అరకొరగా పౌష్టికాహారం

ABN , First Publish Date - 2022-07-05T06:06:46+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అంద డం లేదు. ప్రతినెలా ఏదో ఒకటి అందకుండా కోత విధిస్తున్నారు.

అరకొరగా పౌష్టికాహారం

ప్రతి నెలా ఏదో ఒకటి కోత
రెండు నెలలుగా అందని పాలు
మారుమూల ప్రాంతాల్లో మరీ దారుణం
నెలమార్చి నెల సరఫరా


ఏలూరు రూరల్‌, జూలై 4 : అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అంద డం లేదు. ప్రతినెలా ఏదో ఒకటి అందకుండా కోత విధిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రా ల్లో నమోదైన చిన్నారులకు, బాలింతలు, గర్భిణుల కు ప్రతినెలా కోడిగుడ్లు, పాలు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, బాలామృతం అందించాల్సి ఉంది. బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు కూడా గర్భిణులు, బాలింతలకు అందించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఏదో ఒక వస్తువును నిలిపివేస్తుంది.


జిల్లాలో 19 ప్రాజెక్టులు
జిల్లాలో 19 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని సుమారు మూడు వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో 60వేల మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో మూడు నుంచి ఐదేళ్ళలోపు చిన్నారులకు ప్రతి రోజు పలు రకాల కూరలతో భోజనం అందించాలి. ఉడికించిన కోడిగుడ్లు, పాలు ఇవ్వాలి. బాలింతలకు, గర్భిణులకు టేక్‌హోమ్‌ రేషన్‌ బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలతో పాటు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా రాగిపిండి, అటుకులు, గోధుమపిండి, జొన్నపిండి, ఎండుకర్జూరం వంటి పౌష్టికాహారం అందించారు. గతంలో సక్రమంగా అందిన ఈ పథకాలకు పేరు మార్చిన ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదు.


రెండు నెలలుగా అందని పాలు
ఏలూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు ఏప్రిల్‌, మే నెలల్లో పాలు అందలేదు. ఇక వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కూడా గర్భిణులు, బాలింతలకు ఒక నెలలో కొన్ని సెక్టార్లలో మాత్రమే అందించి మరికొన్ని సెక్టార్లలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అందించలేదు. మరో నెలలో పామాయిల్‌ కొన్ని సెక్టార్లకు అందించారు. పక్కనే ఉన్న మరో సెక్టారుకు అందనేలేదు. ఒకనెలలో కందిపప్పు వస్తే మరోనెలలో అదే ప్రాజెక్టులోని కేంద్రాలకు పామాయిల్‌ రాదు. మరో నెలలో పాలు అందవు. ఒక నెలలో మిగిలిపోయిన సరుకులు, మరుసటినెలలో పిల్లలకు అందించిన గర్భిణులకు, బాలింతలకు మాత్రం నిరంతరాయంగా సరుకులు అందడం లేదు. ఇక మారుమూల ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కోడిగుడ్లు మాత్రమే ప్రతినెల సక్రమంగా అందుతున్నాయి. మిగతా సరుకులు నెలమార్చి నెల ఇస్తున్నారని తెలిసింది.

Updated Date - 2022-07-05T06:06:46+05:30 IST