ఆ.. ఏమెళ్తాంలే

ABN , First Publish Date - 2022-07-05T06:04:38+05:30 IST

హలో.. అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఫోన్‌ చేస్తున్నాం భోజనానికి వస్తారా? మొన్న కూడా వస్తామని రాలేదు. వండించినదంతా వృథా అవుతోంది.

ఆ.. ఏమెళ్తాంలే
అతి తక్కువ సంఖ్యలో అంగన్‌వాడీకి వచ్చి భోజనం చేస్తున్న గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు

అంగన్‌వాడీ ఆహారంపై విముఖత

దూరాభారమని ఇంటి భోజనానికే పరిమితం

కేంద్రాలకు వెళ్లేందుకు గర్భిణులు, బాలింతలు నిరాసక్తి

ఆయాలు ఫోన్‌ చేసి పిలుస్తున్నా ఆసక్తి చూపని లబ్ధిదారులు

పంపిణీ నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడంటున్న మహిళా సంఘాలు


 అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం.. పంపిణీ ప్రహసనంగా మారింది. అంగన్‌వాడీలకు వచ్చి ఆహారం తీసుకెళ్లేందుకు బాలింతలు, గర్భిణులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గతంలో లబ్ధిదారుల  ఇళ్ల వద్ద అంగన్‌వాడీలు ఆహార పదార్థాలను పంపిణీ చేయగా.. ప్రస్తుతం కేంద్రాలకే రావాలనే నిబంధన పెట్టారు. దీంతో ఎక్కువ మంది కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదు. అంతదూరం ఏమి వెళ్తాములే అని లబ్ధిదారుల్లో స్పందన ఉండటంలేదు. కరోనా భయంతో కొందరు.. దూరాభారమని మరికొందరు.. మొత్తం మీద ఎక్కువమంది ఇంటి భోజనానికే పరిమితమవుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా తయారు చేస్తున్న ఆహారం వృథా అవుతుందని కేంద్రాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఫోన్‌ చేసి పిలిచినా రావడంలేదని వాపోతున్నారు. 


 నరసరావుపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హలో.. అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఫోన్‌ చేస్తున్నాం భోజనానికి వస్తారా? మొన్న కూడా వస్తామని రాలేదు. వండించినదంతా వృథా అవుతోంది. తప్పనిసరిగా రండి. ప్లీజ్‌. ఇదీ అంగన్‌వాడీలో మధ్యాహ్న భోజన పరిస్థితి. కొవిడ్‌ ఇబ్బందులు మెరుగయ్యాయని  ప్రభుత్వం ఈ నెల 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంగన్‌వాడీ సిబ్బంది తొలిరోజు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు బొట్టుపెట్టి మరీ ఆహ్వానించారు. గతంలో గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ఇళ్ల వద్దకే వెళ్లి మరీ అంగన్‌వాడీలు పౌష్టికాహారం అందించేవారు. దీనికి అలవాటుపడిన వారు ప్రస్తుతం కేంద్రాలకు వచ్చి భోజనం చేసి వెళ్లాలని చెప్పటంతో అంతగా ఆసక్తి చూపడంలేదు. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వస్తుండటంతో కేంద్రాలకు రావడానికి భయపడుతున్న వారూ ఉన్నారు. గతంలో మాదిరిగా ఇంటిదగ్గరే పౌష్టికాహారం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది ఎక్కువమంది అభిప్రాయం.  ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 1479 అంగన్‌వాడీ కేంద్రాల్లో 61,328 మందికి పౌష్టికాహారాన్ని అం దించాల్సి ఉండగా ప్రస్తుతం 50 శాతం మంది కూడా హాజరు కావడంలేదు. రోజూ బతిమాలి పిలవాల్సి వస్తోందని, అయినా చాలామంది రావడంలేదని అంగన్‌వాడీ లు చెప్తున్నారు. 15,534 మంది గర్భిణులు ఉంటే వారిలో 7 నెలలపైన నిండినవారు కేంద్రాల వరకు రాలేక, వచ్చినా అంగన్‌వాడీల్లో కూర్చొనే సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. 8 నుంచి 9 నెలల లోపున్న గర్భిణీలైతే మరీ అవస్థలు పడాల్సివస్తోంది. బాలింతలదీ అదేదారి. జిల్లాలో 11,817 మంది బాలింతలు ఉంటే, వారిలో నెలలోపు ప్రసవమైన వారు నడిచి వెళ్లలేని పరిస్థితి. మరోపక్క పసికందును వెంట తీసుకురాలేక, ఇంటి దగ్గర వదిలి రాలేక పోషకాహారాన్నే వదిలేసుకుంటున్నారు. ఇక జిల్లాలో చిన్నారులు 33,977 మంది ఉంటే, వారిలో కనీసం 30 నుంచి 40 శాతం కూడా వస్తున్న పరిస్థితిలేదు.  అంగన్‌వాడీ దగ్గర్లో ఉన్నవారు మినహా దూరంగా ఉన్నవారు అక్కడి దాకా వెళ్లలేక ఆసక్తి చూపడంలేదు.


మెనూ ఘనం.. అమలు మమ 

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన వండిన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం అంగన్‌వాడీల మెనూను సిద్ధం చేసింది. ఈ ప్రకారం వారంలో సోమ, మంగళ, బుధ, శుక్ర వారాలు అన్నం, గురువారం ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌, శనివారం వెజిటబుల్‌ రైస్‌ను అందిం చాలి.  ఆదివారాన్ని మెనూ చేర్చలేదు. ఎందుకు దీనిని అధికారులు మర్చిపోయారో ఎవరికీ తెలి యదు. అయితే రోజూ మామూలు రైస్‌నే అంది స్తున్నారని లబ్ధిదారులు చెప్తున్నారు. వారంలో మూడు రోజులు ఆకుకూర పప్పు, మిగిలిన రోజు ల్లో దొస, టమాటా, బీర కాయలతో పప్పు వండిపెట్టాలి. కానీ ఆకు కూరల ధరలు అధికంగా ఉండ టంతో దొరికిన వాటితో కూర చేస్తున్నారు. వారం లో మూడు సార్లు కోడిగుడ్డు కూర, సాంబారు, మునగాకు వంటివాటితో కూర వండిపెట్టాలి. ప్రతిరోజు మునగాకు పొడి కానీ ఆకు కానీ ఒక్కొ క్కరికి కనీసం 0.33 గ్రాముల వంతున ఆహారంలో అందేలా చూడాలి. కానీ మునగాకు, లేక పొడి ఊసేలేదు. వేడిగా పాలు 200 మిల్లీ లీటర్ల వం తున ఇవ్వాలి. దీనిని చాలాచోట్ల పక్కన పెట్టేశా రు. అధిక ధరల నేపథ్యంలో మెనూ ప్రకారం ఆహారం సిద్ధం చేయలేక అందుబాటులో ఉన్నవాటితోనే సరిపెడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అంగన్‌వాడీలకు వెళ్లి భోజనం చేయడంపై అంతగా ఆసక్తి చూపటంలేదు. శుభ్రతపై అనుమానాలు ఉండటంతో ఇంటిదగ్గర భోజనమే నయమనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రోజులో ఒక్కపూట పోషకాహారం తీసుకుంటేనే పోషక విలువలు పెరిగిపోతాయా, రక్త హీనత తగ్గిపోతుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంటికే ఆహారం అందిస్తే బాగుంటుందని ఎక్కువ శాతం మంది కోరుతున్నారు. పోషకాహార పంపిణీ నుంచి తప్పించుకునేందుకు తాజా ఎత్తు గడంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నా యి. కరోనా పూర్తిగా తగ్గిపోకుండానే ఈ తరహా నిర్ణయం సరికాదనేదికూడా వారి వాదన.  

Updated Date - 2022-07-05T06:04:38+05:30 IST