అనుకోకుండా ఆస్ట్రేలియాలో...

ABN , First Publish Date - 2020-07-10T07:26:16+05:30 IST

రెండేళ్ల నుంచి నడుము నొప్పి వేధిస్తున్నా.. కొన్ని ముఖ్యమైన టోర్నీల్లో అలాగే ఆడా. అదే క్రమంలోనే గతేడాది ఏప్రిల్‌లో

అనుకోకుండా ఆస్ట్రేలియాలో...

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

రెండేళ్ల నుంచి నడుము నొప్పి వేధిస్తున్నా.. కొన్ని ముఖ్యమైన టోర్నీల్లో అలాగే ఆడా. అదే క్రమంలోనే గతేడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన టోర్నీలో పోటీపడి రన్నర్‌పగా నిలిచా. ఆ తర్వాత  నొప్పి తీవ్రమవడంతో నా కోచ్‌ స్టీఫెన్‌ కూన్‌ సలహా మేరకు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్‌ పాల్‌ నెస్‌ వద్ద చికిత్స కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ రావాలని నిర్ణయించుకున్నా.


ఊహించని లాక్‌డౌన్‌..

నా నొప్పి పూర్తిగా నయమయ్యేందుకు రెండునెలలు పడుతుందని పాల్‌ ముందే చెప్పాడు. అన్ని రోజులు అక్కడ ఉండడమంటే ఖర్చుతో కూడుకున్నదని తొలుత అక్కడికి వెళ్లేందుకు సంకోచించా. కానీ, ‘గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌’ సహాయంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మెల్‌బోర్న్‌ చేరుకున్నా. అప్పటికి కరోనా వైరస్‌ తీవ్రత అంతగా లేదు. నెలరోజులు గడిచాక లాక్‌డౌన్‌ విధించారు. అయితే, నిర్దేశిత వేళల్లో జాగింగ్‌, ఫిట్‌నె్‌సలాంటి వర్కవుట్స్‌ కోసం పార్కులకు వెళ్లేందుకు అక్కడ అవకాశమిచ్చారు. దీంతో నెలపాటు ఫిట్‌నెస్‌ సంబంధిత వ్యాయామాలే చేశా. నేను బస చేసిన హోటల్‌లో అమ్మతో ఫోన్‌లో మాట్లాడుతూ వంట చేయడం నేర్చుకున్నా. కొద్దిరోజుల తర్వాత మన వంటకాలు మానేసి పాల్‌ చెప్పిన డైట్‌ చార్ట్‌ను అనుసరించడం ప్రారంభించా.


యూటీఆర్‌ టైటిల్‌ కైవసం

పాల్‌ దగ్గర రెండు నెలల చికిత్స షెడ్యూల్‌ ముగిసేలోపు నా నడుము నొప్పి పూర్తిగా నయమైంది. అక్కడి నుంచి వచ్చేద్దామంటే ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ పొడిగిస్తూనే ఉన్నారు. దీంతో కొన్నిరోజులు అక్కడే ప్రాక్టీస్‌ చేయాలనుకున్నా. తొలుత గోడకు బంతిని కొడుతూ ఆడడం ప్రారంభించా. ఆ తర్వాత నా హోటల్‌కు సమీపంలోనే ఉన్న ఓ అకాడమీలో హైదరాబాద్‌కు చెందిన ఓ టెన్నిస్‌ సహచరుడితో కలిసి సాధన చేయడం మొదలుపెట్టా. ఇంతలో అక్కడ యూటీఆర్‌ సిరీ్‌సలు మొదలయ్యాయి. గతవారం ఓ సిరీస్‌ సింగిల్స్‌ విభాగంలో ఎంట్రీ దక్కింది. తొలి మ్యాచ్‌లో బై లభించింది. చాలా రోజుల తర్వాత బరిలోకి దిగడంతో రెండో మ్యాచ్‌లో నెగ్గడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ట్రాక్‌లో పడడంతో ఫైనల్లో 6-3, 6-3తో డబ్ల్యూటీఏ డబుల్స్‌ 37 వ ర్యాంకర్‌ డిసిరె క్రాజిక్‌పై నెగ్గి టైటిల్‌ కైవసం చేసుకున్నా. ప్రస్తుతానికి ఇక్కడ మరో నెలరోజులు పాటు లాక్‌డౌన్‌ పొడిగించారు. ఇంటికి వచ్చే అవకాశం లేకపోవడంతో మరికొన్ని యూటీఆర్‌ సిరీ్‌సల్లో ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. 

Updated Date - 2020-07-10T07:26:16+05:30 IST