అంగన్‌వాడీలకు అందని వేతనాలు!

ABN , First Publish Date - 2022-05-04T03:56:54+05:30 IST

అంగన్‌వాడీ ఉద్యోగం చిన్నదే అయినా బాధ్యత పెద్దది. అరకొరగా వేతనం ఇస్తున్నా రోజంతా చాకిరీ చేయాల్సిన పరిస్థితి.

అంగన్‌వాడీలకు అందని వేతనాలు!
కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు(ఫైల్‌)

ఏం తినాలి.. ఏలా బతకాలి?

రెండు నెలలైనా పట్టించుకోని అధికారులు

ఉదయగిరి రూరల్‌, మే 3: అంగన్‌వాడీ ఉద్యోగం చిన్నదే అయినా బాధ్యత పెద్దది. అరకొరగా వేతనం ఇస్తున్నా రోజంతా చాకిరీ చేయాల్సిన పరిస్థితి. ఎంతో కష్టపడుతున్నా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అధికారంలోకి రాక ముందు మీ జీవితాలను మార్చేస్తామని చెప్పి ఇప్పుడు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి. వారికి మార్చి, ఏప్రిల్‌ మాసాలకు వేతనాలు అందాల్సి ఉంది. పౌష్టికాహారం పంపిణీ, పిల్లల బరువు, ఎత్తు, కొలతలు, గర్భిణులు, బాలింతలకు రక్తహీనత లేకుండా అదనపు పౌష్టికాహారం అందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధ్యతగా పని చేస్తున్నా వేతనాల చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం సాగుతోంది. వేతనాలు సకాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఏం తినాలి, ఏలా బతకాలంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో 3,447 కేంద్రాలు

ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో 17 ప్రాజెక్టుల పరిధిలో సుమారు 3,447 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.7 వేలు, ఆయాకు రూ.7 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు. సిబ్బందికి కోట్ల రూపాయల్లో వేతన బకాయిలు నిలిచిపోయాయి. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది జీవనం కష్టతరమైందని వాపోతున్నారు. పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు కార్యకర్తలు, ఆయాలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.   

సాంకేతిక సమస్యే కారణం

సిబ్బంది వేతనాల అందకపోవడానికి కారణం సాంకేతిక సమస్యే. సీఎ్‌ఫఎంఎస్‌ విధానం నుంచి పీఎంఎస్‌ విధానంలోకి సాఫ్ట్‌వేర్‌ మార్చడంతో వేతనాలు ఆలస్యమవుతున్నాయి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో వేతనాలు అందేలా చర్యలు చేపడతాం. 

- ఉమామహేశ్వరి, పీడీ, ఐసీడీఎస్‌



Read more