Abn logo
Sep 25 2021 @ 00:16AM

ప్రభుత్వంపై ఆగ్రహం

మాట్లాడుతున్న సముద్రాల హనుమంతరావు

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 24: బ్రాహ్మణ కార్పొరేషన్‌ బీసీ కార్పొరేషన్‌లో విలీనం చేయడం అవమానించడమేనని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి సముద్రాల హనుమంత రావు విమర్శించారు. శుక్రవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర అర్చక పురోహిత విభాగం అధ్యక్షుడు రవిచంద్ర శర్మ, మహిళా అధ్యక్షురాలు మారుతిశర్మ, పరశురామ పరివార్‌ యువసేన అధ్యక్షుడు ఆనంద్‌, నాగవరం రాజశేఖర్‌, దుర్గా ప్రసాద్‌, దేవి ఫంక్షన్‌ హాలు అధినేత చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో చేర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై వారం రోజుల పాటు దేవాలయాల్లో పది నిమిషాలు గంటలు కొడుతూ నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. వారం రోజుల్లో ప్రభుత్వ స్పందన రాని పక్షంలో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు పిండ ప్రదాన కార్యక్రమాలు చేపడుతారని హెచ్చరించారు. 


‘బ్రాహ్మణులను అణగదొక్కే ప్రయత్నాలు’


రాష్ట్రంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు   నిధులు ఇవ్వకుండా ఇప్పటికే నిర్వీర్యం చేశారని, తాజాగా బీసీ కార్పొరేషన్‌లో కలిపి బ్రాహ్మణ జాతిని అణగదొక్కే ప్రయత్నం  రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కుతీసుకోవాలని కోరారు.  లేని పక్షంలో బ్రాహ్మణ సంఘాలన్నీ సంఘటితంగా నిరసన కార్యక్రమాలు చేపడుతాయని హెచ్చరించారు.