‘నన్ను చంపాల్సిన అవసరం అఖిలప్రియకు ఏముంది?’

ABN , First Publish Date - 2020-06-06T16:10:12+05:30 IST

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ యువ నాయకురాలు అఖిలప్రియ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని టీడీపీ సీనియర్ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి

‘నన్ను చంపాల్సిన అవసరం అఖిలప్రియకు ఏముంది?’

కర్నూల్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ యువ నాయకురాలు అఖిలప్రియ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని టీడీపీ సీనియర్ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి మరోసారి గుర్తు చేసుకున్నారు. తనను చంపించాల్సిన అవసరం అఖిలప్రియకు ఏముందని సందేహం వ్యక్తం చేశారు. తన మిత్రుడు భూమానాగిరెడ్డిని భుజాలపై ఎత్తుకెళ్లి నామినేషన్‌ వేయించామని, కార్యకర్తలను తాను ఎలా కాపాడుకుంటానో... ఆళ్లగడ్డలో స్థానిక నేతలను అడిగితే తెలుస్తుందన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి 30 ఏళ్లు అండగా ఉన్నానని తెలిపారు. అఖిలప్రియ లాంటి నేతలు ఉంటే మరెందరు చనిపోతారోనన్న అనుమానం వ్యక్తం చేశారు. శోభ, నాగిరెడ్డి, తాను కష్టపడితేనే అఖిలప్రియ అక్కడ కూర్చున్నదని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. 


అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తనను హత్య చేయడానికి అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని, ఆ విషయం తెలిసి షాక్‌కు గురయ్యానని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన అఖిలప్రియ..  ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ4 ముద్దాయిగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, ఇంకా విచారణ పూర్తి కాలేదని.. తమ హస్తం ఉన్నట్లు బయటకు రాలేదని ఆమె తెలిపారు. విచారణ కొనసాగుతున్న తరుణంలో అఖిల ప్రియను అరెస్టు చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు ఏవీ సుబ్బారెడ్డి పేరుతో ఉంటే అవి ఏవీ కుటుంబానికే చెందుతాయని.. ఆస్తి గొడవలు లేవని ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పాడని అఖిలప్రియ గుర్తుచేశారు. ఏవీ సుబ్బారెడ్డికి పదవులు ఇస్తే తాను అడ్డుకోలేదని ఆమె చెప్పారు. ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయొద్దని చెప్పలేదని, ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు ఎలా పనులు చేయిస్తాడో చూడాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు.   

Updated Date - 2020-06-06T16:10:12+05:30 IST