అనిల్‌ అంబానీపై ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2020-03-20T06:28:51+05:30 IST

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ.. గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు హాజరయ్యారు. తన నిర్వహణలోని తొమ్మిది కంపెనీలకు యెస్‌ బ్యాంక్‌ నుంచి...

అనిల్‌ అంబానీపై  ప్రశ్నల వర్షం

9 గంటల పాటు విచారించిన ఈడీ 


ముంబై: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ.. గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు హాజరయ్యారు. తన నిర్వహణలోని తొమ్మిది కంపెనీలకు యెస్‌ బ్యాంక్‌ నుంచి రూ.12,800 కోట్ల రుణాలు తీసుకోవటంపై ఈడీ అధికారులు అనిల్‌ అంబానీని దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. ఈ రుణాలు ఇచ్చినందుకు బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ రాణా కపూర్‌, ఆయన భార్య బిందు వారి కుమార్తెలకు లేదా వారి నిర్వహణలోని కంపెనీలకు ‘ఇతర’ చెల్లింపులేమైనా చేశారా? అని ఈడీ అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం. ఈ నెల 30న మరోసారి తమ ముందు హాజరు కావాలని ఈడీ అధికారులు అంబానీని కోరారు. 


రూ.4,300 కోట్ల ముడుపుల ఖాతా !

రాణా కపూర్‌, ఆయన నిర్వహణలోని కంపెనీల ఖాతాల్లో ఈడీ అధికారులు రూ.4,300 కోట్ల అక్రమ నిధులను గుర్తించా రు. ఇవన్నీ బడా కంపెనీలకు యెస్‌ బ్యాంక్‌ నుంచి ఇచ్చిన రుణాలకు ప్రతిగా ‘ముడుపు’ల రూపంలో రాణాకపూర్‌ కుటుంబానికి అందాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. దీంతో రాణా కపూ ర్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ అధికారులు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.


రేపు సుభాష్‌ చంద్ర విచారణ

ఈ కేసులో జీ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్రనూ ఈడీ అధికారులు శనివారం ప్రశ్నించబోతున్నారు. ఇందుకోసం ఆయనకు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌తో సహా ఇంకా పలువురు పారిశ్రామికవేత్తలకు ఈడీ ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. 

Updated Date - 2020-03-20T06:28:51+05:30 IST