Advertisement
Advertisement
Abn logo
Advertisement

అజాతశత్రుడు రోశయ్య అలిగిననాడు...

కొణిజేటి రోశయ్య అందరి బంధువు, అజాత శత్రువు! 70 ఏళ్ల ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం అనేకానేక అనుభవాలు గుదిగుచ్చిన దండ అయితే, ఆ దండలో దారం మాత్రం ఆయన విధేయత. మొన్నటి జవహర్లాల్ నెహ్రు, ఆచార్య ఎన్జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు తరం నుంచి, నిన్నటి ఇందిరాగాంధి, నేటి రాహుల్ గాంధీ తరం వరకూ అందరికీ సన్నిహితులుగా, ఆంతరంగికులుగా మెలగడానికి మూలకారణం ఆయన వినయమే.  ఇప్పటి   అయితే, అటువంటి అజాతశత్రువుకి కూడా కోపం తెప్పించి, ఆయన చేత కూడా 'రాజకీయం' చేయించిన ఘనత మాత్రం నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డిదే కావడం విశేషం. 

రాజకీయ ప్రస్థానం 

"ప్రజాసేవాతత్పరత, దేశభక్తి, చిత్తశుద్ధి, అంకితభావమే అప్పటి రాజకీయల్లో ప్రవేశించిన మాలాంటి వాళ్లకి పునాది..." అని తరచూ చెప్పుకున్న కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఒక దిగువ మధ్యతరతి వైశ్య కుటుంబంలో పుట్టారు . ఐదో తరగతి వరకూ సొంత వూళ్లో, మూడో ఫారం వరకూ రెండు మైళ దూరంలోని పెరవలిలో, స్కూలు ఫైనలు, పీయూసీ ఇంకొంత దూరంలో ఉన్న కొల్లూరులో చదివారు. గుంటూరు హిందూ కాలేజ్‌లో డిగ్రీ చదివారు. నాదెండ్ల భాస్కరరావు, ఆలపాటి ధర్మారావు హైస్కూల్లో రోశయ్య సహాధ్యాయులు.  

సుమారు 20 ఏళ్ల వయసుల్లో కొత్త రఘురామయ్య నేతృత్వంలో ఆచార్య ఎన్జీ రంగా ఏర్పాటు చేసిన కిసాన్ యాత్రా స్పెషల్‌లో వందలాది రైతులతో పాటు ఉత్తర భారతదేశమంతా పర్యటించడం రోశయ్య తొలి రాజకీయానుభవం. ఆ యాత్రలో భాగంగా అప్పటి ప్రధాని నెహ్రూని కలిశారు రోశయ్య. 


ఆయన ప్రజాక్షేత్రంలో జనం ఓట్లతో నాయకుడైన సందర్భాలు తక్కువ. పెద్దల సభ (శాసన మండలి) రద్దయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటీ, రెండు సందర్భాల్లో ప్రజానాయక పాత్ర పోషించి ప్రజల ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆయన ఎన్నికల రాజకీయం ఓటమితో మొదలయ్యింది. చీరాల నియోజకవర్గం నుంచి  ప్రముఖ చేనేత నేత ప్రగడ కోటయ్య మీద 1967లో పోటీ చేసి ఓడిపోయారు రోశయ్య.

మరుసటి ఏడాది- 1968లో ఆయన శాసనమండలికి ఎంపిక కావడంలో కూడా ఆయన రాజకీయ జీవనసూత్రం ఇమిడి ఉందనుకోవచ్చు. రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఆచార్య ఎన్జీ రంగా ఆశీస్సులతో శాసనమండలికి పోటీచేశారు రోశయ్య. కానీ, స్వతంత్ర పార్టీ బలం 7 ఎమ్మెల్యేలే. అయినా రోశయ్య గెలిచారు. ఎలాగంటే, రోశయ్య వినయవిధేయతలకి ముచ్చటపడిన అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆయనని గెలిపించారు. ఆ సందర్భంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం కచ్చితంగా గమనించ దగిన విషయం.


స్వతంత్ర పార్టీ ఎమ్మెల్సీగా ప్రతిపక్షంలో ఉన్నాల్, తనని గెలిపించిన అధికార కాంగ్రెస్ పక్షానికి ఆయన విధేయంగానే ఉన్నారు. కాసు ప్రోద్బలంతో 1971లో రోశయ్య కాంగ్రెస్ తీర్థం స్వీకరించారు. కాసు తర్వాత ముఖ్యమంత్రులైన పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు లకు కూడా ఆయన సన్నిహితుడుగానే ఉన్నారు. 1978లో కాంగ్రెస్ చీలిక తర్వాత జలగం, కాసు క్యాంపు నుంచి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ (ఇందిర) శిబిరానికి వెళ్ళాక, చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభృతులు అందరికీ నమ్మకస్తుడిగా, సహచర మంత్రిగానే ఉన్నారు రోశయ్య. మిత్రుల్ని నెత్తిన పెట్టుకోవడం, శత్రువుల్ని శేషం లేకుండా (రాజకీయంగా) తుదముట్టించడంలో తనకితానే సాటి అనిపించుకున్న వైయస్ రాజశేఖర రెడ్డి కూడా రోశయ్యని చేరదీశారు. ఒక దశలో  వైయస్సార్ ముఠారాజకీయాల మీద అధిష్టానానికి ఫిర్యాదు చేశారు రోశయ్య. అయినా కూడా రోశయ్య మీద కక్షకార్పణ్యాలు పెట్టుకోలేదు వైఎస్; దానికి కారణం, అలా రోశయ్యని ముందుకు తోసి, వెనక ఉండి కథ నడిపించింది కోట్ల విజయభాస్కర రెడ్డి అని వైఎస్ నమ్మడం! అందుకే, తన హయాంలో రెండో సారి కూడా శాసనమండలి ద్వారా ఎన్నిక చేయించి, ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయనకే అప్పగించారు వైఎస్.

జగన్... జగడం! 

రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తొలిసారి వైరిపక్షంగా గుర్తించింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువరాజు, నేటి అవశేషాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డే కావడం విశేషం.  'అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిననాడు...' అన్నట్టు రోశయ్య అప్పటి ముఖ్యమంత్రిగా తనదైన చతురతతో పావులు కదపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు.  

2009 సెప్టెంబరు 2 న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం పాలయ్యారు. జగన్‌ కే కచ్చితంగా పట్టాభిషేకం జరుగుతుందని అస్మదీయులందరూ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ కారణంగా  సెప్టెంబర్ 3, 2009న ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణం చేయడాన్ని చాలామంది మంత్రులు పట్టించుకోలేదు. సరికదా కొన్ని దుర్వాఖ్యానాలు చేశారు. అది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య పట్ల అవహేళన అన్న కనీస జ్ఞానం కూడా మరిచి ప్రవర్తించారు. ఆనవాయితీగా చేయాల్సిన ప్రమాణస్వీకారానికి విముఖత చూపినవారు కొందరైతే, రాకుమారుడు జగన్ కి పట్టం కట్టకపోతే, తమకి పదవులు వద్దని ఆర్భాటం చేసిన వారు మరికొందరు. రోశయ్య కేబినెట్‌లో కొనసాగలేమని కొందరు మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కారు.


ఇక ముఖ్యమంత్రిగా రోశయ్య చేసిన తొలి అధికారిక పర్యటన

కర్నూలు వరద బాధితుల పరామర్శ!  అధికారులు, పోలీసులు కుమ్మక్కై ప్రజలకు అందాల్సిన వాటిని కూడా అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు రేగి, కడుపు రగిలిపోయి ఉన్నారు అక్కడి ప్రజలు.  దాని ఫలితం, రోశయ్యకు అవమానం, ఆయన కాన్వాయ్ మీద రాళ్ళ వర్షం. అయితే, అప్పటి డిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు మాత్రం  జగన్ ముఠానే రాళ్ళ దాడికి తెగబడిందని ఆరోపించారు.  పవర్ కట్ సాకుతో సచివాలయం లిఫ్ట్ దగ్గర ఒక ముఖ్యమంత్రిని 20 నిమిషాల పాటు వేచిఉంచిన సందర్భం అంతకుముందెన్నడూ లేదు. ముఖ్యమంత్రిని సచివాలయంలోని సమతా బ్లాక్ లో కలవడానికి వచ్చిన అమెరికా రాయబారి తిమోతి జెరెమార్ ముందే ఆ అవమానం జరిగింది రోశయ్యకి. 

అటువంటి దశలో తనమీద పడే ప్రతి రాయి మీదా 'జగన్' పేరుని అధిష్టానంతో పాటు అందరికీ కనబడేలా చేసి, ఒక్కో రాయిని తన కోట నిర్మాణానికి వాడుకున్నారు రోశయ్య. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అప్పుడు కోల్పోతే,  మరిక సాధ్యపడదనుకున్న జగన్ తన ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో, తాడు బిగిస్తాడని ముందే ఊహించిన రోశయ్య. జగన్ చేతే పీటముడి వేయించేలా చేశారు. అధిష్టానం చేత 'మమ' అనిపిస్తూ, జగన్ పునాదులు ఒక్కొక్కటే పెళ్ళగించారు. బీసీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ సమస్య నుంచి, పాతబస్తీలో అప్పుడు జడలు విప్పిన మతోన్మాదం పేరిట జరిగిన దాడుల మంచి...... ఇంకా తన పాలన అసమర్థమైనదని నిరూపించడానికి జగన్ వర్గం ప్రయత్నిస్తోందని రుజువులు అక్కర్లేని  నిజాలుగా నిరూపించారు రోశయ్య. కూర్చున్న కొమ్మనే నరుకుతున్న మతిమాలిన వర్గంగా జగన్ అనుచర గణాన్ని నిలబెట్టారాయన. 


అనధికార ముఖ్యమంత్రిలా జగన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వరివేష్టించి ఉంటే ఆయన దగ్గరకు బారులు తీరిన  మంత్రులే ఆ తర్వాత జగన్ కి ఎదురుతిరిగేలా పావులు కదిపారు రోశయ్య. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పార్టీకి,  ప్రజలకీ సొంతమైన ఆస్తి అని, తామంతా ఆయన వారసులమే అని జగన్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టేలా తన రాజకీయ చాతుర్యాన్ని చూపారు రోశయ్య

చివరి మజిలీ

పలు శాఖలకు మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన రోశయ్య 2011 ఆగస్టు  నుంచి 2016 ఆగస్టు వరకూ తమిళనాడు గవర్నర్ గా చేసి, ఐదేళ్ల పదవీకాలం ముగిసిన నాటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు.


ఇప్పుడున్న రాజకీయ వాతావరణం, పరిస్థితులు 1950లలో ఉండిఉంటే తాను అసలు రాజకీయాల్లో ప్రవేశించగలిగేవాడ్ని కాదు, మనగలిగేవాడ్ని కాదు అని తరచూ అంటూండేవారు రోశయ్య. అర్థబలం, అంగబలం లేకపోయినా, జెండాలు మోసి జేజేలు కొట్టే కార్యకర్తగా ఆయన మిగిలిపోదల్చుకోలేదు. అలానే, తాను జనాకర్షక నాయకుడై, తన వెనక తనదైన గుంపుని పోగేసే 'రాజకీయాలూ' ఆయన చేయదల్చుకోలేదు. చిత్రమైన ఆ వైరుధ్యానికి నిదర్శనంగా నిలిచిన ఒకేఒక రాజకీయవేత్త రోశయ్య!

Advertisement
Advertisement