మాజీ హోం మంత్రికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

ABN , First Publish Date - 2021-11-06T22:43:05+05:30 IST

మనీలాండరింగ్ కేసులో ఆరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు..

మాజీ హోం మంత్రికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

ముంబై: మనీలాండరింగ్ కేసులో ఆరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు శనివారంనాడు ప్రత్యేక హాలిడే కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరో తొమ్మిది రోజులు రిమాండ్ పొడిగించాలని చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. జ్యూడిషియల్ రిమాండ్‌కు ఆయనను పంపింది.


అనిల్ దేశ్‌ముఖ్‌ను గత సోమవారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 12 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది. అనంతరం కోర్టు ముందు హాజరుపరచడంతో నవంబర్ 6 వరకూ ఈడీ కస్టడీకి కోర్టు ఆయనను అప్పగించింది. ఈడీ కస్టడీ శనివారంతో ముగియనుండటంతో ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు. మరో తొమ్మిది రోజుల కస్టడీని ఈడీ కోరినప్పటికీ కోర్టు నిరాకరిస్తూ జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది.


అనిల్ దేశ్‌ముఖ్‌‌పై రూ.100 కోట్ల మేరకు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు  ఆరోపణలున్నాయి. ముంబైలోని హోటల్స్, బార్స్ నుంచి నెలకు రూ.100 కోట్ల రూపాయలను ప్రతి నెలా వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్  అసిస్టెంట్ కమిషనర్‌గా డిస్మిస్ అయిన సచిన్ వాజెను అడిగారనేది పరమ్ భీర్ సింగ్ ప్రధాన అభియోగం. దీనిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేయగా, ఈడీ సైతం దర్యాప్తు జరుపుతోంది. దేశ్‌ముఖ్‌తోపాటు ఆయన సహచరులైన కుందన్ షిండే, సంజీవ్ పలాండేలను ఈడీ ఈ కేసులో అరెస్టు చేసింది. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

Updated Date - 2021-11-06T22:43:05+05:30 IST