కొలువుల బేరం!

ABN , First Publish Date - 2022-09-29T05:39:08+05:30 IST

జోన్‌-3 పరిధిలో 142 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. వీటికోసం మూడు జిల్లాల పరిధిలో 5,550 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.

కొలువుల బేరం!

అంగన్‌వాడీలో సూపర్‌వైజర్ల ఎంపికపై ఆరోపణల వెల్లువ

పరీక్షల కీ, ఫలితాలు లేకుండానే ఎంపిక జాబితా

తూతూ మంత్రంగా పదిహేను రోజుల్లో తతంగం

అస్మదీయుల కోసమేనంటూ బాధితుల ఆందోళన


 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నియామక ప్రక్రియ ఉండడం, హడావుడిగా పదిహేను రోజుల్లో పరీక్షలు నిర్వహించడం, పరీక్షల కీ విడుదల చేయకుండా, మార్కులు, మెరిట్‌లిస్ట్‌ ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు అభ్యర్థుల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలున్న జోన్‌ 3 పరిధిలో దాదాపు 5 వేల మంది ఆశావహులు తాము అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

గుంటూరు, సెప్టెంబరు28(ఆంధ్రజ్యోతి): జోన్‌-3 పరిధిలో 142 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. వీటికోసం మూడు జిల్లాల పరిధిలో 5,550 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.   సెప్టెంబరు 5వ తేదీన సూపర్‌వైజర్‌ పోస్టుల ఎంపికకు ఐసీడీఎస్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పరీక్ష ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. హడావుడిగా వారం రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసి, 18వ తేదీన పరీక్షలు నిర్వహించింది. 24వ తేదీన సూపర్‌వైజర్‌ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు పలువురు అభ్యర్థులకు ఐసీడీఎస్‌ నుంచి ఫోన్‌లో సమాచారం వచ్చింది. ఎంపికైన అభ్యర్థులు సీడీపీవో సమక్షంలో మూడునిమిషాల నిడివితో  స్పోకెన్‌ ఇంగ్లీష్‌ వీడియోలు పంపించాలని తెలిపింది. అత్యంత గోప్యంగా, హడావుడిగా జరిగిన ఈ తతంగంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రిపరేషన్‌కు అవకాశం లేకుండా చేసిన వైనం

నోటిఫికేసన్‌ ప్రకటించిన పదిహేను రోజుల్లో పరీక్షలు నిర్వహించడం పట్ల అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాము ముందస్తుగా ఎంపిక చేసిన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు వీలుగా ఇలా హడావుడిగా పరీక్షలు నిర్వహించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షలకు సంసిద్ధమయ్యేందుకు ఏమాత్రం సమయం లేకుండా చేయడం ద్వారా అభ్యర్థులు పోటీ పరీక్షలో వెనుకబడేలా చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. తాము అనుకున్న అభ్యర్థులకు ముందుస్తుగానే సమాచారం ఇచ్చి వారు సంసిద్ధమయ్యాక ఇలా హడావుడిగా పరీక్షలు నిర్వహించారని, తద్వారా మెరిట్‌ జాబితాలో వారు ముందు వరుసలో ఉండేలా చూశారని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మెరిట్‌ లిస్ట్‌ లేకుండానే అభ్యర్థుల ఎంపిక

సూపర్‌వైజర్‌ పోస్టుల ఎంపికకు నిర్వహించిన పరీక్షలు జరిగి పదిరోజులు అవుతున్నా అధికారులు ఇప్పటివరకు కీ విడుదల చేయలేదు. అభ్యర్థుల మార్కుల జాబితా, మెరిట్‌ లిస్టు ప్రకటించలేదు. కానీ ఇంటర్వూలకు ఎంపికైనట్లు పలువురు అభ్యర్థులకు అధికారులు ఫోన్‌ చేసి చెప్పారు. కీ విడుదల చేయకుండా, మెరిట్‌లిస్టు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడంతో అంగన్‌వాడీ ఉద్యోగులు రోడ్డెక్కారు. అభ్యర్థుల ఎంపికకు అనుసరించిన విధానం ఏంటి? ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ఎలా తీసుకున్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కటాఫ్‌ ఎందుకు ప్రకటించలేదు, రోస్టర్‌ అమలు చేశారా లేదా అన్న విషయాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఇంటర్వూకు ఎవరు ఎంపికయ్యారన్న విషయం ఇప్పటికీ గోప్యంగానే ఉంది. దీంతో అభ్యర్థులు గత మూడురోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాఉ. కీ, మెరిట్‌ లిస్టు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఫలితంగా విధిలేని పరిస్థితిలో బుధవారం ఐసీడీఎస్‌ అధికారులు అభ్యర్థుల మార్కుల జాబితా విడుదల చేశారు. 


మార్కుల జాబితా చూసి అభ్యర్థుల షాక్‌

ఐసీడీఎస్‌ ప్రకటించిన మార్కుల జాబితా చూసి అభ్యర్థులు షాక్‌కు గురవుతున్నారు. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సిలబస్‌, కీ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కులు, అధికారులు విడుదల చేసిన మార్కులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 40 మార్కులు వస్తాయని భావించిన అభ్యర్థులకు 25, 30 మార్కుల కంటే ఎక్కువ రాలేదు. దీంతో కీ విడుదల చేయాలని అభ్యర్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా మొత్తం వ్యవహారం అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరిగిందని అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా అనధికారికంగా పలువురు అంగన్‌వాడీ టీచర్లకు సూపర్‌వైజర్‌ పోస్టులు కేటాయించి పనులు చేయించుకుంటున్నారని, ఇప్పుడు ఎంపికైనవారిలో వారే అధికంగా ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణం పరీక్షలు రద్దు చేసి పూర్తి పారదర్శకతతో పరీక్షలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలి..

పదిహేను రోజుల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అయినా సరే అనుకుని పరీక్షలు రాసినా కీ, మార్కులు విడుదల చేయకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మొత్తం ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలి. లేదంటే పరీక్షలు పూర్తిగా రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించాలి. 

- దీప్తి, అంగన్‌వాడీ సంఘం జిల్లా కార్యదర్శి



Updated Date - 2022-09-29T05:39:08+05:30 IST