AP Highcourt: జగన్ ప్రభుత్వానికి మరో షాక్

ABN , First Publish Date - 2022-07-19T17:14:29+05:30 IST

జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

AP Highcourt: జగన్ ప్రభుత్వానికి మరో షాక్

అమరావతి: జగన్ ప్రభుత్వాని(Jagan government)కి మరో షాక్ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కేసులో ఏపీ హైకోర్టు(AP high court)  సంచలన తీర్పునిచ్చింది. కృష్ణ కిషోర్‌(Jasti krishna kishore)పై మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును ధర్మాసనం కొట్టి వేసింది. కృష్ణ కిషోర్‌పై జగన్ సర్కారు సీఐడీ(CID) ద్వారా పెట్టించిన కేసు అక్రమమే అని న్యాయస్థానం తేల్చింది. ఈడీబీ సీఇవోగా కృష్ణ కిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని పేర్కొంది. ఈడీబీ సీఇవో(EDB CEO)గా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారంటూ  కృష్ణ కిషోర్‌పై గతంలో వివిధ సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.


2019లో వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చెయ్యడమే కాకుండా ఆయనపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు  చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకుని కేసు నమోదు చేసినట్టు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సీఐడీకి సూచించిన ప్రభుత్వం... విచారణ పూర్తయ్యే వరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిశోర్‌కు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయనపై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. 


కాగా... తన సస్పెన్షన్‌పై కృష్ణ కిషోర్ క్యాట్‌ను ఆశ్రయించగా, సదరు ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్టే విధించింది. ఆపై కృష్ణ కిషోర్‌పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత విచారించిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పును వెల్లడించింది. అనంతరం ఐఆర్ఎస్ అధికారిపై నమోదైన కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో పెట్టిన సెక్షన్‌లు చెల్లవని కేసును హైకోర్టు క్వాష్ చేసింది. కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గానీ, లాభ పడినట్లు గాని ఎక్కడా ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సీఎం జగన్‌పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ(Laxmi narayana)తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా, దురుద్దేశపూర్వకంగా ఐఆర్‌ఎస్ అధికారిపై కేసు పెట్టినట్లు ధర్మాసనం నిర్థారించింది. భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్థేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టి వేయదగినదిగా పేర్కొంది.


గతంలో కృష్ణ కిషోర్ హైదరాబాద్(Hyderabad) ఆదాయపు పన్ను శాఖ సర్కిల్‌లో పని చేసిన సమయంలో జగన్‌(Jagan)కు చెందిన జగతి పబ్లికేషన్‌(Jagati publication)పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు జారీ చేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని కక్షసాధింపుగా అధికారంలోకి వచ్చిన తరువాత తనను సస్పెండ్ చేసి తప్పుడు కేసు బనాయించినట్లు  కృష్ణ కిషోర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసులపై ఆధారాలు సమర్పించడంలో సీఐడీ విఫలమైందని పేర్కొంది. తాజాగా ఈ కేసులన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2022-07-19T17:14:29+05:30 IST