పునాదులకే పరిమితం!

ABN , First Publish Date - 2022-05-31T03:08:13+05:30 IST

ఉదయగిరి మండలం మాసాయిపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం పునాదులకే పరిమితమైంది.

పునాదులకే పరిమితం!
పునాదులకే పరిమితమైన అంగన్‌వాడీ భవన నిర్మాణం

ఎనిమిదేళ్లుగా సాగని పనులు

అవస్థల్లో అంగన్‌వాడీ చిన్నారులు

ఉదయగిరి, మే 30: ఉదయగిరి మండలం మాసాయిపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం పునాదులకే పరిమితమైంది. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మండలంలో పది అంగన్‌వాడీలకు భవనాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఒక్కో భవనానికి రూ.6 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది. అప్పట్లో తొమ్మిది చోట్ల భవనాలు పూర్తి కాగా వాటిలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ జరుగుతుంది. ఒక్క మాసాయిపేట అంగన్‌వాడీ కేంద్రం ఎనిమిదేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో కేంద్రం నిర్వహణ అద్దె భవనంలో కొనసాగుతోంది. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో 26 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణులు, నలుగురు బాలింతలు, 30 మంది కిశోర బాలికలు ఉన్నారు. వీరంతా నిత్యం కేంద్రానికి వస్తుంటారు. 11 ఏళ్లుగా అంగన్‌వాడీ కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతుంది. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సౌకర్యాల కల్పనకు కొత్త భవనం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసినా పనులు పూర్తి కాలేదు. పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్‌ రూ.2.50 లక్షలు ఖర్చు చేసి ఫిల్లర్లు, బేస్‌మట్టం లెవల్‌ పూర్తి చేశారు. వాటికి ప్రభుత్వం రూ.1.50 లక్షలు బిల్లు చెల్లించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రం పూర్తి చేయాలని చిన్నారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 


Updated Date - 2022-05-31T03:08:13+05:30 IST