సోంపు.. ఆరోగ్యానికి ఎంతో ఇంపు..!
ABN , First Publish Date - 2022-08-13T17:26:31+05:30 IST
మనం వంటింట్లో చేసే కొన్ని రకాల తీపి పదార్థాల తయారీలో సోంపు గింజలను కూడా ఉపయోగిస్తుంటాం
మనం వంటింట్లో చేసే కొన్ని రకాల తీపి పదార్థాల తయారీలో సోంపు గింజలను కూడా ఉపయోగిస్తుంటాం. సోంపు గింజలను వాడడం వల్ల తీపి పదార్థాల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తరచూ సోంపు గింజలను తింటూ ఉండడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందొచ్చు. సోంపు గింజలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. మనలో చాలా మంది భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సోంపు గింజలను ఉపయోగించి మనకు వచ్చే చిన్నచిన్న అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. వీటిని సంస్కృతంలో మధురిక అని అంటారు. వీటిని తిన్న వెంటనే వేడిచేసి తరువాత చలువు చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. సోంపు గింజలను తినడం వల్ల జీర్ణాశయానికి, గుండెకు, మెదడుకు బలం చేకూరుతుంది. వాత రోగాలను నయం చేయడంలో ఈ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
కాలేయం, మూత్రపిండాలను, మూత్రాశయాన్ని శుభ్రపరిచే శక్తి కూడా సోంపుగింజలకు ఉంటుంది. దోరగా వేయించిన సోంపు గింజల పొడి 100 గ్రాములు, యాలాకుల పొడి 100 గ్రాములు ఒక రోజంతా నీటిలో నానబెట్టి పొట్టు తీసి ఎండబె ట్టిన సీమ బాదం పప్పుపొడి 100 గ్రాములు, పటిక బెల్లం పొడి 100 గ్రాముల మోతాదులో తీసుకుకోవాలి. వీటన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన మూడు గంటల తరువాత ఒక టీస్పూన్ పొడిని ఒక గ్లాస్ వేడి పాలలో కలుపుకుని తాగడం వల్ల పుస్టిగా తయారవుతారు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. దీనిని పిల్లలకు కూడా ఇవ్వవచ్చు.
నార్సింగ్, హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి)