Abn logo
Sep 27 2021 @ 00:21AM

రోడ్లపైనే జంతు వధ

రోడ్డు మీదే పొట్టేలు కోసి బండ్లపై మాంసం విక్రయిస్తున్న వ్యాపారులు

యథేచ్ఛగా చేపలు, మాంసం విక్రయం 

పట్టించుకోని పంచాయతీ అధికారులు

ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటు చేయాలని

ప్రజల వినతి

కంభం, సెప్టెంబరు 26 : కంభం పంచాయతీకి ప్రత్యేకంగా  మార్కెట్‌ లేకపోవడంతో మాంసం, చేపల విక్రయాలు రోడ్లపైనే సాగిస్తున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నా యి. రోడ్లపైన జంతువుల వధ జరుగుతున్నా వారి చలించడం లేదు. అధికారులు కబేలాలకు స్థలం కేటాయిస్తున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదు. మాంసాహార దుకాణాల్లో శుచి, శుభ్రత లోపిస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. కందులాపురం సెంటర్‌, రావిపాడురోడ్డు సెంటర్‌లలో బహిరంగంగా మాంసం విక్రయాలు, చేపల విక్రయాలు జరుగుతుంటాయి. ఆయా వ్యర్థాలను అదే ప్రదేశాలలో వదిలివేయడంతో దుర్గంధం వెదజల్లుతున్నదని ప్రజలు సంబంధిత అధికారులు తెలియచేసినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. చేపలకు మార్కెట్‌ లేకపోవడంతో కందులాపురం, రావిపాడు సెంటర్లలో విక్రయాలు జరుగుతున్నాయి. సుమారు 20 మంది వివిధ ప్రాంతాల నుంచి చేపలను తీసుకుని వచ్చి అమ్ముతుంటారు. దీనితో ఆయా ప్రాంతాల నుంచే వచ్చే దుర్గంధాన్ని పరిసర వాసులు భరించలేక పోతున్నారు. బహిరంగ జంతువధ చట్టరిత్యా నేరమని మాంసం విక్రయదారులు ఆగడం లేదు. జంతువు ఆరోగ్యంగా ఉందని వెటర్నరీ డాక్టర్‌ ధృవీకరించిన తరువాతనే జంతువధ చేయాలి. దానిని కబేలాలలో మాత్రమే వధించాలి. తదుపరి దుకాణాలకు తరలించి విక్రయించుకోవాలి. అవి ఏమీ అమలు కావడం లేదు. కారణం ఇక్కడ మార్కెట్‌ లేకపోవడంతో రోడ్డు పక్కనే జంతువుల గొంతు కోసి, తోలు వలిచి విక్రయాలు చేస్తుండడంతో మాంసం కొనుగోలుదారులు రోడ్డుకు సగం వరకు తమ వాహనాలు ఆపి కొనుగోలు చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య కూడా ఏర్పడుతున్నది. ఇప్పటికైనా కందులాపురం పంచాయతీ అధికారులు మాంసం, చేపల విక్రయాలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు. 

ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తాం

ఈవిషయంపై కందులాపురం పంచాయతీ కార్యదర్శి బ్రహ్మయ్యను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా జంతువులు, చేపల విక్రయాలకు ప్రత్యేకంగా మార్కెట్‌ స్థలం లేదని, ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని, ఆర్‌ అండ్‌ బి బంగ్లా ముందు వైపు గాని లేదా ఫారెస్టు గెస్ట్‌హౌస్‌ ముందు భాగాన గాని అమ్ముకుంటే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 

 - బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి


కందులాపురం సెంటర్‌లో రోడ్లపైనే చేపలు అమ్ముకుంటున్న మహిళలు