నగలు అమ్మి చట్టపరమైన ఫీజులు కట్టుకున్నా: అనీల్ అంబానీ

ABN , First Publish Date - 2020-09-26T23:24:10+05:30 IST

అనీల్ అంబానీ.. ఒకప్పుడు ప్రపంచపు దనవంతులలో ఆరో స్థానం పొందిన వారు. ప్రస్తుతం..ఆయన మార్కెట్ విలువు సున్నా! ఈ విషయాన్ని ఆయనే గతంలో వెల్లడించారు. తాజాగా.. తాను ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించి న్యాయపరమైన ఖర్చులను నగలమ్మి చెల్లించానని అనీల్ అంబానీ చెప్పుకొచ్చారు.

నగలు అమ్మి చట్టపరమైన ఫీజులు కట్టుకున్నా: అనీల్ అంబానీ

లండన్: అనీల్ అంబానీ.. ఒకప్పుడు ప్రపంచపు ధనవంతుల జాబితాలో ఆరో స్థానం పొందిన వ్యక్తి. ప్రస్తుతం..ఆయన మార్కెట్ విలువ సున్నా! ఈ విషయాన్ని ఆయనే గతంలో వెల్లడించారు. తాజాగా.. తాను ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించి న్యాయపరమైన ఖర్చులను నగలమ్మి చెల్లించానని అనీల్ అంబానీ చెప్పుకొచ్చారు.


అనీల్ సంస్థలకు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు చైనాకు చెందిన మూడు బ్యాంకులు గతంలో బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి.దీనికి సంబంధించి శుక్రవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణకు హజరయ్యారు.  తన జీవనశైలి, ఆస్తిపాస్తులు, అప్పులకు సంబంధించి అనీల్ పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.


‘నేను చాలా సింపుల్ వ్యక్తిని. నాకు రోల్స్ రాయిస్ కారు ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అతిశయోక్తులే. నా వద్ద ఓ కారు మాత్రమే ఉంది. నా ఖర్చులన్నీ పరిమితంగానే ఉంటాయి. నా భార్య, కుటుంబమే ఈ ఖర్చులను భరిస్తారు. నేను విలాసవంతమైన జీవితం గడపను. నాకు మరే ఇతర ఆదాయ మార్గాలు కూడా లేవు. నగలు అమ్మి చట్టపరమైన ఖర్చులు చెల్లించా. మరే ఖర్చులైనా చేయాల్సి వస్తే ఇతర ఆస్తులను అమ్మాలి. అందుకోసం కోర్టు అనుమతి అవసరం’ అని ఆయన తెలిపారు. 



కాగా.. ఈ కేసుకు సంబంధించి చైనా బ్యాంకులకు రూ. 5821 కోట్లు తిరిగివ్వడంతో పాటూ చట్టపరమైన ఖర్చుల కింద మరో 7 కోట్ల రూపాయలు చెల్లించాలని బ్రిటన్ కోర్టు మే 22న అనీల్ అంబానీని ఆదేశించింది. కానీ..కోర్టు ఇచ్చిన గడువులోపు అనీల్ చెల్లింపులు చేయలేకపోయారు. దీంతో తనకు సంబంధించిన ఆస్తులన్నిటీ గురుంచి తెలియపరుస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు జూన్ 29న అనీల్‌ను ఆదేశించింది. 


అనంతరం.. శుక్రవారం నాడు జరిగిన విచారణలో కోర్టు అనిల్‌ను పలు ప్రశ్శలు వేసింది. తన తల్లికి అనీల్ బాకీ పడ్డ 66 మిలియన్ డాలర్లు, కుమారుడికి బాకీ పడ్డ 41 మిలియన్ డాలర్ల గురించి కూడా కోర్టు ప్రశ్నించింది. ఆ అప్పులకు సంబంధించి పూర్తి వివరాలు తనకు గుర్తు లేవని అనీల్ పేర్కొన్నారు. అయితే..అవి తనకు వారి నుంచి అందిన బహుమతులు కావని మాత్రం స్పష్టం చేశారు.


ఇదిలా ఉంటే ‘మాకు చిల్లి గవ్వ కూడా చెల్లించకుండా ఉండేందుకు ఆయన పెద్ద యుద్ధమే చేస్తున్నారు’ అని చైనా బ్యాంకుల తరఫు ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమకు ఆస్తులు దక్కకుండా ఉండేందుకు వాటి యాజమాన్య హక్కులన్నీ కార్పొరేట్ కంపెనీల పేరిట పెట్టారనేది అనీల్ కంపెనీలకు అప్పులిచ్చిన వారు చేస్తున్న ప్రధాన ఆరోపణ. 

Updated Date - 2020-09-26T23:24:10+05:30 IST