అందితే జుత్తు, లేదంటే పొత్తు

ABN , First Publish Date - 2020-12-13T06:01:17+05:30 IST

భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై ఇక యుద్ధమే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనా...

అందితే జుత్తు, లేదంటే పొత్తు

నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏతో పొసగేది కాదు. ఈ కారణంగా ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీకి వెళ్లి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను గానీ, కేంద్రమంత్రులను గానీ కలుసుకోలేదు. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. రాష్ర్టానికి అది కావాలి, ఇది కావాలి అంటూ ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్రమంత్రులను కలుసుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు విరుద్ధంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటానంటూనే ఉరుక్కుంటూ ఢిల్లీ వెళ్లారు. దీన్నిబట్టి ఆయన ప్రకటనల్లో నిబద్ధత లేదని కేంద్ర పెద్దలను ఎదిరిస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారని తెలంగాణలో ప్రచారం మొదలైంది. నిజానికి కేసీఆర్‌ అరివీర భయంకరుడేమీ కాదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆయన ఎవరితోనైనా కాళ్లబేరానికి వస్తారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు కూడా మొదలెట్టారు.


గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు కేసీఆర్‌‌పై విమర్శల జోరు పెంచారు. ఆయన అవినీతికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణ జరిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగంగానే ప్రకటించారు. దీనికితోడు గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన కొంతమంది అభ్యర్థుల ఖాతాల్లోకి ఒక కాంట్రాక్టర్‌ నుంచి కోటి రూపాయల వంతున నేరుగా జమ చేయించిన సమాచారం కేంద్రప్రభుత్వంలోని ఏజెన్సీలకు తెలిసిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన బిహార్‌ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌కు కేసీఆర్‌ ఆర్థికసాయం చేశారన్న సమాచారం కూడా ఆధారాలతో సహా కేంద్ర పెద్దలకు చేరిందని చెబుతున్నారు. ఈ ప్రచారమంతా ఆయన చెవిన పడిఉంటుంది. దీంతో భయం పట్టుకున్నట్టు ఉంది. అందుకే కాబోలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రైతునాయకులు ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారికంగా బంద్‌ చేయించిన కేసీఆర్‌, 24 గంటల్లోనే యూటర్న్‌ తీసుకున్నారు.


భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై ఇక యుద్ధమే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనా? భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగడతానని ఆయన కొద్దిరోజులుగా ప్రకటిస్తున్నారు. అటు దుబ్బాక ఇటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరాభవం ఎదురైన నేపథ్యంలో కేసీఆర్‌ మాటలు నమ్మిన కొన్ని న్యూస్చానెళ్లు ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో? యుద్ధం తీవ్రత ఎలా ఉంటుందో? గ్రాఫిక్స్‌తో వివరిస్తూ కథనాలు ప్రసారం చేశాయి. ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి పూనుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేసీఆర్‌ లేఖ రాశారు. ఆ వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, గజేంద్ర షెకావత్‌లను కలిశారు. దీంతో ఆయన యుద్ధం ఉత్తుత్తిదేనన్న అనుమానాలు బలపడ్డాయి. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏతో పొసగేది కాదు. ఈ కారణంగా ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీకి వెళ్లి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను గానీ, కేంద్రమంత్రులను గానీ కలుసుకోలేదు. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. రాష్ర్టానికి అది కావాలి, ఇది కావాలి అంటూ ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్రమంత్రులను కలుసుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు విరుద్ధంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటానంటూనే ఉరుక్కుంటూ ఢిల్లీ వెళ్లారు. దీన్నిబట్టి ఆయన ప్రకటనల్లో నిబద్ధత లేదని కేంద్ర పెద్దలను ఎదిరిస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారని తెలంగాణలో ప్రచారం మొదలైంది. నిజానికి కేసీఆర్‌ అరివీర భయంకరుడేమీ కాదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆయన ఎవరితోనైనా కాళ్లబేరానికి వస్తారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు కూడా మొదలెట్టారు. కేంద్ర కార్మికమంత్రిగా పని చేసినప్పుడు ఆయన శాఖలో జరిగిన ఒక వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారించడానికి సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. సీబీఐ అధికారులు తన ఇంటికి వస్తున్నారని తెలిసి ఆయన తెగ హడావిడి పడిపోయారు. ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పుడు ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఆ తర్వాత సీబీఐ కేసు అటకెక్కింది. కేసీఆర్‌ ఎంత పిరికివాడో చెప్పడానికి ఈ సంఘటనను ఉదహరిస్తుంటారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయన‌పై విమర్శల జోరు పెంచారు. ఆయన అవినీతికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణ జరిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగంగానే ప్రకటించారు. దీనికితోడు గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన కొంతమంది అభ్యర్థుల ఖాతాల్లోకి ఒక కాంట్రాక్టర్‌ నుంచి కోటి రూపాయల వంతున నేరుగా జమ చేయించిన సమాచారం కేంద్రప్రభుత్వంలోని ఏజెన్సీలకు తెలిసిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన బిహార్‌ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌కు కేసీఆర్‌ ఆర్థికసాయం చేశారన్న సమాచారం కూడా ఆధారాలతో సహా కేంద్ర పెద్దలకు చేరిందని చెబుతున్నారు.


ఈ ప్రచారమంతా ఆయన చెవిన పడిఉంటుంది. దీంతో భయం పట్టుకున్నట్టు ఉంది. అందుకే కాబోలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రైతునాయకులు ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారికంగా బంద్‌ చేయించిన కేసీఆర్‌, 24 గంటల్లోనే యూటర్న్‌ తీసుకున్నారు. ఒకవైపు ప్రధానిని ప్రశంసిస్తూనే ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. మూడురోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేస్తున్న ఆయన ఇంకా ఎవరెవరిని కలుస్తారో ఏమేమి మాట్లాడతారో చూడాలి. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా కేంద్రంపై యుద్ధమే వంటి ప్రకటనలను ఆయన కొనసాగిస్తారో లేక సంధి కుదుర్చుకుని గమ్మున ఉండిపోతారో వేచిచూడాలి. రాష్ట్రంలో బీజేపీ మంచి ఊపు మీద ఉన్నందున టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీలోకి వలసలు లేకుండా అడ్డుకునే వ్యూహంలో భాగంగా కేసీఆర్‌ బీజేపీ పెద్దలను కలుస్తుండవచ్చు కూడా. రెండేళ్ల క్రితం ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కొంతకాలం హడావిడి చేశారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసి విందు ఆరగించి మంతనాలు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ, ఫెడరల్‌ ఫ్రంట్‌ ముచ్చట మళ్లీ తేలేదు. ఇప్పుడు మళ్లీ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగడతానని ప్రకటించడం మొదలెట్టారు. ఈ ప్రయత్నాలలో భాగంగా కర్ణాటకలో జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామితో మంతనాలు జరిపినట్లు లీకులు ఇచ్చారు. ఈ వార్త మీడియాలో వచ్చిన మరుసటి రోజే కర్ణాటకలో బీజేపీతో అవగాహన ఏర్పరచుకోవడానికి కుమారస్వామి ప్రయత్నాలు మొదలెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలవబోతున్నట్లు కూడా లీకులు ఇచ్చారు. అఖిలేష్‌ వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. నిజానికి జాతీయస్థాయిలో ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా కేసీఆర్‌ను విశ్వసించడం లేదు. కేసీఆర్‌ మాటలను వారు నమ్మరు కూడా. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన వంతు సహకారం అందించిన మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు కేసీఆర్‌తో ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. పవార్‌కు సంబంధించిన ఒక కంపెనీకి తెలంగాణలో కొన్ని కాంట్రాక్టులు లభించాయి. సదరు కంపెనీకి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన స్వయంగా రెండు పర్యాయాలు హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ను కలిశారు. తనను కలిసిన ప్రతిసారీ, ‘మీరు వెళ్లిపొండి, విమానం ఎక్కేలోపే మీ కంపెనీ ఖాతాలోకి చెక్కులు జమ అవుతాయ’ని నమ్మబలికారు. ఆ మాటలు నమ్మిన పవార్‌ తిరిగి వెళ్లిపోయారు. కానీ బిల్లు బకాయిలు మాత్రం రాలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కేసీఆర్‌ లైన్లోకి రాలేదు. ఈ విషయాన్ని శరద్‌ పవార్‌తో పాటు ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కనిపించిన వారందరికీ చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలతో కేసీఆర్‌కు విశ్వసనీయత లేకుండా పోయింది. చివరకు సొంత పార్టీ నాయకులు కూడా ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆయన మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.


పరిస్థితులు ప్రతికూలించినప్పుడు మాత్రం ఆయన ఒక అడుగు కాదు పదడుగులు వెనక్కి తగ్గడానికి కూడా వెనుకాడరు. మంత్రి హరీశ్‌రావును రెండు రోజుల క్రితం అదే పనిగా పొగడడమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్‌ది వింత నైజం. ఈ కారణంగా ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్నా, ప్రాంతీయ పార్టీల కూటమి అని చెబుతున్నా జాతీయస్థాయిలో ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. శాసనసభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ కూడగట్టే ప్రయత్నం చేశారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను, అధినేతలను కలవడమే కాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ నివాసానికి స్వయంగా వెళ్లి చర్చలు జరిపారు. బీజేపీపై ద్వేషంతో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చివరకు కాంగ్రెస్‌ పార్టీతో సైతం జట్టు కట్టారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. దాంతో ఆయన జాతీయ రాజకీయాల ఊసు ఎత్తడం లేదు. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడమే ఆయన ప్రధాన కర్తవ్యమైంది. గతంలో బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అటల్‌ బిహారీ వాజ‌పేయి ప్రభుత్వం ఏర్పడటంలో చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు కూడా కాంగ్రెస్‌–బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ కూడగట్టి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటానికి చంద్రబాబు ప్రధాన కారకుడయ్యారు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర లేకుండా పోయింది. తూర్పు పడమరలుగా ఉండే నాయకులను సైతం ఒకే ప్లాట్‌ఫాం పైకి తీసుకురాగల నేర్పు, ఓర్పు చంద్రబాబుకు ఉంది. కేసీఆర్‌లో ఈ లక్షణాలు మచ్చుకు కూడా లేవు. ప్రజలు తనను తిరస్కరించినప్పుడు వారిపైనే అలిగిన వ్యక్తి ఆయన. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. స్వరాష్ట్రంలో బలహీనపడుతున్న నాయకుడు జాతీయస్థాయిలో నాయకత్వం వహించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. కేసీఆర్‌కు ఈ విషయం తెలుసు గనుకే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంధి కోసం ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్దిష్టమైన ఎజెండా లేకుండానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారంటేనే ఆయన ఢిల్లీ టూర్‌ ఆంతర్యం ఏమై ఉంటుందో ఊహించుకోవచ్చు. జాతీయస్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితిలో చంద్రబాబు మాత్రమే కాదు, కేసీఆర్‌ కూడా లేరు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్‌రెడ్డికి ఆ స్థాయి లేదు. సీబీఐ, ఈడీ కేసుల పుణ్యమా అని బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఒక్క అడుగు కూడా వేయలేరు. మొత్తం మీద తెలుగునాట ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా సమీప భవిష్యత్తులో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయలేని పరిస్థితి! కాదూ కూడదు అని కేసీఆర్‌ మొండిగా ముందుకు వెళ్తే ఆయనను కేసులలో ఇరికించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ముంబై ఎయిర్‌పోర్టును తెలుగువాడైన జీవీ కృష్ణారెడ్డి నుంచి స్వాధీనం చేసుకోవడానికి గౌతం అదానీ సీబీఐ, ఈడీ సంస్థలను వాడుకున్న నేపథ్యంలో కేసీఆర్‌ను కట్టడి చేయడం కేంద్ర పెద్దలకు ఎంతసేపు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రకటనలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ధీరుడు కాదు భీరువే అని ఆయన గురించి తెలిసిన వారికి అవగతమే. కేసీఆర్‌ నిజంగానే సంధి ప్రయత్నాల కోసమే ఢిల్లీ వెళ్లారా? అదే నిజమైతే సంధి సఫలమైందా? విఫలమైందా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఆయన ఎక్కడకు వెళ్లినా, ఎవరిని కలిసినా కేసుల నుంచి తప్పించుకోలేరన్న బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ ప్రకటన ఈ సందర్భంగా గమనార్హం.


దిస్‌ ఈజ్‌ వాస్తవం!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో మహాత్మాగాంధీని, గౌతమ బుద్ధుడిని, అల్లాను, ఏసుప్రభువును, వేంకటేశ్వరస్వామిని, దైవదూతను చూసుకుంటున్నారు కొంతమంది. ఆయన పూర్వజన్మలో మహాత్మాగాంధీనే అని ఒకాయన బల్లగుద్ది చెబుతుండగా, మరొకాయన, కాదు కాదు గౌతమ బుద్ధుడే అంటున్నారు. ‘దిస్‌ ఈజ్‌ వాస్తవం’ అని కాసేపు అనుకుందాం. జగన్మోహన్‌రెడ్డిలో ఆ మహనీయుల లక్షణాలు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలనను గమనిస్తున్న వారిలో పలువురికి జగన్‌లో బాపూజీ, బుద్ధ భగవానుడి లక్షణాలు కనిపించడం లేదు. అలా కనిపించకపోవడానికి వారిలో దృష్టి లోపం ఉందని నిందించవచ్చు కూడా. యుగాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది అంటారు కానీ, ఆయన మాత్రమే కాదు మహాత్మాగాంధీ, బుద్ధ భగవానుడు కూడా కలియుగంలోనే ఈ భూమ్మీద పుట్టారు. తాజాగా జరిగిన శాసనసభ సమావేశాల్లో కొంతమంది శాసనసభ్యులకు జగన్మోహన్‌రెడ్డిలో ఏకంగా దేవుళ్లే కనిపించారు. అల్లా, ఏసు, వేంకటేశ్వరస్వామిని జగన్‌లో చూసుకుంటున్నామని వారు చెప్పుకొచ్చారు. అధ్యక్ష స్థానంలో ఉన్నాయన కూడా దైవదూత అని కీర్తించారు. వైసీపీ నాయకులు ఇంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలను దేవుళ్ల తరహాలో పల్లకిలో ఊరేగిస్తూ తీసుకుపోతున్నారు. దేవాలయాల్లో భజనలు చేసినట్లుగా ఆయనకు భజనలు చేస్తున్నారు.


ఈ వికృత చర్యలన్నీ జగన్‌ మనసును పులకింపజేస్తున్నట్టున్నాయి. అందుకే ఎవరినీ వారించడం లేదు. నిజానికి మనలో లేని లక్షణాలను ఎవరైనా మనకు ఆపాదించి పొగిడితే వారితో ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా భజనబృందం కీర్తనలతో జగన్‌ ఆనందడోలికల్లో ఊగుతున్నారు. మనకు లేని సుగుణాలను ఆపాదించేవారు క్షణాల్లో ప్లేట్‌ ఫిరాయించగలరు. తమ పబ్బం గడుపుకోవడానికే వారు అలా భజనబృందాలుగా ఏర్పడతారు. పొగడ్తల కైపు తలకెక్కితే ఎంతటివారైనా మోసపోతారు. సినిమాల్లో దేవుడి పాత్రలు వేసిన ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి రాకముందు కూడా అభిమానులు పాదాభివందనం చేసేవారు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాదాభివందనాలను ఆయన ఇష్టపడేవారు. ఈ కారణంగా అనర్హులను కూడా ఆయన అందలమెక్కించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వైసీపీ నాయకులు తమ ముఖ్యమంత్రిని దేవుడిని చేసే సాహసానికి పూనుకున్నారు. ఇదంతా నిజమని నమ్మి జగన్‌ కూడా తనకు తానే దేవుడిగా ప్రకటించుకుంటారేమో తెలియదు. మనకెవరైనా సాయం చేస్తే దేవుడితో సమానమని అంటాం. లేదా మా పాలిట దేవుడు అని అంటాం, అంతేగాని దేవుళ్లను చేసి పల్లకీలలో ఊరేగించం. ఇక చట్టసభల్లో ఒకరిద్దరు మంత్రులు, శాసనసభ్యులు వాడిన భాష పట్ల కూడా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వయసుని, అనుభవాన్ని కూడా గుర్తించకుండా అరేయ్‌, ఒరేయ్‌ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబును దూషించడం వల్ల ఆయనకు పోయేదేమీ ఉండదు. అయితే మంత్రులుగా ఉంటున్నవారు అలా దూషించడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మన పనితనాన్ని బట్టి మనకు కొలువు దొరుకుతుంది. ఎవరు ఎందులో నిపుణులో అందుకు తగ్గ కొలువులో వారిని నియమించుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఇతరులను దూషించగల సామర్థ్యం, నైపుణ్యం ఉన్నవారు కావాల్సి వచ్చిఉంటారు. బహుశా అందుకే కొడాలి నాని, అనిల్‌కుమార్‌ వంటి వారిని మంత్రులుగా నియమించుకున్నారు. ఈ ఇరువురు మంత్రులూ తమ బాధ్యతలను శక్తివంచన లేకుండా నెరవేరుస్తున్నారు. ఎవరినైనా, ముఖ్యంగా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టగల నేర్పరితనం ఈ ఇరువురు మంత్రుల సొంతం. కనుక జగన్‌రెడ్డి వారిని అందుకే వినియోగించుకుంటున్నారు. ఇలాంటి నైపుణ్యమే ఉన్న మరికొంతమందిని శాసనసభ్యులుగా ఆయన గెలిపించుకున్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా వారంతా చంద్రబాబును దూషించినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ముఖంలో చిరునవ్వులు చిందుతున్నాయి కదా. అలాంటి అపురూప దృశ్యాలను చూసిన తర్వాత కూడా, మంత్రులై ఉండి కూడా అలా మాట్లాడటం ఏమిటండీ అని ఎవరైనా ఆశ్చర్యపోతే వారికి ఆయన గురించి ఏ మాత్రం అవగాహన లేదనుకోవాలి. పూర్వకాలంలో రాజులు ఆస్థాన విదూషకులను నియమించుకునేవారు. రాజుగారు సభలో కొలువుదీరినప్పుడు వాతావరణం వేడెక్కితే, రాజుగారితో పాటు రాజదర్బార్‌లో పాల్గొన్న వారిని నవ్వులలో ముంచెత్తి సంతోషపెట్టడం ఈ విదూషకులు చేసే పని. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు రాజుగారు, కాదు కాదు దేవుడు. ఈ ఆధునిక రాజు లేదా దేవుడి మనసు సంతోషపెట్టడానికై కొడాలి నాని, అనిల్‌కుమార్‌ వంటివారు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు కనుక వారిని తప్పుబట్టడం కూడా తప్పు. ఎటొచ్చీ ఈ లీలలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారో తెలియాల్సి ఉంది. ప్రజలు కూడా జగన్‌కు భక్తులుగా మారిపోతే, నచ్చనివాళ్లు అటువైపు చూడవద్దు. అదలా ఉంచితే రాజధాని కోసం భూములిచ్చిన పాపానికి అమరావతి రైతులు ఎస్సీ, ఎస్టీ కేసులు ఎదుర్కోవాల్సివస్తోంది. మూడు రాజధానులే ముద్దంటూ అధికార పార్టీ ప్రోత్సాహంతో ఆందోళనలు చేస్తున్న వారిని దూషించారంటూ రాజధాని రైతులపై మరోమారు ఈ చట్టం కింద కేసులు పెట్టారు. గతంలో ఇలా చేసి కొంతమందిని అన్యాయంగా జైలుకు పంపినందుకు హైకోర్టు అక్షింతలు వేసినా కూడా మళ్లీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టిన పోలీసులు రేపు కోర్టులో తమ చర్యను ఎలా సమర్థించుకుంటారో చూడాలి. ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు జగన్‌రెడ్డిలో మహాత్మాగాంధీ, బుద్ధుడు, దేవుళ్లు ఎలా కనిపిస్తారో అర్థం కాదు. ‘దిస్‌ ఈజ్‌ వాస్తవం’ అని జగన్‌ అంటూ ఉంటారు. అందుచేత నమ్మకం ఉన్నవారు భజనసంఘంలో చేరవచ్చు. నమ్మకం లేని వారిని దైవద్రోహులుగా చిత్రించి కేసులు పెడతారేమో తెలియదు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-12-13T06:01:17+05:30 IST