విజయవాడ అమ్మాయి.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఇద్దరు కుర్రాళ్లను నమ్మి ఉత్తరప్రదేశ్ దాకా వెళ్లిన ఆమెకు..

ABN , First Publish Date - 2021-08-04T18:26:03+05:30 IST

ఆ యువతిది విజయవాడ.. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువకులతో స్నేహం చేసింది..

విజయవాడ అమ్మాయి.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఇద్దరు కుర్రాళ్లను నమ్మి ఉత్తరప్రదేశ్ దాకా వెళ్లిన ఆమెకు..

ఆ యువతిది విజయవాడ.. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువకులతో స్నేహం చేసింది.. వారి మాటలను నమ్మి ఆకర్షితురాలైంది.. చివరకు వారితో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయింది.. అక్కడ వారు ఆమె నుంచి బంగారం, నగదు దోచుకుని ఆమెను ఓ నదిలోకి తోసేశారు..  తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు ఆమెను మోసం చేసి డ్యామ్‌లోకి తోసేశారని తెలిసి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత ఆమె శవాన్ని గుర్తించారు.


విజయవాడకు చెందిన బాధిత యువతికి కొన్ని రోజుల కిందట ఫేస్‌బుక్ ద్వారా యూపీకి చెందిన వసిత్ అహ్మద్, తయ్యుబ్‌తో పరిచయమైంది. వారిద్దరూ ఆమెను నమ్మించి గత నెల 11న విజయవాడ నుంచి యూపీలోని సహరాన్‌పూర్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమె నుంచి బంగారం, డబ్బు తీసుకుని ఆమెను హత్నీకుంద్ బ్యారేజ్‌లోకి తోసేశారు. యువతి కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూపీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు తమ కుమార్తెను తీసుకెళ్లారని కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే యూపీ పోలీసులతో కలిసి విజయవాడ పోలీసులు ఈ కేసును సమాంతరంగా విచారించారు. నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు అహ్మద్, తయ్యూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ యువతి గురించి ప్రశ్నించారు. అయితే వాళ్లు చేసిన నిర్వాకాన్ని ఆ కుర్రాళ్లు బయటపెట్టారు. ఆ యువతిని డ్యామ్‌లోకి తోసేశామని చెప్పారు. దీంతో ఆ యువతి మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. 


కాగా.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు హత్నీకుంద్ డ్యామ్‌లో యువతి మృతదేహం లభ్యమయింది. మూడు రోజులుగా గజ ఈతగాళ్లు అత్యంత కష్టపడి ఆ యువతి మృతదేహాన్ని వెలికి తీశారు. బుధవారం ఉదయం యువతి మృతదేహాన్ని గుర్తించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే పోస్ట్‌మార్టం అనంతరం ఆ యువతి మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలా.? లేక విజయవాడకు తీసుకురావాలా..? అని ఆమె తల్లిదండ్రులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మూడు రోజులుగా నీటిలోనే మృతదేహం ఉండటంతో దేహం పూర్తిగా పాడయిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఖననం చేస్తే బాగుంటుందని పోలీసులు కూడా సూచిస్తున్నారు. తల్లిదండ్రుల నిర్ణయం ప్రకారమే తదనంతర చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2021-08-04T18:26:03+05:30 IST