రక్తహీనత చంపేస్తోంది

ABN , First Publish Date - 2022-05-09T05:23:17+05:30 IST

రక్తహీనతతో గ్రామాల్లో మాతా శిశు మరణాలు పెరుగుతున్నాయి. వైద్యసిబ్బంది సచివాలయాలకే పరిమితం కావడంతో పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు.

రక్తహీనత చంపేస్తోంది

పెరుగుతున్న మాతా శిశు మరణాలు

సచివాలయాలకే పరిమితమైన వైద్య సిబ్బంది

ఐరన్‌ మాత్రల పంపిణీలో అలసత్వం


మదనపల్లె క్రైం, మే 8: రక్తహీనతతో గ్రామాల్లో మాతా శిశు మరణాలు పెరుగుతున్నాయి. వైద్యసిబ్బంది సచివాలయాలకే పరిమితం కావడంతో పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా క్యాల్షియం, ఐరన్‌ మాత్రల పంపిణీ, ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజక్షన్లు వేయడంలో వైద్యసిబ్బంది విఫలమైనట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో బిడ్డలు అనారోగ్యంతో జన్మించి మరణిస్తున్నారు. అలాగే తల్లి కూడా రక్తహీనతతో మృత్యువాతపడుతోంది. మదనపల్లె డివిజన్‌ పరిధిలోని పడమటి ప్రాంత మండలాలైన పెద్దమండ్యం, తంబళ్లపల్లె, కురబలకోట, ములకలచెరువు, పీటీఎం, బి.కొత్తకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, మదనపల్లె మండలాల్లో తరచూ మరణాలు సంభవిస్తున్నాయి. ఇంటింటి సర్వేలో భాగంగా గర్భిణులను గుర్తించి, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి అన్ని రకాల పరీక్షలతో పాటు చికిత్స చేయించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉంది. ముఖ్యంగా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్స్‌ గర్భిణులను గుర్తించి వారి వివరాలను మదర్‌ అండ్‌ చిల్డ్రన్‌ (ఎంసీహెచ్‌) పుస్తకంలో నమోదు చేయాలి. దీంతో పాటు మహిళలకు టీటీ ఇంజక్షన్లు వేయడంతో పాటు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి ఈసీజీ, స్కానింగ్‌, మూత్ర, రక్త, హెచ్‌ఐవీ పరీక్షలు చేయించాల్సి ఉంది. అలాగే అంగన్‌వాడీ సిబ్బంది గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి. కుళ్లిపోయిన కోడిగుడ్లు, రుచి, నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు. ఈ భోజనం తిని అనారోగ్యం బారినపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యసిబ్బంది సచివాలయాలకే పరిమితం కావడం, పట్టణాల్లో నివాసం ఉండి గ్రామాల్లో విధులు నిర్వహిస్తుండడంతో పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. క్యాల్షియం మందుల సరఫరా తక్కువగా ఉండడంతో బిడ్డ ఎదుగుదల లేకుండాపోతోంది. కాన్పు సమయంలో తల్లికి 10 గ్రాముల రక్తం ఉండి, బిడ్డ రెండు నుంచి మూడు కిలోల బరువుతో జన్మిస్తే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కానీ కాన్పు కోసం గ్రామాల నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చే మహిళల్లో 6 నుంచి 8 గ్రాముల రక్తం మాత్రమే ఉంటోంది. అలాగే బిడ్డ బరువు కూడా రెండు కిలోల్లోపే ఉంటోంది. ఇలాంటి వారికి సాధారణ కాన్పు చేయడం చాలా కష్టం. తప్పనిసరిగా రక్తం ఎక్కించి సిజేరియన్‌ చేయాల్సి ఉంది. అయితే ఇంత రిస్క్‌ మనకెందుకు అనుకునే డాక్టర్లు గర్భిణులను తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రక్తహీనత కేసులకు రక్తం ఎక్కించి సిజేరియన్లు చేయకుండా మహిళలను భయపెట్టి బలవంతంగా బయటకు రెఫర్‌ చేస్తుండటంతో దారిలోనే మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. రెఫర్‌ చేయడం తగ్గించి రిస్క్‌ కేసులను కూడా ట్రీట్‌ చేసి మరణాల సంఖ్య తగ్గించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పదేపదే చెబుతున్నా ఫలితం శూన్యం. యథాప్రకారం మరణాలు జరుగుతూనే ఉన్నాయి.


ఉదాహరణకు..

- పెద్దమండ్యం మండలానికి చెందిన ఓ గర్భిణీ ఇటీవల ప్రసవం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెకు రక్తం చాలా తక్కువగా ఉండి, ఉమ్మ నీరు పోతుండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సిజేరియన్‌ చేసి బాధితుల నుంచి రూ.30 వేలు వసూలు చేశారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో మరణించింది. తల్లి షాక్‌కు గురై కోమాలోకి వెళ్లడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. 

- తంబళ్లపల్లెకు చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. రక్తం, ఉమ్మ నీరు, బీపీ అంతా బాగానే ఉండి సాధారణ కాన్పు జరిగే అవకాశం ఉన్నా..కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని మహిళ కుటుంబీకులను భయపెట్టి సిజేరియన్‌ చేశారు. వారం రోజులు అక్కడే ఉంచుకుని రూ.40 వేలు బిల్లు వేశారు. కుట్లు చీము పట్టి మహిళ పరిస్థితి విషమంగా మారడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడ రూ.లక్ష ఖర్చు పెట్టుకుని ఇంటికి చేరారు.

- పుంగనూరుకు చెందిన ఓ మహిళ కాన్పు కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అయితే సాధారణ కాన్పు కష్టం కావడంతో సిజేరియన్‌ చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. అయితే బిడ్డలో కదిలికలు లేకపోవడంతో పురిటిలోనే మృతి చెందింది.  

- బి.కొత్తకోటకు చెందిన ఓ మహిళ ఇటీవల పురిటి నొప్పులతో బాధపడుతూ మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. కాగా రక్తం చాలా తక్కువగా ఉండడంతో రక్తం ఎక్కించి ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే బిడ్డలో ఎదుగుదల లేకపోవడంతో ఒకటిన్నర కిలో బరువుతో జన్మించింది. గంట వ్యవధిలోనే ఆ బిడ్డ మృతి చెందింది. 


నివారణకు చర్యలు తీసుకుంటున్నాం..

- డాక్టర్‌ లక్ష్మీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో, మదనపల్లె.

మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణుల్లో అవగాహన లేకపోవడం కారణంగా చెప్పవచ్చు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం పొందే వరకూ అన్ని జాగ్రత్తలు పాటించాలి. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని పౌష్టికాహారం తీసుకోవాలి. గ్రామాల్లో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐరన్‌ మాత్రలు, ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. రక్తహీనత బాధితులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. సుఖప్రసవం జరిగి తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలి.



Read more