విద్యుత్‌ సమస్యలను తీర్చడం లేదని ఏఈపై ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-26T05:01:34+05:30 IST

విద్యుత్‌ ఏఈ నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో కరెంట్‌ సమస్యలు తీరడం లేదని, మొదటి పల్లెప్రగతిలో సూచించిన సమస్యలు పరిష్కారం కాలేదంటూ సర్పంచులు విద్యుత్‌ ఏఈ మధుకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్‌ సమస్యలను తీర్చడం లేదని ఏఈపై ఆగ్రహం
మనోహరాబాద్‌ మండల సమావేశంలో మాట్లాడుతున్న విద్యుత్‌ ఏఈ మధుకర్‌



మొదటి పల్లెప్రగతిలో చెప్పిన సమస్యలను కూడా పరిష్కరించలేదని మండిపాటు

వాడీవేడిగా మనోహరాబాద్‌ మండల ప్రజాపరిషత్‌ సమావేశం

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), జూన్‌ 25: విద్యుత్‌ ఏఈ నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో కరెంట్‌ సమస్యలు తీరడం లేదని, మొదటి పల్లెప్రగతిలో సూచించిన సమస్యలు పరిష్కారం కాలేదంటూ సర్పంచులు విద్యుత్‌ ఏఈ మధుకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎంపీపీ నవనీత అధ్యక్షతన మనోహరాబాద్‌ మండల పరిషత్‌ సమావేశాన్ని నిర్వహించారు. పరికిబండలో ఫీడర్‌ మార్పు చేయాలని సూచించినా చేయడంలేదని సర్పంచు అర్జున్‌, మనోహరాబాద్‌, పోతారం, రంగాయపల్లి, కూచారంలో స్తంభాల ఏర్పాటు, స్తంభాలను సరిచేయడం చేయాలని సూచించినా పట్టించుకోవడంలేదని సర్పంచులు మహిపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, నాగభూషణం, నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చెట్లగౌరారంలో వీధి దీపాల కోసం స్తంభాలను ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా లైటింగ్‌ ఏర్పాటు చేయడం లేదని సర్పంచు నర్సయ్య పేర్కొన్నారు. మొదటి పల్లెప్రగతిలో సూచించినా పనులు ఇంకా పూర్తి చేయలేదని, మూడో విడుత పల్లెప్రగతి ముగిపోయిందన్నారు. ఊళ్లో జరిగిన బొడ్రాయి పండుగను చీకట్లో చేశామని సర్పంచు నర్సయ్య పేర్కొన్నారు. నిధులు రాగానే పనులు చేయిస్తానంటూ ఏఈ మధుకర్‌ పేర్కొన్నారు. నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకొచ్చి పనులు చేయడం లేదని తెలిపారు. సీఎం నియోజకవర్గంలో నిధులు లేకపోవడం ఏంటని, ఊళ్లల్లో ఇలాగే చెబితే ప్రజలు ఉరుకుంటారా? అంటూ ఆగ్రహించారు. రంగాయపల్లిలో ఎఫ్‌టీఎల్‌లో చేసిన నిర్మాణం విషయాన్ని ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించి, చేయించాలని సూచిస్తున్నారని, కూలీలకు వేతనాలు రావడం లేదని సర్పంచులు పేర్కొన్నారు. అక్కడి నుంచే నిధులు రావడం లేదని, నిధులు రాగానే వేతనాలు ఇప్పిస్తామంటూ  ఏపీవో ఆదినారాయణ పేర్కొన్నారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీవో లక్ష్మీనర్సింహులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T05:01:34+05:30 IST