ఇంటివద్దకే పౌష్టికాహారం

ABN , First Publish Date - 2021-06-20T05:58:20+05:30 IST

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఇక ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నారు. కొవిడ్‌ మహామ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు, బాలింతలు, గర్భణుల రక్షణే ధ్యేయంగా మహిళా శిశు సంక్షేమశాఖ నూతన విధానినికి నాంది పలికింది.

ఇంటివద్దకే పౌష్టికాహారం
రామిరెడ్డినగర్‌ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న టీచర్‌ విజయలక్ష్మి తదితరులు

కొవిడ్‌తో మారిన పంపిణీ విధానం

బాలింతలు, చిన్నాలరులకు ఉపయుక్తం

వాట్సప్‌ గ్రూపుల ద్వారా విద్యార్థులకు శిక్షణ

గుంటూరు(విద్య), జూన్‌ 19: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా  పౌష్టికాహారం ఇక ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నారు. కొవిడ్‌ మహామ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు, బాలింతలు, గర్భణుల రక్షణే ధ్యేయంగా మహిళా శిశు సంక్షేమశాఖ నూతన విధానినికి నాంది పలికింది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోర్టిఫైడ్‌(సూక్ష్మపోషక విలువలు) బియ్యాన్ని పంపిణీ చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజా సరుకుల్ని కూడా ఇంటివద్దకే చేరవేసేలా అంగన్‌వాడీ  కార్యకర్తలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. జిల్లాలో మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 23 ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 4,405 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా మరో 54 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.  జిల్లాలోని ఆయా కేంద్రాల్లో ఆధ్వర్యంలో  గర్భణులు, బాలింతలు  63,120 మంది ఉన్నారు. 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలు 84,379 మంది ఉన్నారు.  ఈ నేపథ్యంలో రక్తహీనత, పోషకాహార లోపంతో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. 

ఇంటివద్దకు వచ్చి అందించే వస్తువులివే...

బాలింతలు, గర్భిణుల బియ్యం,  కందిపప్పు, పామాయిల్‌, పాలు, గుండ్లు అందిస్తున్నారు.  3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు రెండు కిలోల బియ్యం(ఫోర్టిపైడ్‌ బియ్యం), అరకిలో కందిపప్పు, 2.50 లీటర్ల పాలు,  25 గుండ్లు, బాల సంజీవిని, మల్టీగ్రేన్‌ పిండి, బెల్లం, చిక్కీలు, రాగిపిండి, ఎండు ఖర్జూరం అందిస్తారు. నెలలో రెండు విడతలుగా ఆయా వస్తువులు అందజేస్తున్నట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

వాట్సాప్‌ గ్రూపుల ద్వారా శిక్షణ

కొవిడ్‌ నేపథ్యంలో పిల్లల్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేకంగా కొన్ని వీడియోల్ని విద్యార్థుల కోసం రూపొందించి తల్లిదండ్రులకు వాట్సప్‌ ద్వారా పంపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రాలవారీగా గ్రూపుల్ని ఏర్పాటుచేసినట్లు మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ మనోరంజని వెల్లడించారు.


Updated Date - 2021-06-20T05:58:20+05:30 IST