బాబోయ్.. సికింద్రా‘బాదుడు’.. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన సంచలన విషయాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2022-04-25T18:55:01+05:30 IST

దక్షిణమధ్య రైల్వేకు కేంద్ర బిందువైన సికింద్రాబాద్‌ స్టేషన్‌ దోపిడీకి నిలయంగా..

బాబోయ్.. సికింద్రా‘బాదుడు’.. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన సంచలన విషయాలు వెలుగులోకి..!

  • రైల్వేస్టేషన్‌లో ధరల దోపిడీ
  • ఫుడ్‌కోర్టుకు వెళ్తే జేబులు ఖాళీ
  • వాహనాల పార్కింగ్‌.. వామ్మో.. 
  • మంచి నీటికీ కటకటే..

హైదరాబాద్‌ సిటీ : దక్షిణమధ్య రైల్వేకు కేంద్ర బిందువైన సికింద్రాబాద్‌ స్టేషన్‌ దోపిడీకి నిలయంగా మారింది. స్టేషన్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. అన్నింటికీ అధిక ఛార్జీలే చెల్లించాల్సిన పరిస్థితి. ఫుడ్‌కోర్టులో వాటర్‌ బాటిల్‌ కొనాలన్నా.. తినుబండారాలు తీసుకుందామన్నా ధరల పట్టిక చూస్తే దడపుడుతోంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అధిక ధరలపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిర్వహణ బాధ్యతలను కొన్నేళ్ల క్రితం ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌ డీసీ)కి అప్పగించారు. రైళ్లను మాత్రమే భారతీయ రైల్వే నడిపిస్తుండగా.. టికెట్లు, ఫుడ్‌కోర్టు, ఇతర అమ్మకాలన్నీ కాంట్రాక్టర్ల చేతుల్లో ఉన్నాయి. ఫుడ్‌ కోర్టులో బయటి రేట్లతో పోల్చితే 20-40 శాతం అధికంగా ఉన్నాయి. స్టేషన్‌లో వాహనాల పార్కింగ్‌ విషయానికొస్తే కారుకు తొలి గంటకు రూ. 50, తర్వాత గంటగంటకు రూ. 25 పెరుగుతూ వస్తోంది. బైక్‌కు తొలిగంట కు రూ. 20, తర్వాత గంట గంటకు రూ. 15 పెంచుతున్నారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.


తినుబండారాలు అ‘ధర’హో

ఫుడ్‌కోర్టులోని తినుబండారాల రేట్లు గుబులు పుట్టిస్తున్నాయి. నాలుగు ఇడ్లీలకు రూ.50, ఇడ్లీ+వడకు రూ.50, రెండు సమోసాలు రూ.30, ఉల్లిదోశ రూ.50, వెజ్‌బిర్యానీ రూ.100, వెజ్‌ ఫ్రైడ్‌రైస్‌ రూ.80, లెమన్‌ రైస్‌కు రూ.80 వసూలు చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌ (చిన్న బాటిల్‌)కు రూ.20 వసూలు చేస్తున్నారు. బయటి రేట్లతో పోల్చితే ధర ఎక్కువగా ఉందని ఎవరైనా ప్రయాణికులు ప్రశ్నిస్తే లక్షలు పోసి కాంట్రాక్టు దక్కించుకున్నాం.. ఇక్కడ రేట్లు ఇంతే ఉంటాయని హోటళ్ల సిబ్బంది చెబుతున్నారు.


ఏసీ వెయింటింగ్‌ హాల్‌లో గంటకు రూ.25

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిర్వహణ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. స్టేషన్‌లో 10 ఫ్లాట్‌ఫాంలు ఉన్నప్పటికీ ప్రయాణికులకు సరిపడా విశ్రాంతి గదులు లేవు. వేసవికాలంలో రైళ్ల కోసం ఫ్లాట్‌ఫాంలపై నిరీక్షిస్తూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తప్పనిసరి పరిస్థితిలో ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫాంపై ఏర్పాటుచేసిన ఏసీ వెయింటింగ్‌ హాల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ గతంలో గంటకు రూ.10 టికెట్‌ ఛార్జీ ఉండగా.. ప్రస్తుతం గంటకు రూ.25, తర్వాత ప్రతి గంటకు రూ.20 వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. 


చల్లని నీటికి కటకట

స్టేషన్‌లోని అన్ని ఫ్లాట్‌ఫాంలపై తాగునీటి నల్లాలు ఏర్పాటు చేసినా అందులో నుంచి వేడి నీరు వస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి నేపథ్యంలో చలివేంద్రాలు, చల్లని తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఫుడ్‌కోర్టుల్లో డబ్బులు పెట్టి వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. తాగునీటి కోసం ప్రయాణికుల సంఘం నాయకులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తిచేసినా పట్టించుకునే నాథుడే లేడు.


దోపిడీకి అడ్డా

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులను దోచుకునే అడ్డాగా మారింది. పార్కింగ్‌ను ప్రైవేట్‌పరం చేయడంతో నిర్వాహకులు దోచుకుంటున్నారు. ప్లాట్‌ఫాంపై ప్రతి వస్తువునూ అధిక ధరకు అమ్ముతున్నా అడిగే నాథుడే లేడు. ఈ విషయంపై గతంలో అధికారులను కలిసి వినతిపత్రాలు అందించినా సమస్య పరిష్కారం కాలేదు. పార్కింగ్‌ దోపిడీని నిలిపివేయకుంటే త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.

Updated Date - 2022-04-25T18:55:01+05:30 IST