ఎప్పుడూ... అమ్మే మా ధైర్యం!

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

కొందరికి మరణం ఉండదు. ఇతరుల ఆశయాలు, ఆలోచనల రూపంలో ఎప్పుడూ మన మధ్యే ఉంటారు. వేమూరి కనకదుర్గ కూడా అలాంటి ఒక మహిళ. ఆమె ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అర్థాంగి మాత్రమే కాదు...

ఎప్పుడూ... అమ్మే మా ధైర్యం!

కొందరికి మరణం ఉండదు. ఇతరుల ఆశయాలు, ఆలోచనల రూపంలో ఎప్పుడూ మన మధ్యే ఉంటారు. వేమూరి కనకదుర్గ కూడా అలాంటి ఒక మహిళ. ఆమె ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అర్థాంగి మాత్రమే కాదు. ఆంధ్రజ్యోతి విజయాలలో అర్థభాగం కూడా. సంస్థను ఒక కుటుంబంలా చూసుకోవటమే కాదు.. తన కుటుంబాన్ని కూడా దృఢమైన ఒక సంస్థలా నిలబడేలా చేశారు. ‘‘అమ్మ లేదనే విషయం ఇప్పటకీ మేము నమ్మటం లేదు. మాకు సంబంధించినంత వరకూ ఆమె గతం కాదు. వర్తమానం. రోజూ మేము చేసే ప్రతి పనిని ఆమె చేయిపట్టుకొని చేయిస్తున్నట్లే ఉంది..’’ అంటారు కన్నబిడ్డలు వేమూరి ఆదిత్య, అనూష. కనకదుర్గ మరణం కుటుంబాన్నే కాదు. బంధుమిత్రులను కూడా విషాదంలో ముంచేసింది. ‘‘ అమ్మది జగమంత కుటుంబం. అందుకే మా స్నేహితులను మేము ఓదార్చాల్సి వస్తోంది.. ఎప్పుడో ఏ రాత్రో సమయం చిక్కినప్పుడు మమల్ని మేము ఓదార్చుకుంటున్నాం..’’ అంటారా ఆ అక్కాతమ్ముళ్లు. మదర్స్‌డే వస్తే గార్డెన్‌లో దొరికే రకరకాల పువ్వులను కోసి పుష్పగుచ్ఛంగా అమ్మకు ఇవ్వటం ఆదిత్యకు అలవాటు. ‘‘కనీసం వారం రోజులు ఆ బొకేను ఉంచుకొనేది. ఈ సారి అమ్మ భౌతికంగా మా మధ్య లేదు.. కానీ ఆలోచనల్లో.. ఆశయాలలో మాతోనే ఉంది.. మాకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటుంది..’’ అనే ఆదిత్య, అనూషలను... మదర్స్‌ డే సందర్భంగా ‘నవ్య’ పలకరించింది.          

- సివిఎల్‌ఎన్‌




‘అమ్మ’ అనగానే మీకు వచ్చే తొలి జ్ఞాపకం..?

ఆదిత్య: మేము రాంనగర్‌లో ఒక సింగిల్‌ బెడ్‌రూమ్‌లో ఉండేవాళ్లం. చిన్న ఇల్లు.. నలుగురమే ఉండేవాళ్లం. అమ్మ అనగానే నాకు ఆ రోజులే గుర్తుకొస్తాయి..

అనూష: అమ్మ బ్యాంకులో పనిచేసేది. అందువల్ల నన్ను డేకేర్‌లో వదిలి బ్యాంకుకు వెళ్లేది. ఆ జ్ఞాపకాలు.. వాటితో పాటుగా నన్ను స్కూలుకు తీసుకువెళ్లిన రోజులు.. ఒక సారి నేను పడిపోతే హాస్పటల్‌లు తీసుకువెళ్లిన రోజులు.. ఇలా ఒకటా.. రెండా .. అనేక జ్ఞాపకాలు


మీకు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చేవారా?

అనూష: అమ్మ నాకు, ఆదికి క్లోజ్‌ ఫ్రెండ్‌. తను మాకు అన్నీ చెప్పేది. మేము తనకు అన్నీ చెప్పేవాళ్లం. మా మధ్య దాపరికాలేమి ఉండేవి కావు. ఏ విషయమైన తనతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. వాటిపై తన అభిప్రాయం చెప్పేది. అంతే తప్ప ఏ అభిప్రాయాన్ని మాపై రుద్దేది కాదు. 

ఆదిత్య:  మా ఇష్టాలే తనకు ఇష్టం. నాకు క్రికెట్‌ అంటే ఇష్టం. ఎంత ఆడినా ఏమి అనేది కాదు. ఆడుతూనే చదువుకోమనేది. ఇక మార్కుల విషయానికి వస్తే పెద్ద పట్టించుకొనేది కాదు. నాకు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఉండేది. కానీ ఆ రోజుల్లో ఆ బ్రాంచ్‌ లేదు. నాకు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ ఇష్టమని.. ఒక పెద్ద రీసెర్చే చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. అమ్మ పైకి చాలా గంభీరంగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆమెకు దగ్గరయితే - జీవితంలో దూరం కారు. మా స్నేహితులు మొదట్లో ఇంటికి వచ్చినప్పుడు నాన్నతో ఎక్కువ మాట్లాడేవారు. అమ్మ అంటే భయంభయంగా ఉండేవారు. ఆ తర్వాత అమ్మ వాళ్లకు ఎంత అలవాటయిపోయిందంటే- వాళ్ల వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చి చెప్పుకొనేవారు. వాటికి తను  పరిష్కారమార్గాలు చూపించేది. 




ఒక వైపు ఉద్యోగం.. మరో వైపు కుటుంబం.. ఈ రెండింటినీ ఆమె ఏలా సమన్వయపరుచుకొనేవారు..?

అనూష: అమ్మకు చాలా లీడర్‌షిప్‌ క్వాలిటీలు ఉండేవి. మొదట్లో తను బ్యాంకులో పనిచేసేది. ఆ సమయంలో మేము కూడా బ్యాంకుకు వెళ్లేవాళ్లం. లెడ్జర్లు.. లాకర్స్‌.. బొమ్మలు వేసుకోవటానికి కాగితాలు.. ఇలా- బ్యాంకుకు వెళ్లటం చాలా థ్రిలింగ్‌గా ఉండేది. బ్యాంకు అయిపోయిన తర్వాత మేం ముగ్గురం ఇంటికి వచ్చేసేవాళ్లం..

ఆదిత్య:  అమ్మ బ్యాంకులో సరదాగా డేటా ఎంట్రీ చేసేవాడిని. డేటాను ఎంట్రీ చేస్తే వంద రూపాయలు ఇచ్చేవారు. అప్పుడు బంజారాహిల్స్‌లో ఒక ఫుడ్‌ జాయింట్‌ ఉండేది. అక్కడికి వెళ్లి ఫుడ్‌ తినేసి వచ్చేసేవాళ్లం. డాడీకి పార్సిల్‌ తెచ్చేవాళ్లం. 

అనూష: మేము హైస్కూలుకు వచ్చేనాటికి అమ్మ బ్యాంకు నుంచి వలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుంది. దీంతో మాతో ఎక్కువ సమయం గడిపేది. నాన్న తన పనిలో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. నేను, అమ్మ, ఆది- ముగ్గురమే ఉండేవాళ్లం. మాకు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చి చదివించేది. ఇక డాడీ ఆంధ్రజ్యోతి పునఃప్రారంభించిన తర్వాత ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలన్నీ తనే చూసుకొనేది. ఫైనాన్స్‌ విషయంలో అమ్మ చాలా స్మార్ట్‌. కుటుంబం కోసం తను బ్యాంకు ఉద్యోగంలో  ఉండిపోయింది.  ‘‘నువ్వు ఎక్కడో ఉండాల్సిన దానివి..’’ అని మేము అంటూ ఉండేవాళ్లం. మేము అప్పుడు సరదాగా అన్నా- అది వాస్తవం. మా కుటుంబం ఈ రోజు ఇలా ఉందంటే దానికి కారణం అమ్మే! 

ఆదిత్య:  మా అందరి ఎనర్జీకి తనే సోర్స్‌.. ఉదాహరణకు మేమందరం ఏసీలు, లైట్లు వంటి విద్యుత్‌ పరికరాలనుకోండి.. తను మాత్రం ట్రాన్స్‌ఫార్మర్‌.. మా కుటుంబానికి తనే గైడింగ్‌ ఫోర్స్‌. నాన్న కూడా ‘‘బయట పని నేను చూసుకుంటా.. ఇంట్లోదంతా నువ్వు చూసుకో’’ అనేవారు. కేవలం మా నలుగురినే కాదు. ఇరువైపులా ఉన్న అనేక కుటుంబాలకు తనే ఒక పెద్ద దిక్కు. ఇప్పుడు అందరూ తను లేని లోటును ఫీలవుతున్నారు..


మీ ఇద్దరిలో ఎవరు అమ్మ కూచి..?

అనూష: ఆది అంటే వీసమెత్తు ఎక్కువ ఇష్టం. అలాగని నేను తక్కువని కాదు. ఆది విషయాలు ఎంతగా పట్టించుకొనేదంటే- వీడు అమెరికాలో ఉన్నప్పుడు- అమ్మే అల్లారం. అమెరికా సమయానికి ఇండియాలో నిద్ర లేచి.. వీడిని నిద్ర లేపేది. క్లాసుకు పంపేది.. అమ్మ వీడియో కాల్‌లో వంట చేసి చూపిస్తుంటే - వీడక్కడ చేసుకొనేవాడు. 

ఆదిత్య:  రోజూ కనీసం గంట సేపు మాట్లాడుకొనేవాళ్లం. అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత కూడా ప్రతి రోజు కనీసం రెండు గంటలు మాట్లాడుకోవాల్సిందే.. మధ్యాహ్నం భోజనాలయిన తర్వాత మాట్లాడుకునేవాళ్లం..

అనూష: టాపిక్‌ ఎంత సీరియస్‌ అనే విషయాన్ని బట్టి ప్రదేశాలు కూడా మారిపోయేవి. కొన్ని సార్లు కాఫీ షాపుల్లో.. రెస్టారెంట్‌లలో మాట్లాడుకొనేవాళ్లు.. టాపిక్‌ ఇంకా సీరియస్‌ అయితే నన్ను కూడా కలుపుకొనేవారు..

ఆదిత్య: ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. చాలా మందితో ఎక్కువ సేపు మాట్లాడితే ఎనర్జీ లెవెల్స్‌ తగ్గుతా. అమ్మతో ఎంత సేపు మాట్లాడితే అంత ఎనర్జీ పెరుగుతుంది. గత ఏడాది నాకు ఆరోగ్యం బావులేనప్పుడు.. అమ్మ రోజూ కనీసం గంట మాట్లాడేది. నాకు విపరీతమైన ఎనర్జీ వచ్చేది. డాక్టర్లకు ఈ ఈక్వేషన్‌ అర్థమయ్యేది కాదు. 


అమ్మ మీకు ఎలాంటి విలువలను నేర్పారు?

ఆదిత్య:  మొదట్లో మాది ఒక సాఽధారణ మధ్య తరగతి కుటుంబం. అప్పుడు ఎలాంటి విలువలు పాటించేవాళ్లమో ఈ రోజుకు ఆ విలువలనే పాటిస్తాం. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. లేకపోతే మళ్లీ అక్కడికే వెళ్లిపోతాం’ అని నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇక అమ్మ ఏ రోజు ఎటువంటి భేషజాలకు పోలేదు. చుట్టాలు.. స్నేహితులే కాదు.. ఆంధ్రజ్యోతిలో పనిచేసే ప్రతి ఉద్యోగి తన కుటుంబంలో మనిషే అనుకొనేది. వారి బాధలు తన బాధలనుకొనేది. వారికి చేతనైన సాయం చేసేది. అలా సాయం పొందినవారు అనేక మంది. తను లేదు అని తెలిసి మా కన్నా బాధపడ్డవారు ఎంతో మంది.. 

అనూష: మా పెద్దమ్మ పిల్లలు వినీత్‌, వీణ.. మామయ్య పిల్లలు సతీష్‌, ప్రత్యూషలు కూడా మాతో పాటే పెరిగారు. మాదంతా ఒక పెద్ద కుటుంబం. అమ్మ అందరినీ సమానంగానే చూసేది. ఇక చుట్టాలు, స్నేహితులు అనేక మంది. వాళ్ల ఇళ్లలో పెళ్లిల్లు.. పండగలు.. అన్నీ అమ్మ ఆధ్వర్యంలో జరగాల్సిందే! అమ్మ ఉదయం లేస్తే- రాత్రి దాకా ఫోన్‌లో ఎవరో ఒకరితో ఏదో ఒక సమస్య గురించి మాట్లాడుతూనే ఉండేది. నాన్న అప్పుడప్పుడు- ‘ఇక ఆ ఫోన్‌ అపవా..’ అంటూ ఉండేవారు. 


ఈ మధ్య కాలంలో మీతో ఆమె మనసు విప్పి మాట్లాడిన సందర్బాలేమైనా ఉన్నాయా?

అనూష: గత కొద్ది కాలంగా అమ్మకు బావుండటం లేదు. ఆ విషయం తను గుర్తించింది. ఈ మధ్య ఒక సారి మమ్మీ, నేను, శృతి (ఆదిత్య భార్య) మాట్లాడుకుంటున్న సమయంలో - ‘‘నేను వెళ్లిపోతే మీరు ఇలా చేయాలి.. మీకు ఈ బాధ్యతలు ఉన్నాయి’’ అని కొన్ని విషయాలు చెప్పింది. వాస్తవానికి నాన్న కూడా ‘‘అమ్మకు ఆరోగ్యం బావుండటం లేదు.. మీరే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి’’ అని చెప్పేవారు. కోవిడ్‌ వల్ల అందరం ఇంటి నుంచే పనిచేస్తున్నాం. అందువల్ల అమ్మతో ఎక్కువ సమయం గడిపే అవకాశం చిక్కింది. 

ఆదిత్య:  అమ్మ తర్వాత ఆ బాధ్యత అక్కదే! ఇప్పుడు అమ్మ మన మధ్య లేదు కాబట్టి ఆ బాధ్యతలన్నీ మేమే నిర్వర్తించాల్సి వస్తోంది. వాటన్నింటి చూస్తుంటే- ‘అమ్మో! ఇన్ని బాధ్యతలు చిరునవ్వుతో భరించేదా?’ అనిపిస్తోంది. వాస్తవానికి నాకన్నా, నాన్న కన్నా.. అక్కకి, శృతికే బాధ్యతలెక్కువ. వారు ఒక వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే ఆఫీసు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తుంది.







అన్నీ తానై..

నా పెళ్లి సమయానికే అమ్మకు కొంత అనారోగ్యం వెంటాడేది. అందువల్ల ఎక్కువ ఎంజాయ్‌ చేయలేకపోయింది. కానీ అక్క పెళ్లిని మాత్రం చాలా ఎంజాయ్‌ చేసింది. ప్రతీ చిన్న విషయాన్ని తనే చూసుకుంది. 


ముందే తెలుసేమో!

అమ్మ చివరి రోజు నా వెడ్డింగ్‌ వీడియో చూశారు.. పిల్లలతో కలిసి ఆడుకున్నారు.. తను మూడువారాలు సీరియస్‌ కండిషన్‌లో ఆసుపత్రిలో ఉంది. బహుశా అందువల్లే మాకు అంతిమ విషాదాన్ని తట్టుకునే శక్తివచ్చిందేమో! లేకపోతే తట్టుకొనేవాళ్లం కాదు.. తనకు నాలుగైదేళ్లు హెల్త్‌ ఇష్యూస్‌ పెరుగుతూ వచ్చాయి. కానీ ఇంత తొందరగా వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. నాకు అయితే ఇంకా అమ్మ ఇంట్లో తిరుగుతున్నట్లే అనిపిస్తోంది.


అందరికీ..

ఇంట్లో అందరికి కావల్సిన బట్టలు.. ఇతర విషయాలు తనే చూసుకొనేది. చాలా మందికి తెలియదు కానీ అమ్మ మంచి ఆర్టిస్ట్‌. స్టోన్స్‌ మీద బొమ్మలు వేసేది. చిన్నప్పుడు ఒక సారి నేను రోబో ఫ్యాన్సీ డ్రస్‌ వేసా. అమ్మ బ్యాంకుకు సెలవు పెట్టి మరీ నాకు ఆ వేషం వేసింది. అప్పుడు నా మీద ఎంత శ్రద్ధ చూపించిందో మనమలపై కూడా అంతే శ్రద్ధ చూపించేది. వాళ్లకున్న బట్టల్లో ఎక్కువ శాతం తను కొన్నవే! 

అమ్మకు..నాకు లెక్కలంటే చాలా ఇష్టం. మేమిద్దరం కూర్చుని లెక్కలను సాల్వ్‌ చేసిన సందర్భాలెన్నో! నేను ఆంధ్రజ్యోతికి వచ్చిన కొత్తల్లో ఒక సారి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు దాకా కదలకుండా తను చెబుతూ ఉంది. నేను వింటూనే ఉన్నా.  - ఆదిత్య



అమ్మకు ఫన్‌ అంటే కుటుంబం అందరం కలిసి ఉండటం. మాతో కలిసి బయటకు వెళ్లటం. మేము ఏం చేసినా తను మనస్ఫూర్తిగా ఆనందించేది. తను మాకోసం త్యాగం చేసినట్లు ఎప్పుడూ భావించేది కాదు. నా భర్త భాను ఎబీఎన్‌కు వెళ్లిన మొదటి రోజు, శృతి ఆంధ్రజ్యోతికి వెళ్లిన మొదటి రోజు అమ్మ ఫోటోలు తీసి స్నేహితులందరికీ పంపింది. ఎంతో ఎక్సైట్‌ అయింది. ఇలా తనకు కుటుంబమే ఎక్సైట్‌మెంట్‌!   


అమ్మకు కోపం వచ్చిన సందర్భాలు తక్కువ. వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. మా చిన్నప్పుడు అమ్మమ్మ ఫ్రిజ్‌లో మిగిలిపోయిన వంటలు పెట్టేది. అమ్మకు ఒక సారి విపరీతమైన కోపం వచ్చి వాటిని బయటకు విసిరేసింది. అంత కోపం నేను ఎప్పుడూ చూడలేదు. ఆదికి ఒకప్పుడు చాలా కోపం ఉండేది. ‘‘కోపం వచ్చినప్పుడు పదినిమిషాలు బయటకు వెళ్లి రా!’’ అని చెప్పేది. అలా ఆది కోపం కూడా తగ్గిపోయింది. 


మరచిపోలేని వెకేషన్‌

ఇప్పటి దాకా మేము మరచిపోలేని వెకేషన్‌ మారిషస్‌. ఆంధ్రజ్యోతి పునఃప్రారంభించిన తర్వాత నాన్నకు ఎక్కువ సమయం ఉండేది కాదు. అందువల్ల మేము నలుగురం కలిసి ఎక్కువగా ఎక్కడికి వెళ్లలేదు. మారిష్‌సకు మాత్రం నలుగురమే వెళ్లాం. చాలా ప్రశాంతంగా గడిపాం. సరదాగా తిరిగేవాళ్లం.. రాత్రిళ్లు నడుచుకుంటూ రెస్టారెంట్‌లకు వెళ్లేవాళ్లం.. అదొక మరచిపోలేని అనుభవం. అమ్మ కూడా ఆ వెకేషన్‌ను చాలా ఎంజాయ్‌ చేసింది. 


మా అబ్బాయి ఇషాన్‌కి అమ్మతో అటాచ్‌మెంట్‌ ఎక్కువ. వాడి చిన్నప్పుడు నా దగ్గర కన్నా తన వద్దే ఎక్కువ సమయం ఉండేవాడు. వాడికి ఏం జరిగిందో తెలియటం లేదు. ‘‘అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది? ’’ అని అడుగుతూ ఉంటారు. ‘‘దేవుడి దగ్గరకు వెళ్లింది’’ అని నాన్న చెబుతూ ఉంటారు. కానీ వాడికి దేవుడు ఎవరో కూడా తెలియదు కదా.. అమ్మ ఫోటో కనిపిస్తే వెళ్లి ముద్దులు పెడుతూ ఉంటాడు.. బహుశా కొద్ది కాలానికి మరిచిపోతాడేమో!


మాది ఉమ్మడి కుటుంబం. ఉదయాన్నే లేవగానే కిందకి దిగితే మొదట అమ్మే కనిపించేది. రాత్రి మేము వచ్చి నిద్రపోయేదాకా తను నిద్రపోయేది కాదు. ప్రతి రోజూ రాత్రి మొత్తం కుటుంబం అంతా కలిసే భోజనం చేస్తాం. తను కూర్చునే కుర్చీ బోసిగా కనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎవరికీ కనబడకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్న క్షణాలెన్నో! మేము నాలుగు స్తంబాల లాంటివాళ్లం. ఒక స్తంభం కూలిపోయింది. ‘‘నేను కూడా కొలాప్స్‌ అయితే మీరు తట్టుకోలేరు. మీ కోసం నేను స్ట్రాంగ్‌గా ఉంటా..’’ అని నాన్న చాలా మొండిగా ఉంటున్నారు. మేము కూడా నాన్న కోసం మొండిగా ఉంటున్నాం. కానీ మా మనసులో ఉన్న దుఖం మాత్రం మాకే తెలుసు. 





Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST