అంగన్‌వాడీ నోటిఫికేషన్‌లో గందరగోళం

ABN , First Publish Date - 2020-09-25T10:04:34+05:30 IST

కేశంపేట మండలానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల కోసం ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌లో గందరగోళం చోటుచేసుకుంది. ఓ తండాలో

అంగన్‌వాడీ నోటిఫికేషన్‌లో గందరగోళం

పోల్కోని గుట్టతండాలో ఖాళీలున్నా పట్టించుకోని వైనం

ప్రాజెక్టు అధికారుల తీరుపై పలువురి అనుమానం


కేశంపేట: కేశంపేట మండలానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల కోసం ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌లో గందరగోళం చోటుచేసుకుంది. ఓ తండాలో అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ నోటిఫికేషన్‌లో చూపలేదు. అలాగే అర్హురాలైన ఓ దళిత ఆయాకు టీచర్‌ పోస్టు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తుంది. కేశంపేట మండలంలోని కేశంపేట రెండో అంగన్‌వాడీ సెంటర్‌కు టీచర్‌ పోస్టు ఖాళీ ఉందని నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇక్కడ దళిత మహిళ సుమారు పదేళ్లుగా ఆయాగా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు అంగన్‌వాడీ టీచర్‌గా పదోన్నతి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నా.. అధికారులు టీచర్‌ పోస్టును నోటిఫికేషన్‌లో పేర్కొనడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. పోల్కోనిగుట్ట తండా అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి అనే టీచర్‌ను ఏడాది క్రితం షాద్‌నగర్‌ బదిలీ చేశారు.


దీంతో ఇక్కడ టీచర్‌ పోస్టు ఖాళీ ఏర్పడింది. అంతేగాకుండా అయాగా విధులు నిర్వహిస్తున్న మసృ అనే మహిళ ఏడాది క్రితం మృతి చెందింది. దీంతో టీచర్‌, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా అధికారులు జారీచేసిన నోటిఫికేషన్‌లో ఖాళీలు చూపకపోవడం గమనార్హం. పోల్కొనిగుట్టతండాకు చెందిన ఓ టీచర్‌ ఇతర ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండటంతో ఆమెను ఇక్కడికి తీసుకురావాలనే ప్రయత్నంలో నోటిఫికేషన్‌లో పోస్టుల వివరాలు రాకుండా షాద్‌నగర్‌ ఐసీడీఎస్‌ ప్రా జెక్టు అధికారులు జాగ్రత్తగా వ్యవహరించారన్న ఆరోపణలు బహిరంగం గా వినిపిస్తున్నాయి. అసలు అంగన్‌వాడీ వ్యవస్థలో టీచర్లు, ఆయాల బదిలీలకు అవకాశమే లేదు.  అయినా అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బదిలీలు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కేశంపేట మండలానికి జారీచేసిన నోటిఫికేషన్‌ను పునఃపరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-09-25T10:04:34+05:30 IST