తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-09T05:05:44+05:30 IST

రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. జిల్లా అంతటా భారీ ర్యాలీలు, సభలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం రైతులందరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని... అంతే త్వరగా చెల్లింపులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
బొబ్బిలిలో భారీ ర్యాలీ చేస్తున్న టీడీపీ శ్రేణులు, ఇనసెట్‌లో మాట్లాడుతున్న అశోక్‌గజపతిరాజు

రైతు సమస్యలపై జిల్లా అంతటా నిరసనలు

భారీగా హాజరైన పార్టీ శ్రేణులు

పార్వతీపురంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. జిల్లా అంతటా భారీ ర్యాలీలు, సభలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం రైతులందరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని... అంతే త్వరగా చెల్లింపులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

  ఇకనైనా మేలుకోండి: అశోక్‌

బొబ్బిలి రూరల్‌, జనవరి 8: ఒక్క అవకాశం అని జగన్‌ అడిగినందుకు ... అనాలోచితంగా ఆయనకు ఓటు వేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఇకనైనా విచక్షణతో ఓటు వేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు హితవు పలికారు. ధాన్యం రైతుల ఇబ్బందులపై బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బేబీనాయన ఆధ్వర్యంలో  శనివారం ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ సెంటరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశోక్‌ మాట్లాడుతూ అధికార పార్టీ దౌర్జన్యాలకు, దాడులకు వెరవకుండా ధైర్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో అధికారం అందుకుని రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు తీరుపై రైతులంతా గగ్గోలు పెడుతుంటే... ఈ రాజ్యం ఎందుకు? ఈ మంత్రులు ఎందుకు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కేవలం తమ బిల్లుల కోసమే పని చేస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మాట్లాడుతూ నాడు చంద్రబాబు తన సర్వశక్తులూ ఒడ్డి వ్యవస్థలను కాపాడితే జగన్‌ తన హయాంలో సర్వనాశనం చేశాడన్నారు. రైతుల గురించి ఏమాత్రం తెలియని వలంటీర్లకు, ఇతర ఉద్యోగులకు వారి సంక్షేమాన్ని అప్పగించారని ఎద్దేవా చేశారు.  బొబ్బిలి టీడీపీ ఇన్‌చార్జి బేబీనాయన, మాజీ ఎంఎల్‌ఎ తెంటు లక్ష్మునాయుడులు మాట్లాడుతూ  రైతులకు భరోసా లేకుండా పోయిందని, పండుగ పూట రైతుల ఇంట సంతోషం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, భీమిలి ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కేఏ నాయుడు, మహంతి చిన్నంనాయుడు, త్రిమూర్తులురాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది దుర్మార్గపు ప్రభుత్వం: సంధ్యారాణి

సాలూరు : రాష్ట్ర ప్రజలు ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పట్టణంలో శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు. తన ఇంటి నుంచి డీలక్స్‌ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వరకూ ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పేరు తగిలిస్తోందని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా  రాష్ట్రంలో రైతుల కష్టాలు వర్ణనాతీతమని అన్నారు. విత్తనాలు కోనుగోలు చేసిన నాటి నుంచి ఆ పంట చేతికి వచ్చి విక్రయించే వరకూ చాలా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ పాలనలో ఎవరికీ భద్రత, భరోసా, భవిష్యత్‌ లేదని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మక్కువ మండల అధ్యక్షుడు వేణుగోపాలరావు, సాలూరు మండల అధ్యక్షుడు పరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 మోకాళ్లపై తెలుగు తమ్ముళ్ల నిరసన

జియ్యమ్మవలస : రైతులను దగా చేస్తున్న ఈ ప్రభుత్వం చివరి దాకా అదే పనిలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. మండలంలోని పెదమేరంగి కూడలిలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, తెలుగు  రైతు అధ్యక్షుడు దేవకోటి వెంకట నాయుడు ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ  రైతులు  పండించే ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళారుల బారినపడకుండా కౌలు రైతుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి త్వరగా డబ్బులు చెల్లించాలని కోరారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరడాన తవిటినాయుడు, నంగిరెడ్డి మధుసూదనరావు, అక్కేన మధుసూదనరావు, తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజితకుమార్‌, పల్లా రాంబాబు, బిడ్డిక తమ్మయ్య, రాగాల అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. 

పార్వతీపురంలో ఉద్రిక్తత

పార్వతీపురం : పార్వతీపురంలో టీడీపీ శ్రేణులు శాంతియుతంగా చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. శనివారం  ఉదయం పార్వతీపురం టీడీపీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో ట్రాక్టర్లపై ర్యాలీగా బయలుదేరారు. ప్రధాన రహదారిపైకి చేరుకోగానే ఎస్‌ఐ కళాధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇచ్చేది లేదని చెప్పారు. ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ర్యాలీకి ఎంత మాత్రం అనుమతించలేదు. దీనిపై జగదీష్‌, చిరంజీవులు మాట్లాడుతూ రైతులను ఉసూరుమనిపించే ఏ ప్రభుత్వం నిలవదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, కోలా వెంకటరావు, గర్భాపు ఉదయభాను, దొగ్గ మోహన తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-09T05:05:44+05:30 IST