నిర్లక్ష్యంపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-06T06:21:40+05:30 IST

సిద్ధాపురం చెరువుకు గండి పడినా ఇరిగేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు, రైతులు మండిపడుతున్నారు.

నిర్లక్ష్యంపై ఆగ్రహం

  1. ప్రమాదపుటంచున సిద్ధాపురం చెరువు
  2. లీకేజీలపై సమాచారం ఇచ్చినా స్పందించరా..?
  3. అధికారుల తీరుపై రైతులు, ప్రజల మండిపాటు
  4. రాత్రంతా చెరువు కట్టపైనే మాజీ ఎమ్మెల్యే బుడ్డా
  5. తాత్కాలిక మరమ్మతులతో తప్పిన ముప్పు


ఆత్మకూరు, డిసెంబరు 5: సిద్ధాపురం చెరువుకు గండి పడినా ఇరిగేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు, రైతులు మండిపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సమాచారం ఇచ్చినా అర్ధరాత్రి వరకు స్పందించ కపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పొరపాటున చెరువు తెగిపోయి ఉంటే తమ పరిస్థితి ఏమిటని దిగువ ప్రాంత గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపామని ఆవేదన చెందారు.  తెలుగు గంగ పథకం ఈఈ, డీఈ, ఏఈఈలకు సమాచారం వెళ్లినా స్పందించలేదని అంటున్నారు. అయితే పెద్దతూము వద్ద మట్టి కట్టకు కాంక్రీట్‌ రివిట్‌మెంట్‌ చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు. 


రాత్రంతా చెరువు కట్టపైనే..


ఇరిగేషన్‌ అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుగంగ పథకం ఈఈ, డీఈ, ఏఈఈలకు సమాచారం వెళ్లినా పెద్దగా స్పందించలేదు. దీంతో గండ్లను పూడ్చేస్తారా లేక రైతులతో కలిసి తామే ఆ పని చేయాలా..? అని ప్రశ్నించారు. గండ్లను పూడ్చే వరకు తాను చెరువు కట్టపైనే ఉంటానని చెప్పి రాత్రంతా తన అనుచరులతో చలిలో అక్కడే ఉన్నారు. కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్‌, ఇరిగేషన్‌ సీఈ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ సుబ్బరాయుడు, డీఈ నగేష్‌, ఏఈలు మంజునాథ్‌, శివనాయక్‌, తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు అర్ధరాత్రి దాటిన తర్వాత చెరువు కట్టపైకి చేరుకున్నారు. ప్రజల ఒత్తిళ్లతో తెల్లవారుజామున 3గంటల సమయంలో 9 ట్రిప్పర్ల మట్టిని పోతిరెడ్డిపాడు నుంచి తీసుకొచ్చి ఎక్స్‌కవేటర్‌ ద్వారా గండ్లను పూడ్చారు. ఆదివారం సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.


ఏడు దశాబ్దాల క్రితం..


సుమారు 70 సంవత్సరాల క్రితం చెరువు కట్ట తెగినట్లు పెద్దలు చెబుతున్నారు. సమీపంలోని పది గ్రామాలతోపాటు ఆత్మకూరులో కొన్ని కాలనీలు నీట మునిగాయని అంటున్నారు. అప్పట్లో చెరువు సామర్థ్యం తక్కువగానే ఉండింది. ఆయకట్టు 1000 ఎకరాలు మాత్రమే. ఇప్పుడు చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ప్రమాదవశాత్తూ కట్ట తెగితే జరిగే నష్టం ఊహకందదని అప్పట్లో విపత్తును చూసిన పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు.



నిర్లక్ష్యంపై ఆగ్రహం


సిద్ధాపురం చెరువు కట్ట తెగి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ ఇరిగేషన్‌ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెరువుకట్ట మరమ్మతు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అన్నమయ్య డ్యాం పట్ల కూడా ఇదే తరహాలో నిర్లక్ష్యం వహించి 41 మంది ప్రాణాలను బలికొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా అధికారుల తీరులో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు. 


ఏం జరిగింది..?


సిద్ధాపురం చెరువు పెద్దతూము వద్ద నాలుగైదు రోజులుగా సీపేజ్‌ వాటర్‌ లీకవుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి రంధ్రాలుపడి  నీటి వృథా అధికమైంది. చెరువు గరిష్ఠ నీటి మట్టం 21 అడుగులకు గాను అప్పటికే 19 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 0.645 టీఎంసీలు కాగా అప్పటికి 0.6 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. లీకేజీల గురించి తెలుగుగంగ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. ఏఈ శివనాయక్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. సాధారణ లీకేజీలుగా భావించి, ట్రాక్టర్‌లో మట్టి తీసుకు రావాలని సిబ్బందికి సూచించారు. మట్టి కోసం వెళ్లిన ట్రాక్టర్‌ అక్కడే ఇరుక్కుపోవడంతో లీకేజీల సమస్యను గాలికి వదిలేశారు. రాత్రి 10 గంటలకు లీకేజీలు గండ్లుగా మారాయి. నీరు భారీగా బయటకు వెళ్తోంది. ఆ నీటిని సమీప పంట పొలాల్లోకి వెళ్లకుండా తూము కాల్వలోకి రైతులు దారి మళ్లించారు. గంట గంటకూ గండ్ల తీవ్రత పెరిగింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సిద్ధేపల్లి, ముష్టేపల్లి, పెద్ద అనంతాపురం, సిద్ధాపురం తదితర గ్రామాల్లో రాత్రి 12 గంటల సమయంలో దండోరా వేయించి ఆయా ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. 


నిధుల కొరత


మూడేళ్లుగా సిద్ధాపురం ఎత్తిపోతల నిర్వహణకు నిధుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు రూ.4 కోట్లకు పైగా బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఈ కారణంగా మట్టికట్ట బలోపేతం, తూము గేట్ల మరమ్మతులు, చెరువు కట్టపై జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి ప్రధాన పనులు కూడా చేపట్టలేదు. దీనివల్ల కట్టకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిద్ధాపురం చెరువు కట్ట నిర్వహణకు రూ.3 లక్షల మాత్రమే ఉన్నాయని, వాటితోనే తాత్కాలిక పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. 



ప్రభుత్వ నిర్లక్ష్యం: బుడ్డా 


రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిద్ధాపు రం చెరువుకు గండ్లు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా ఎత్తిపోతల పథకం నిర్వహ ణను గాలికి వదిలేశారు. చెరువు కట్టపై జంగిల్‌ క్లియరెన్స్‌ చేయలేని పరిస్థితు లు ఏర్పడ్డాయి. లీకేజీలు ఏర్పడి భారీగా నీరు వృథా అవుతున్నా అధికార యం త్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదు. గండ్లను పూడ్చాల్సిందిపోయి అధికార పార్టీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.


శాశ్వత చర్యలు: ఎమ్మెల్యే


సిద్ధాపురం చెరువును శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. లీకేజీల గురించి తెలుసుకున్నారు. లీకేజీలు తక్కువ గా ఉన్నాయని, బుడ్డా రాజశేఖరరెడ్డి అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి అనవసర రాద్ధాంతం చేశారని ఆరోపించారు. ఇరిగేషన్‌ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. 



బిక్కుబిక్కుమంటూ గడిపాం


సిద్ధాపురం చెరువు కట్టకు గండ్లు పడ్డాయని తెలియడంతో గ్రామస్థులందరం రాత్రంతా భయం భయంగా గడిపాం. నాలుగైదు రోజుల కిందటే చెరువు కట్టకు లీకేజీలు ఉన్నాయని ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మీ ఊళ్లు మునిగితే మేమేం చేయాలని అధికారులు అనడం బాధాకరం.


 - మద్దమ్మ, సిద్ధాపురం


 దండోరా వేయించడంతో భయపడ్డాం


శనివారం అర్ధరాత్రి గ్రామంలో దండోరా వేయించారు. చాలా భయమేసింది. చెరువు కట్ట తెగుతోంది అని ప్రచారం జరగడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం.  ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడాలి..? ప్రభుత్వం స్పందించి సిద్ధాపురం చెరువు కట్టను బలోపేతం చేయాలి.


 - సుగాలి సీతమ్మ, పెద్ద అనంతాపురం 


Updated Date - 2021-12-06T06:21:40+05:30 IST