అమరావతి: రాష్ట్రంలో థియేటర్ల యజమానులకు ఊరట లభించింది. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. థియేటర్ల ఓనర్లకు నెల రోజుల గడువు ఇచ్చిన సర్కార్... నెలరోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతితో 9 జిల్లాల్లో సీజ్ అయిన 83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందు కోసం జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. థియేటర్ల వ్యవహారానికి సంబంధించి నటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి మంత్రి పేర్ని నానిని థియేటర్ల యజమానులు కలిసిన విషయం తెలిసిందే.
ఇటీవల ఏపీ వ్యాప్తంగా పలు థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. టికెట్లు, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో పాటు సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున థియేటర్లను సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి