అంగన్‌వాడీలకు అరకొరగానే హాజరు

ABN , First Publish Date - 2022-07-02T06:32:10+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం కార్యక్రమానికి గర్భిణులు, బాలింతల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు.

అంగన్‌వాడీలకు అరకొరగానే హాజరు

మధ్యాహ్న భోజనం కోసం కేంద్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపని గర్భిణులు, బాలింతలు

ఒక్కో సెంటర్‌ పరిధిలో 20 నుంచి 30 మంది ఉంటే...ఒకరిద్దరు రాక

గతంలో మాదిరిగా రేషన్‌ సరకులు ఇంటికి ఇవ్వాలని విజ్ఞప్తి


విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):

అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం కార్యక్రమానికి గర్భిణులు, బాలింతల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. ఒక్కో కేంద్రం పరిధిలో 20-30 మంది లబ్ధిదారులు ఉంటే...మొదటిరోజైన శుక్రవారం ఐదారుగురు మాత్రమే భోజనం చేసేందుకు వచ్చారు. మద్దిలపాలెంలోని ఒక కేంద్రంలో 32 మంది లబ్ధిదారులుంటే, మధ్యాహ్నం 1.30 గంటలు సమయానికి ఒకేఒక్కరు భోజనానికి వచ్చారు. అలాగే, సీతమ్మధార ప్రాంతంలోని ఒక కేంద్రంలో 27 మంది లబ్ధిదారులుండగా,  ముగ్గురు మాత్రమే వచ్చారు. నగర పరిధిలోని అనేక కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 


మెనూ ఇలా.. 

కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోలు బియ్యం, కిలో కంది పప్పు, అర కిలో నూనె, 25 గుడ్లు, ఐదు లీటర్లు పాలు పంపిణీ చేస్తున్నారు. అయితే, ఇకపై ఇంటికి సరకులు ఇవ్వడం ఆపి, లబ్ధిదారులకు మధ్యాహ్నం భోజనం అంగన్‌వాడీ కేంద్రంలోనే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మెనూ కూడా రూపొందించింది. సోమవారం అన్నం, దోసకాయ పప్పు, కోడి గుడ్డు కూర, పాలు (200 మిల్లీ లీటర్లు), మంగళవారం అన్నం, టమాటా పప్పు, కోడిగుడ్డు కూర, పాలు, బుధవారం అన్నం, ఆకుకూర పప్పు, కోడిగుడ్డు కూర, పాలు, గురువారం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, పాలు, శుక్రవారం అన్నం, బీరకాయ లేదా సొరకాయ, మునగాకు లేదా పాలకూరతో గుడ్డు, పాలు, శనివారం వెజిటబుల్‌ రైస్‌, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన గుడ్డు, పాలు ఇవ్వాలని సూచించింది. అయితే తమ నివాసాలకు, కేంద్రాలకు మధ్య దూరం ఎక్కువగా వుండడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు భోజనం కోసం వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇకపోతే, కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు కింద కూర్చుని భోజనం చేయడం మరింత ఇబ్బందితో కూడిన వ్యవహారంగా మారింది. నెలలు నిండిన గర్భిణి కింద కూర్చుని భోజనం చేయడం కష్టం.అలాగే, బాలింతల్లో సిజేరియన్‌ అయినవారు ఉంటారు. అటువంటి వారు నేలపై కూర్చోలేరు. చాలా కేంద్రాల్లో కుర్చీలు అందుబాటులో లేవు. ఇన్ని ఇబ్బందులు వున్న దృష్ట్యా కేంద్రాలకు వచ్చి భోజనం చేసి వెళ్లడం ఇబ్బందిగా వుంటోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. గతంలో మాదిరిగా రేషన్‌ ఇస్తే ఇంట్లోనే వండుకుంటామని చెబుతున్నారు. 

Updated Date - 2022-07-02T06:32:10+05:30 IST