ఏపీ రాజధాని కేసులపై హైకోర్టులో ముగిసిన వాదనలు

ABN , First Publish Date - 2021-11-15T23:51:20+05:30 IST

రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాజధాని అమరావతి కేసుల్లో రైతుల తరపున...

ఏపీ రాజధాని కేసులపై హైకోర్టులో ముగిసిన వాదనలు

అమరావతి: రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాజధాని అమరావతి కేసుల్లో రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. రాజధానిపై నిర్ణయం ఒక్కసారే తీసుకుంటారని, మాస్టర్ ప్లాన్ పరిపూర్ణమైన విధి విధానంతో జరిగిందని ధర్మాసనానికి న్యాయవాది శ్యామ్ దివాన్ తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన శరీరం నుంచి ఆత్మను వేరు చేయడమేనని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పటికి రాష్ట్రం అలానే ఉందని, ఇచ్చిన హామీలు నెరవేరబడాలని శ్యామ్ దివాన్ తెలిపారు. ‘‘ రాష్ట్ర రాజధాని కోసం, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష కోసం అమరావతి రైతులు భూములు త్యాగం చేశారు. రాజధాని భూసమీకరణలో ల్యాండ్ పూలింగ్ స్కీం కోసం ప్రభుత్వ అధికారులే రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం రూ. 5 వెలకోట్ల ఖర్చు పెట్టి నిర్మించబడిన రాజధానిని వదిలేసింది. 41 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రభుత్వం నిలుపుదల చేసింది. రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండాలని అత్యధికంగా ప్రజలు అభిప్రాయపడ్డారు.’’ అని కోర్టుకు న్యాయవాది శ్యామ్ దివాన్ తెలిపారు. పిటిషనర్స్ తరపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-15T23:51:20+05:30 IST