కోర్టు ఖర్చుల కోసం నగలు అమ్ముకున్నా..

ABN , First Publish Date - 2020-09-27T07:48:42+05:30 IST

బకాయిలు చెల్లించేందుకు తన దగ్గర ఇంకేం మిగల్లేదంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ చేతులెత్తేశారు. కోర్టు ఖర్చుల కోసం నగలన్నీ అమ్మేయాల్సి వచ్చిందని బ్రిటన్‌ న్యాయస్థానం ధర్మాసనం ముందు అనిల్‌ వాపోయారు...

కోర్టు ఖర్చుల కోసం నగలు అమ్ముకున్నా..

  • సాధారణ జీవితం గడుపుతున్నా.. 
  • ప్రస్తుతం నాకున్నది ఒకటే కారు
  • బ్రిటన్‌ కోర్టులో అనిల్‌ అంబానీ 

లండన్‌: బకాయిలు చెల్లించేందుకు తన దగ్గర ఇంకేం మిగల్లేదంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ చేతులెత్తేశారు. కోర్టు ఖర్చుల కోసం నగలన్నీ అమ్మేయాల్సి వచ్చిందని బ్రిటన్‌ న్యాయస్థానం ధర్మాసనం ముందు అనిల్‌ వాపోయారు. పలు మీడియా కథనాల్లో పేర్కొన్నట్లుగా తనది విలాస జీవనశైలి కాదని.. తాను సామాన్య వ్యక్తినని అన్నారు. అంతేకాదు, తానెప్పుడూ రోల్స్‌ రాయిస్‌ కారు కొనలేదని.. ప్రస్తుతం తనవద్ద ఒకే ఒక కారు ఉందని కోర్టుకు వెల్లడించారు. నా వ్యక్తిగత ఖర్చులు సైతం చాలా తక్కువని, వాటిని నా భార్య, కుటుంబ సభ్యులే భరిస్తున్నారని అన్నారు. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ధనవంతుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీకి స్వయానా సోదరుడు.. దేశంలోని కార్పొరేట్‌ ప్రముఖుల్లో ఒకరైన అనిల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 


కేసు పూర్వాపరాలు: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌).. మూడు చైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. చైనా డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఈ రుణం మంజూరు చేశాయి. రిలయన్స్‌ జియో ప్రవేశంతో పూర్తిగా దివాలా తీసిన ఆర్‌కామ్‌.. ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. తమకు రావాల్సిన 68 కోట్ల డాలర్ల బకాయిల కోసం చైనా బ్యాంకులు లండన్‌లోని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించాయి. ఈ రుణానికి అనిల్‌ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారని, ఆయన ఆస్తుల విక్రయం ద్వారా బకాయిల రికవరీకి అవకాశం కల్పించాలని బ్యాంకులు వాదించాయి. బ్రిటన్‌ కోర్టు సైతం చైనా కంపెనీలకు అనుకూలంగా తీర్పిచ్చింది. జూన్‌ 12కల్లా 3 బ్యాంకులకు 71.69 కోట్ల డాలర్ల (రూ.5,821 కోట్లు) బకాయిలతో పాటు కోర్టు ఖర్చుల కింద 7.5 లక్షల డాలర్లు చెల్లించాలని మే 22న కోర్టు అనిల్‌ను ఆదేశించింది. కానీ, అంబానీ బకాయిలు చెల్లించడంలో విఫలమయ్యారు. దాంతో చైనా బ్యాంక్‌లు జూన్‌ 15న మళ్లీ లండన్‌ కోర్టును ఆశ్రయించాయి. 


ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఆస్తులను వెల్లడించాల్సిందిగా అంబానీని ఆదేశించాలని కోరాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే, తనకున్న లక్ష డాలర్ల (రూ.74 లక్షలు) కంటే విలువైన ఆస్తులన్నింటినీ వెల్లడించాలంటూ జూన్‌ 29న కోర్టు అంబానీని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తాజా విచారణ శుక్రవారం నాడు జరిగింది. ముంబై నుంచి వీడియోకాన్ఫరెన్సింగ్‌ ద్వారా అంబానీ ఈ కేసు విచారణకు హాజరయ్యారు. బ్యాంకుల తరఫు కౌన్సిల్‌ వాదిస్తున్నట్లు తన వద్ద రోల్స్‌రాయిస్‌ తదితర లగ్జరీ కార్లేమీ లేవని, కేవలం ఒకటే కారు ఉందన్నారు. ఈ కేసు ఖర్చుల కోసం ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్యలో నగలన్నీ అమ్మేయగా రూ.9.9 కోట్లు సమకూరాయన్నారు. ‘‘అందరూ అనుకుంటున్నట్లు అనిల్‌ అంబానీది ఆడంబర, విలాస జీవనశైలి కాదు. ఆయన సాధారణ అభిరుచులు కలిగిన సామాన్య వ్యక్తి. పూర్తిగా కుటుంబం, కంపెనీకే అంకితమయ్యారు. మారథాన్‌ రన్నర్‌. ఆత్యాధ్మికుడు. శాకాహారి కూడా. ధూమ, మద్యపానానికి దూరంగా ఉంటాడు. షికారుకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చొని పిల్లలతో కలిసి సినిమా చూడ్డానికి ఇష్టపడతాడ’’ని కేసు విచారణ సందర్భంగా అనిల్‌ ప్రతినిధి పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-27T07:48:42+05:30 IST