HYD : మహా రికవర్రీ.. వెబ్‌సైట్‌లో ఫైళ్లు మాయం.. అన్నీ అనుమానాలే.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2021-10-02T18:32:42+05:30 IST

అది హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు చెందిన వెబ్‌సైట్‌...

HYD : మహా రికవర్రీ.. వెబ్‌సైట్‌లో ఫైళ్లు మాయం.. అన్నీ అనుమానాలే.. అసలేం జరిగింది..!?

అది హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు చెందిన వెబ్‌సైట్‌. కీలక సమాచారమంతా అందులోనే నిక్షిప్తమై ఉంటుంది. ఏమైందో ఏమో కానీ.. 20 రోజులుగా అందులోని ఫైల్స్‌ మాయం అయ్యాయి. కనిపించినా క్లిక్‌ చేస్తే స్పందించడం లేదు. ఈ నెల మొదటి వారంలో పూర్తిగా షట్‌డౌన్‌ అయింది. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చినా ప్లానింగ్‌ విభాగానికి చెందిన డేటా పూర్తిస్థాయిలో రికవరీ కాలేదు. ముఖ్యంగా 2021లో హెచ్‌ఎండీఏకు వచ్చిన వివిధ రకాల దరఖాస్తులకు సంబంధించిన డేటా మొత్తం మాయమైంది. దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకోవాలనుకునే వారికి ఏ సమాధానం చెప్పాలో తెలియక అధికారులు నీళ్లు నములుతున్నారు. అసలేం జరిగింది, డేటాను మిస్‌ చేశారా, లేకుంటే హ్యక్‌ అయిందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


హైదరాబాద్‌ సిటీ : హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో మాయమైన డేటా రికవరీ కాకపోవడంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా సత్వరమే పరిష్కరించే నిపుణులకు సంస్థలో కొదవలేదు. అయినప్పటికీ 20 రోజులుగా సమస్య పరిష్కారం కావడం లేదు. ఆన్‌లైన్‌లో జరగాల్సిన దరఖాస్తుల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. అయితే, విషయం బయటకు రాకుండా మహా సీక్రెట్‌గా వ్యవహరిస్తున్నారు.


దేశంలోనే తొలిసారి..

భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతులతో పాటు పట్టణ ప్రణాళికా విభాగం చేయాల్సిన పనులన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడానికి డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్)ను దేశంలోనే తొలిసారి 2016లో హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ, డైరెక్టర్‌ ఆఫ్‌ కంట్రీ ప్లానింగ్‌తో పాటు దేశంలోని పలు మున్సిపాలిటీలు, డెవల్‌పమెంట్‌ అథారిటీలో ఈ విధానాన్ని అమలు చేశారు. డీపీఎంఎస్‌ ఆధారంగానే గతేడాది రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ బీపాస్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్‌ అనుమతులు, ఆక్యుపెన్సీ, ఎన్‌ఓసీ, ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ (సీఎల్‌యూ), ల్యాండ్‌ యూజ్‌ ఇలా అన్ని రకాల దరఖాస్తులనూ డీపీఎంఎస్‌లో  చేసుకోవడంతో పాటు ప్రొసీడింగ్‌ కాపీలను ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఈ విధానం ద్వారా దరఖాస్తు ఏ అధికారి వద్ద ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉందో తెలుస్తుంది. ఉన్నతాధికారులు పరిశీలించేందుకు వీలుంది. డీపీఎంఎ్‌సలో ల్యాండ్‌ యూజ్‌ దరఖాస్తులు 36 వేల వరకు రాగా, భవన, లేఅవుట్‌ అనుమతుల దరఖాస్తులు 9 వేలకు పైగా వచ్చాయి. అనుమతుల ద్వారా సుమారు రూ.2500 కోట్లకు పైగా ఆదాయం హెచ్‌ఎండీఏకు వచ్చింది. 


ప్రొసిడీంగ్‌ కాపీ వచ్చినా...

నగర శివారులో లేఅవుట్‌ అనుమతుల కోసం ఓ డెవలపర్‌ దరఖాస్తు చేసుకున్నాడు. అధికారుల పరిశీలన అనంతరం ఫీజులు చెల్లించాలని ఆ డెవలపర్‌కు ఆన్‌లైన్‌లో సమాచారం వచ్చింది. దీంతో ఆన్‌లైన్‌లో డెవల్‌పమెంట్‌ చార్జీలను చెల్లించి, లేఅవుట్‌లోని కొంత స్థలాన్ని హెచ్‌ఎండీఏకు మార్ట్‌గేజ్‌ కూడా చేశారు. అనంతరం అధికారులు డ్రాఫ్ట్‌ లేఅవుట్‌కు అనుమతులిస్తూ ప్రొసీడింగ్‌ జారీ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం గత నెల మొదటివారంలో జరిగింది. కానీ ప్రస్తుతం హెచ్‌ఎండీఏ డేటాలో చెల్లింపులు చేయనట్లుగా, ప్రొసీడింగ్‌ ప్రాసెస్‌ జరగనట్లుగా, ఓ అధికారి వద్ద ఫైలు పెండింగ్‌లో ఉన్నట్లుగా ఉంది. గమనించిన డెవలపర్‌ హెచ్‌ఎండీఏ కార్యాలయానికి పరుగులు తీశారు. ఇలా చాలా మంది దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్‌లో మిస్సయిన సమాచారం, ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా ఎవరికి వారే రాతపూర్వకంగా ఇవ్వాలని ఉన్నతాధికారులు ఉద్యోగులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉద్యోగులు ఇచ్చే వివరాల ఆధారంగానే డేటాను అప్‌లోడ్‌ చేయడం తప్పా మరో మార్గం లేదని సాంకేతిక నిపుణులు చెప్పినట్లు సమాచారం. 


పని చేయని డీపీఎంఎస్‌

హెచ్‌ఎండీఏలోని టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అడ్మినిస్ర్టేషన్‌ తదితర విభాగాల్లో సేవలన్నీ ఆన్‌లైన్‌ అయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెబ్‌సైట్‌ షట్‌డౌన్‌ కావడంతో సేవలన్నీ నిలిచిపోయాయి. వారం రోజుల తర్వాత వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయినా డేటా రికవరీ కాలేదు. సాంకేతిక నిపుణులు ప్రయత్నించినా ఇబ్బందులు తొలగిపోలేదు. దీంతో వినియోగదారుడికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్టేటస్‌ తెలిపే పరిస్థితి ప్రస్తుతం అధికారులకు లేదు. డీపీఎంఎ్‌సలో ఉన్న ఫైల్స్‌ ఓపెన్‌ కావడం లేదు. ఓపెన్‌ అయినా పరిశీలన చేసే పరిస్థితి ఉండడం లేదు. 2021లో హెచ్‌ఎండీఏకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన డేటాలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఏవీ ఓపెన్‌ కావడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో హెచ్‌ఎండీఏకు డీపీఎంఎ్‌సలో వచ్చిన దరఖాస్తుల డేటా మొత్తం పోయినట్లు సమాచారం. పలువురు తమ అనుమతుల ప్రొసీడింగ్‌ కోసం లక్షల రూపాయలను ఆన్‌లైన్‌లోనే  చెల్లించారు. ప్రస్తుతం ఆ డేటా లేదు.


మిస్‌ అయిందా, తొలగించారా..?

2021కు సంబంధించిన డేటా మొత్తం మాయం కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బహుళ అంతస్తుల భవన నిర్మాణ, లే అవుట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీల అనుమతులకు సంబంధించి పొరపాట్లను కనుమరుగు చేయడానికి డేటాను మిస్‌ చేశారా, లేకుంటే డేటాను చోరీ చేసేందుకు వీలుగా వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌కు ఉన్న సాంకేతికతను తొలగించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురక్షిత టెక్నాలజీ వ్యవస్థ ఉన్న హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ నుంచి 9 నెలల డేటా మాయం కావడం సాధారణ విషయం కాదని ఓ సాంకేతిక నిపుణుడు అభిప్రాయపడ్డారు.  వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణను స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ)కి అప్పగించిన తర్వాత ఇబ్బందులు తలెత్తాయని, నెట్‌వర్క్‌ సమస్యే కారణమని ఓ అధికారి తెలిపారు. వెబ్‌సైట్‌లోని సాంకేతిక సమస్యకు ఇరవై రోజులుగా పరిష్కారం చూపడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు.

Updated Date - 2021-10-02T18:32:42+05:30 IST