అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువు

ABN , First Publish Date - 2021-03-04T06:19:09+05:30 IST

గ్రేటర్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు భవన సమస్య పీడిస్తోంది. పలుచోట్ల శిథిల భవనాల్లోనే నిర్వహిస్తుండడంతో చిన్నారులు, సిబ్బంది బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువు
నాగేంద్రకాలనీలో ఇదే అంగన్‌వాడీ కేంద్రం

పలుచోట్ల శిథిల భవనాల్లోనే నిర్వహణ 

భయంభయంగా గడుపుతున్న చిన్నారులు  

గోపాలపట్నం, మార్చి 3: గ్రేటర్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు భవన సమస్య పీడిస్తోంది. పలుచోట్ల శిథిల భవనాల్లోనే నిర్వహిస్తుండడంతో చిన్నారులు, సిబ్బంది బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు. చిన్నారులను బడిబాట పట్టించడానికి వీలుగా పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో పాటు గర్భిణుల, బాలింతలకు వివిధ రకాల సేవలు అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అందించే సేవలు పెరుగుతున్నా నిర్వహణకు సొంత భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రేటర్‌ పరిధి 89, 91, 92 వార్డుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఈ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో కీలకంగా మారాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు, పౌష్టికాహార పంపిణీ, కిశోరబాలికలకు పౌష్టికాహార పంపిణీ చేపడుతున్నారు. చిన్నారులకు చదువుతో పాటు పౌష్టికాహారం వండి వడ్డించడం నిత్య ప్రక్రియ. వీటికి సంబంధించిన సరుకులన్నీ అంగన్‌వాడీ కేంద్రంలోనే ఉంచాలి. సొంత భవనాలు లేక, ఉన్న చిన్న గదిలోనే సరుకులను సర్ది, చిన్నారులను ఉంచడం కష్టమవుతోందని కార్యకర్తలు వాపోతున్నారు. 

 

ఇదీ ప్రధాన సమస్య

ఈ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో సమీపంలోని పాఠశాలల అదనపు తరగతి గదులు, సామాజిక భవనాలలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు తరగతి గదుల కొరత, స్థానికుల అవసరాలకు సామాజిక భవనాలు లభించడం లేదు. ఇక ఇలా ప్రభుత్వ భవనాలు అందుబాటులోని ప్రాంతాల్లో అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నడుపుతున్నారు. ఇందుకోసం ఐసీడీఎస్‌ నుంచి నెలకు అద్దె రూపేణా రూ.1500 చెల్లిస్తున్నారు. మహానగరంలో ఈ మొత్తానికి ఒక్కగది కూడా లభించడం అసాధ్యం. ఈ క్రమంలో కార్యకర్తలు సొంత డబ్బు జమచేసి గదులు అద్దెకు తీసుకుని కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి అరకొర సౌకర్యాలున్న భవనాల్లో కేంద్రాలను నడుపుతుండడంతో పౌష్టికాహారం పంపిణీ, వ్యాక్సినేషన్‌ సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సరుకుల నిల్వ, చిన్నారులకు విద్యాబోధనకు మరిన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.  స్థానిక పద్మనాభనగర్‌లో పెచ్చులూడుతున్న భవనంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో  ఇబ్బందులు ఎదురవుతున్నా... ఆదిశగా ఐసీడీఎస్‌ అధికారులు, స్థానిక నేతలు దృష్టి పెట్టడం లేదు. నగర పరిధి 89, 91, 92 వార్డుల్లో ప్రస్తుతం 19  కేంద్రాల్లో 16 కేంద్రాలు సామాజిక భవనాలు, పాఠశాల ప్రాంగణాల్లో, మరో మూడింటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ వార్డులో ప్రభుత్వ భూములుండి, ఐసీడీఎస్‌ నుంచి నిధులు మంజూరయ్యే అవకాశం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అధికారులు చొరవ చూపడం లేదు. 



Updated Date - 2021-03-04T06:19:09+05:30 IST