలు, విభజన తరవాత తెలంగాణ అభివృద్ధిపై అడిగారు. 


పేరు:  అనీషా శ్రీవాస్తవ్‌

ర్యాంకు: 66

స్వస్థలం: హైదరాబాద్‌

తండ్రి: వింగ్‌ కమాండర్‌ రూప్‌ కుమార్‌ శ్రీవాస్తవ్‌

తల్లి: చిత్రాంజన (టీచర్‌) 

తమ్ముడు: అంజన్‌ (సీఈఎ్‌సలో సివిల్‌ ఇంజనీర్‌)


ఎడ్యుకేషన్‌ డెస్క్‌