YSRCP అడ్డాగా Andhra University.. చదువులమ్మ ఒడిలో ఏంటీ రాజకీయ చిచ్చు.. అసలేంటిది..!?

ABN , First Publish Date - 2022-03-17T16:53:05+05:30 IST

ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠ మసకబారుతోంది. చదువులమ్మ ఒడిలో రాజకీయ చిచ్చు రగులుతోంది. మరో నాలుగేళ్ళలో శతాబ్ది వేడుక జరుపుకోవాల్సిన యూనివర్సిటీ ...

YSRCP అడ్డాగా Andhra University.. చదువులమ్మ ఒడిలో ఏంటీ రాజకీయ చిచ్చు.. అసలేంటిది..!?

ఆంధ్రా యూనివర్సిటీ.1926లో ఏర్పడింది. మరో నాలుగేళ్ళలో శతవసంతాలు పూర్తిచేసుకోనుంది. మహామహులు వర్సిటీ వీసీలుగా కొనసాగారు. కానీ, ప్రస్తుత వీసీ తీరుతో ఏయూ ప్రతిష్ఠ పాతాళానికి జారిపోతోంది. ఫక్తు రాజకీయనాయకుడిలా వ్యవహరిస్తూ వీసీ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. ఏయూలో జరుగుతున్న పరిణామాలపై విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరి వీసీ వ్యవహారశైలి, ఆయన చేస్తున్న రాజకీయాలేమిటో అనే ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


మసకబారుతోన్న ఆంధ్రా యూనివర్సిటీ

ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠ మసకబారుతోంది. చదువులమ్మ ఒడిలో రాజకీయ చిచ్చు రగులుతోంది. మరో నాలుగేళ్ళలో శతాబ్ది వేడుక జరుపుకోవాల్సిన యూనివర్సిటీ వివాదాల సుడిగుండంలో చిక్కుంటోంది. సీఆర్‌రెడ్డి, సర్వేపల్లి లాంటి మహామహుల నేతృత్వంలో నడిచిన యూనివర్సిటీ రాజకీయాలతో భ్రష్టుపడుతోంది. ముందుండి నడిపించాల్సిన వీసీ తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారు. నచ్చినవారిని అందలమెక్కిస్తున్నారు. అదేమని ప్రశ్నించినవారిన శిక్షిస్తున్నారు. రాజకీయనాయకులు కూడా ఆశ్చర్యపోయేలా రాజకీయాలు చేస్తున్నారు. టాపర్‌గా ఉండాల్సిన యూనివర్సిటీ అన్నిరంగాల్లో  చతికిలపడుతోంది. అయినా వీసీకి బాధ లేదు. ఏయూ ప్రతిష్టతో ఆయనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన కుర్చీ సేఫ్‌గా ఉండటానికి ఏం చేయకూడదో అవ్వన్నీ చేస్తున్నారు. ఫలితంగా ఏయూ కునారిల్లుతోంది. కుమిలిపోతోంది. అబ్బో ఏయూ అనే స్థాయి నుంచి అయ్యో ఏయూనా అనే స్థితికి తీసుకువచ్చారు. 


టీడీపీ హయాంలోనూ అప్పటి వర్సిటీ అధికారులపై విద్యార్థులను ఉసిగొల్పారు

అసలు వీసీగా ప్రసాదరెడ్డి నియామకంతోనే విమర్శలు రేగాయి. ఈయనకన్నా సీనియర్లు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రసాదరెడ్డికే వర్సిటీ పగ్గాలు అప్పచెప్పింది. ముందుగా ఇన్‌చార్జ్‌గా నియమించారు. తరువాత పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పాు. ప్రసాదరెడ్డి తొలినుంచి ఓ రాజకీయ కార్యకర్తలా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన దివంగత వైఎస్‌కు వీరవిధేయుడు. ఆయన హయాంలో ప్రసాదరెడ్డి ఏయూ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఏపీలోనే తొలివిగ్రహం ఏయూలో ఏర్పాటుచేశారంటే ఈయనారి వీరాభిమానం ఏ స్థాయిదో అర్థమవుతుంది. తదుపరి జగన్‌కు మద్దతు ఇచ్చారు. ఇక వైసీపీ అధికారంలోకి రాగానే వీసీ పదవి దక్కించుకున్నారు. అకడమిక్‌గా మంచిరికార్డే ఉన్నప్పటికీ రాజకీయాలు చేయడంలో ఈయనకు మించినవారు లేరు. గతంలో టీడీపీ హయాంలోనూ అప్పటి వర్సిటీ అధికారులపై విద్యార్థులను ఉసిగొల్పారు. అప్పట్లో ఈయనకు సహకరించినవారిలో కొంతమంది ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 


ప్రసాదరెడ్డి వీసీ అయ్యాక మారిన వ్యవహారశైలి

ప్రసాదరెడ్డితో కలిసి వైకాపా కోసం పనిచేసినవారిలో దాదాపు 50శాతంమంది వీసీపై అంసతృప్తితో ఉన్నారు. వీసీ అయ్యాక ప్రసాదరెడ్డి వ్యవహారశైలి మారింది. నచ్చనివారిని తొక్కేయడం మొదలైంది.  విద్యార్థి సంఘ నేతలు ఆరేటి మహేష్‌, ప్రొఫెసర్‌ జాన్‌ తదితరులు ఆయన కోసం పనిచేశారు. కానీ వీరు కూడా ఇప్పడు వీసీ వేధింపులకు గురవుతున్నారు. తనకు వ్యతిరేకం అని తెలిస్తే చాలు ప్రసాదరెడ్డి ఎవరినైనా అణిచివేస్తున్నారు. ఏయులో  18  విభాగాలు  మూతపడ్డాయి. సొంత ప్రెస్‌కూ తాళం వేశారు. ఫీజులు పెంచారు. తక్కవు జీతాలతో పనిచేస్తున్న యువ గెస్ట్‌ ఫ్యాకల్టీలను తొలగించారు. భారీ జీతాలు ఇచ్చి రిటైర్డ్‌ ప్రొఫెసర్లను తీసుకుంటున్నారు. యూజీసీ రూసా పథకం కింద కేటాయించిన 100 కోట్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరపాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్‌ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కూడా వీసీ తీరు, నిధుల దుర్వినియోగంపై గవర్నర్‌కు లేఖ రాశారు. విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 


యూనివ‌ర్శిటిని వైసీపీ కార్యాల‌యంగా మార్చేశార‌ని..

గ‌తంలో  వీసిలు, రిజిస్ట్రార్‌లకు ఎంతో విలువ ఉండేది.  కోంత‌మందికి రాజ‌కీయాల‌తో  సంబంధాలు ఉన్నాలక్ష్మణరేఖ దాటలేదు. కానీ ప్రస్తుత వీసీ మరీ బరితెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఉన్నత విద్యా సంస్థను ఆదర్శంగా నడపాల్సిన వీసీ తానే నేరుగా కులసంఘాల మీటింగ్‌లకు హాజరవడం, వైకాపా నేతల జన్మదిన వేడుకలకు యూనివర్సిటీని వేదిక చేయడం చూసి ఆయన ఎంతగా పతనమయ్యారోనని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ మ‌ధ్య జ‌రిగిన వైయ‌స్సార్ క్రికెట్ క‌ప్ బాధ్యతను దగ్గరుండి మరీ భుజానికెత్తుకున్నారు. యూనివ‌ర్శిటిని వైసీపీ కార్యాల‌యంగా మార్చేశార‌ని,  వైకాపాకు సంబంధించిన బ్యాక్ యండ్ పనులు ఈయనే చేసి పెడతారని టాక్.. 


ఏయులో వీసిని రీకాల్ చేయాలంటూ ఏకమైన విద్యార్థి సంఘాలు..విపక్షాలు

ఈ నేపథ్యంలో  ఏయులో వీసిని  రీకాల్ చేయాలంటూ విద్యార్ధి సంఘాలు,  విప‌క్షాలు   ఏకమయ్యాయి. ఇక్కడ కూడా వీసీ తన రాజకీయనాయకుడి లక్షణాన్ని బయటపెట్టారు. తనకు అనుకూలంగా ఉన్న ప్రొఫెసర్లు, సిబ్బందితో ఓ ఫోరమ్‌ పెట్టించి కౌంటర్‌ ఇప్పించడం మొదలుపెట్టారు. తన వ్యతిరేకులంతా క్యాంటీన్‌లో కలుసుకుంటున్నారని, క్యాంటీన్‌ క్లోజ్‌ చేయించారు. ఇంతటితో ఆగకుండా ఏకంగా యూనివర్సిటీకి సంబంధం లేని వైకాపా మహిళా నేతలను రంగంలోకి దించారు. విమర్శలు చేసేవారికి వీరితో కౌంటర్‌ ఇప్పిస్తున్నారు. దీంతో ఒళ్ళుమండిన టీడీపీ మహిళా నేతలు వీసీకి చీరాసారె ఇవ్వడానికి సిద్దపడ్డారు. 


వైకాపా వర్గాలు వీసీకి అనుకూలంగా రంగంలోకి దిగడంతో ఆయనకు అధికార పార్టీతో ఉన్న ప్రత్యక్ష సంబంధాలు బయటపడేలా చేశాయని అంటున్నారు. ఇక వీసీ ఇంతటితో ఆగకుండా తన పలుకుబడి ఉపయోగించి చలో ఏయూని అడ్డుకున్నారు. ఇందుకోసం వైకాపా అధినేత తరహాలోనే పోలీసు ఫోర్స్‌ని ఉపయోగించుకున్నారు. చలో యూనివర్సిటీకి వస్తారనే అనుమానం ఉన్న నేతలందరినీ హౌస్‌ అరెస్ట్‌ చేయించారు.  ప్రసాదరెడ్డి వర్గం, ఆయన వ్యతిరేక వర్గంగా ఏయూ చీలిపోయిందంటే వర్సిటీ పరువు ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 


చదువులమ్మ తల్లి తల్లడిల్లేలా చేస్తున్న వీరు ఎటువంటి విద్యార్థులను రేపటి సమాజానికి అందిస్తారు... ఏ దిశగా యూనివర్సిటీని తీసుకువెళతారోననే ఆందోలన సర్వ్రతా నెలకొంది.  మొత్తం మీద వీసీ రాజకీయాలతో ఏయూ ప్రతిష్ట మసకబారిపోతోంది.  ఇది ఏపీ విద్యారంగంపై ఓ మాయని మచ్చలా నిలుస్తోంది. 

Updated Date - 2022-03-17T16:53:05+05:30 IST