అదిరే ఫీచర్స్‌తో... ఆండ్రాయిడ్‌ 11

ABN , First Publish Date - 2020-05-16T05:30:00+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఆండ్రాయిడ్‌ను కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు... ఎప్పటికప్పుడు మెరుగుపరచిన వెర్షన్లను ప్రవేశపెడుతున్న గూగుల్‌ ఇప్పుడు డ్రాయిడ్‌ 11తో ముందుకు వచ్చింది... ప్రస్తుతం డెవలపర్‌ ప్రివ్యూగా విడుదలైన ఆండ్రాయిడ్...

అదిరే ఫీచర్స్‌తో...  ఆండ్రాయిడ్‌ 11

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఆండ్రాయిడ్‌ను కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు... ఎప్పటికప్పుడు మెరుగుపరచిన వెర్షన్లను ప్రవేశపెడుతున్న గూగుల్‌ ఇప్పుడు డ్రాయిడ్‌ 11తో ముందుకు వచ్చింది... ప్రస్తుతం డెవలపర్‌ ప్రివ్యూగా విడుదలైన ఆండ్రాయిడ్‌ 11 ఫైనల్‌ వెర్షన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. వినూత్న ఫీచర్లు, సెట్టింగ్స్‌... ఇంకా ఎన్నో సదుపాయాల సమాహారమైన ఈ వెర్షన్‌ ప్రత్యేకతలు ఇవీ...


గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు గతంలో ప్రత్యేకంగా పేర్లు పెడుతూ ఉండేది. ఉదాహరణకు ఆండ్రాయిడ్‌ 9 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ‘ఆండ్రాయిడ్‌ పై’ అని కూడా పిలుస్తూ ఉండేవారు. అయితే, 2019లో ఆండ్రాయిడ్‌ 10ను విడుదల చేశాక- ఇక మీదట పూర్తిగా నెంబర్ల ఆధారంగా మాత్రమే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను పిలవడం జరుగుతుందని గూగుల్‌ అధికారికంగా వెల్లడించింది. అదే క్రమంలో తాజాగా ఆండ్రాయిడ్‌ 11 డెవలపర్‌ ప్రివ్యూ విడుదలయింది. ఇది అప్లికేషన్‌ డెవలపర్లు, ఫోన్‌ తయారీ కంపెనీలను ఉద్దేశించినది మాత్రమే. ఈ ఏడాది మేలో మొదటి బీటా వెర్షన్‌, అక్టోబర్‌ నాటికి ఫైనల్‌ వెర్షన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అత్యున్నత సాంకేతికత కలిగిన ఈ వెర్షన్‌లో విశిష్టమైన ఫీచర్లు అనేకం.


నోటిఫికేషన్స్ ఇబ్బంది పెట్టవు

మీ ఫోన్‌లో కెమెరా అప్లికేషన్‌ ద్వారా ఏదైనా ఫోటో లేదా వీడియోను రికార్డ్‌ చేస్తున్నారు. అదే సమయంలో వాట్సాప్‌ లాంటి అప్లికేషన్ల ద్వారా మధ్యలో నోటిఫికేషన్‌ వస్తే చాలా చిరాకుగా ఉంటుంది కదూ! ఆండ్రాయిడ్‌ ఎలెవెన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఈ సమస్యకు పరిష్కారం అందిస్తోంది. కెమెరా అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి రికార్డింగ్‌ మొదలుపెట్టినప్పుడు మీ ప్రమేయం లేకుండానే వివిధ అప్లికేషన్ల నుంచి వచ్చే అన్ని నోటిఫికేషన్లూ మ్యూట్‌ అయిపోతాయి. ఇక మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏకాగ్రతతో రికార్డింగ్‌ చేసుకోవచ్చు.


టచ్‌ సెన్సిటివిటీ

ప్రస్తుతం మనం ఉపయోగించే ఫోన్లలో స్ర్కీన్‌ పాడవకుండా ఉండానికి మెరుగైన రక్షణ లభిస్తున్నప్పటికీ చాలామంది వినియోగదారులు దానితో సంతృప్తిచెందరు. టాంపర్డ్‌ గ్లాస్‌ను వాడుతూ ఉంటారు. ఇలా టాంపర్డ్‌ గ్లాస్‌ అమర్చడం వల్ల టచ్‌ స్ర్కీన్‌ సెన్సిటివిటీ బాగా తగ్గిపోతుంది. స్ర్కీన్‌ మీద మనం ఎక్కడైనా టచ్‌ చేసినప్పుడు అది కొన్నిసార్లు స్పందించదు. దీనికి పరిష్కారంగా ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో టచ్‌ సెన్సిటివిటీని మరింత మెరుగుపరిచారు. సెట్టింగ్స్‌లో దీన్ని మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు టాంపర్డ్‌ గ్లాస్‌ వాడినా టచ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సెట్టింగ్స్‌ చేసుకోవచ్చు.


ఏరోప్లేన్‌ మోడ్‌ ఆన్‌ చేసినా...

ఇటీవలి కాలంలో బ్లూటూత్‌ ఇయర్‌ ఫోన్స్‌ వాడకం బాగా పెరిగింది. ప్రయాణాలు చేసే సమయంలో బ్యాటరీని ఆదా చేసుకోవడం కోసం చాలామంది ఫోన్‌ ఏరోప్లేన్‌ మోడ్‌లో సెట్‌ చేస్తూ ఉంటారు. ఒకపక్క బ్లూ టూత్‌ హెడ్‌ ఫోన్‌ ద్వారా పాటలు వినేటప్పుడు ఇలా ఏరోప్లేన్‌ మోడ్‌ సెట్‌ చేస్తే,  వెంటనే బ్లూటూత్‌ కూడా ఆగిపోతుంది. పాటలు ప్లే అవ్వడం నిలిచిపోతుంది. ఆండ్రాయిడ్‌ లెవెన్‌లో ఈ సమస్యకు పరిష్కారం అందిస్తున్నారు. ఇక మీదట ఏరోప్లేన్‌ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా బ్లూటూత్‌ కొనసాగుతూనే ఉంటుంది.




స్ర్కీన్‌ రికార్డింగ్‌

కొన్ని ఫోన్‌ తయారీ కంపెనీలు తాము తయారు చేసే ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌  చేసుకోవాల్సిన పని లేకుండా అంతర్గతంగానే స్ర్కీన్‌ రికార్డింగ్‌ సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వరకు అంతర్గతంగా స్ర్కీన్‌ రికార్డింగ్‌ సదుపాయం లేదు. గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ 11 ద్వారా ఈ సదుపాయం అందించింది. కాబట్టి ఇక మీదట ప్రత్యేకంగా ఎలాంటి స్ర్కీన్‌ రికార్డింగ్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన పని లేదు. అంతర్గతంగా పొందుపరచి ఉండే సదుపాయంతో, కోరుకున్న రిజల్యూషన్‌లో, కోరుకున్న క్వాలిటీతో స్ర్కీన్‌ మీద జరిగే యాక్టివిటీ మొత్తాన్ని వీడియో రూపంలో రికార్డ్‌ చేసుకోవచ్చు.


షేర్‌ మెనూ మరింత సులభంగా...

మీ ఫోన్‌లో ఏదైనా ఫైల్‌ లేదా ఫోటోను ఎంపిక చేసి, ‘షేర్‌’ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకున్నప్పుడు స్ర్కీన్‌ మీద అనేక అప్లికేషన్లు జాబితాగా కనిపిస్తాయి. వాటిలో కావలసిన దాన్ని వెదికి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కేవలం మీరు తరచుగా వాడే కొన్ని నిర్దిష్టమైన అప్లికేషన్లు మాత్రమే షేర్‌ మెనూలో అన్నిటికన్నా పై భాగంలో కనిపిస్తే బాగుంటుంది కదూ! వాస్తవానికి ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి రావాల్సి ఉంది. ఆండ్రాయిడ్‌ 11తో ఆ సదుపాయం ప్రస్తుతం అందుబాటులోకి వస్తోంది. దీని ద్వారా ఎవరితోనైనా, ఏ అప్లికేషన్‌తోనైనా ఫైల్స్‌ షేర్‌ చేసుకోవడం చాలా సులభం.


పాత నోటిఫికేషన్స్ చదవొచ్చు...

మన ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లను ఒకసారి చదివి పక్కన పడేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడైనా పాత నోటిఫికేషన్‌ మళ్ళీ చూడాల్సి వస్తే దానికోసం ప్రత్యేకంగా అప్లికేషన్లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిధ అప్లికేషన్ల నుంచి వచ్చిన పాత నోటిఫికేషన్లను భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా చూసుకో కలిగే విధంగా వాటి హిస్టరీని చూసే వెసులుబాటును ఆండ్రాయిడ్‌ 11 అందిస్తోంది. అన్ని అప్లికేషన్లకు సంబంధించిన అన్ని పాత నోటిఫికేషన్లు దీనిలో ఒకే చోట 

కనిపిస్తాయి. 




కర్వ్‌డ్‌ డిస్‌ప్లేల కోసం... 

సామ్‌సంగ్‌ సుదీర్ఘకాలంగా కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఫోన్లను అందిస్తోంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కొద్దిగా కస్టమైజ్‌ చేయడం ద్వారా అంచుల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంది. ఇటీవల ఇతర ఫోన్‌ కంపెనీలు కూడా కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఫోన్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టంలో కొద్దిగా వంపుగా ఉన్న ఫోన్లను వాడేటప్పుడు, ఆ వంపు వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రత్యేకమైన అప్లికేషన్‌ ఇంటర్‌ఫే్‌సను గూగుల్‌ అందిస్తోంది. దీని ఆధారంగా ఫేస్‌బుక్‌ లాంటి వివిధ అప్లికేషన్‌ డెవలపర్లు తాము తయారు చేసిన అప్లికేషన్ల స్ర్కీన్‌ ఏరియాను కస్టమైజ్‌ చేసుకోవచ్చు. తద్వారా వంపులతో కూడిన డిస్‌ప్లేలను టచ్‌ చేయకుండా అడ్డుకోవచ్చు.




పర్మిషన్‌ ఒక్కసారికే...

మన ఫోన్‌లో ఏదైనా అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు దానికి కెమెరా, లొకేషన్‌, మైక్రోఫోన్‌, స్టోరేజ్‌ లాంటి ఏదైనా అనుమతి ఇస్తే అది నిరంతరం వాడుకుంటూనే ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 10లో ఒక యాప్‌ రన్‌ అవుతున్నప్పుడు మాత్రమే అది సంబంధిత యాప్‌ను వాడుకునేలా ఏర్పాటు ఉంది. ఆండ్రాయిడ్‌ 11లో  తాత్కాలికంగా ఇన్‌స్టాల్‌ చేసుకునే అప్లికేషన్లకు ఒకే ఒకసారి పర్మిషన్‌  ఇచ్చే విధంగా ఆప్షన్‌ ప్రవేశపెట్టారు. అంటే ఇక మీదట మనకు ఏదైనా అప్లికేషన్‌ మీద అనుమానం ఉన్నా, మన అవసరం కోసం దాన్ని కేవలం ఒకే ఒకసారి రన్‌ చేయాల్సి వచ్చినా...  ఒక్కసారి మాత్రమే మన ఫోన్‌ హార్డ్‌వేర్‌ను ఉపయోగించుకొనే వెసులుబాటు దానికి కల్పించవచ్చు.


నోటిఫికేషన్‌ ఏరియా నుంచే...

ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వినియోగదారులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి అన్ని అప్లికేషన్లకూ నేరుగా నోటిఫికేషన్‌ ప్రదేశం నుంచే స్పందించవచ్చు. మీకు ఏదైనా నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ప్రత్యేకంగా అప్లికేషన్‌ ఓపెన్‌ చేయాల్సిన పనిలేకుండా అక్కడి నుంచే మెసేజ్‌ కంపోజ్‌ చేసుకోవచ్చు, కావాలంటే ఫోటోలను కూడా పంపించవచ్చు. అయితే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫోన్లకు ఆయా ఫోన్‌ తయారీ కంపెనీలు ఆండ్రాయిడ్‌ 10ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ 11 ఫైనల్‌ వెర్షన్‌ విడుదలై, దాదాపు అన్ని ఫోన్లకూ అందుబాటులోకి రావడానికి 2021 వరకు వేచి చూడాల్సిందే!


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST