Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 30కిలోమీటర్ల వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోంది. విశాఖపట్నానికి 480 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 600 కిలోమీటర్లు, పారదీప్‌కు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 6 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు  వాయుగుండం  చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో  పలుచోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,  అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. ఈ రోజు తీరం వెంబడి గరిష్టంగా 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.


రేపు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తీరం వెంబడి గరిష్టంగా 80-90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనున్నాయి. వాయుగుండం నేపథ్యంలో సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అలాగే మరో నాలుగు బృందాలు కూడా సహాయక చర్యల నిమిత్తం అందుబాటులో ఉన్నాయన్నారు. మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్ళరాదని  స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు. 

Advertisement
Advertisement