యువతకు షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం..!

ABN , First Publish Date - 2021-10-11T15:19:34+05:30 IST

నవరత్నాల మాటున జగన్‌ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు స్వస్తి పలికేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా బడుగు వర్గాలకు అందాల్సిన సహకారం పూర్తిగా ఆగిపోయింది. నవరత్నాల్లోనే స్వయం ఉపాధి చూసుకోవాలని..

యువతకు షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం..!

యువతకు.. ‘నవరత్న’ గ్రహణం

అన్నీ ఆ పథకాల్లోనే చూసుకోవాలట!

స్వయం ఉపాధికి జగన్‌ సర్కారు స్వస్తి

రాజ్యాంగబద్ధ కార్పొరేషన్ల నుంచీ యువతకు అందని రుణాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఆగిన ఆర్థిక సహకారం

బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు.. ఆనక నవరత్నాలకు మళ్లింపు

ఖర్చు రాసేది కార్పొరేషన్ల పద్దులోనే.. యువతకు ఏదీ భరోసా?

బీసీల్లో ఐదారు కులాలకే లబ్ధి.. మిగతావారికి మొండిచేయే!

అయినా అందరికీ సంక్షేమం అందిస్తున్నామంటూ ప్రచారం

చంద్రబాబు హయాంలో 137 బీసీ కులాలకూ ప్రయోజనం

ఐదేళ్లలో స్వయం ఉపాధి, ఆదరణ కింద 4 వేల కోట్లకు పైగా ఖర్చు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): నవరత్నాల మాటున జగన్‌ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు స్వస్తి పలికేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా బడుగు వర్గాలకు అందాల్సిన సహకారం పూర్తిగా ఆగిపోయింది. నవరత్నాల్లోనే స్వయం ఉపాధి చూసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే మొత్తంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉన్నాయని.. మరే ఇతర పథకాలూ అవసరం లేదని వక్కాణిస్తున్నారు. కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా..  వాటినీ నవరత్నాలకు మళ్లిస్తున్నారు. ఏటా రూ.2 వేల కోట్ల మేర స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు.. ఈ 28 నెలల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా మొండి చేయి చూపారు.


రాష్ట్రంలో అణగారిన వర్గాలు స్వయంశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వపరంగా జగన్‌ సర్కారు ఎలాంటి ప్రోత్సాహమూ ఇవ్వడం లేదు. ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాలకు నిధులు ఎండగట్టింది. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో భారీగానే నిధులు కేటాయించారు. కానీ అవి వాటిని ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆ నిధులను నవరత్న పథకాలకు మళ్లించి.. కార్పొరేషన్ల ద్వారా ఖర్చుచేసినట్లు పుస్తకాల్లో సర్దుబాటు చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.754 కోట్లు, ఎస్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.240 కోట్లు, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.346 కోట్లు, బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు బదులుగా బీసీ-ఏ, బీ, సీ, డీ కులాల కార్పొరేషన్లు అంటూ సుమారు రూ.3 వేల కోట్ల మేర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. గత రెండు బడ్జెట్లలోను అదే విధంగా నిధులు మాత్రమే కేటాయించారు. అయితే ఆయా కులాలకు సంబంధించిన నవరత్నాల పథకాలకు ఈ కార్పొరేషన్ల ద్వారా బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ చేస్తున్నారు. నవరత్నాల పథకాలకు నిధులను ఈ కార్పొరేషన్ల నుంచే ఇస్తున్నా.. వాటి లబ్ధిదారుల్లో ఒక్కరిని కూడా వాటి చైర్‌పర్సన్లు గానీ, డైరెక్టర్లు గానీ ఎంపిక చేయడం లేదు. లబ్ధిదారుల ఎంపిక గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో జరుగుతోంది. దీంతో కార్పొరేషన్లన్నీ బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ సంస్థలుగా మారిపోయాయని పలువురు ధ్వజమెత్తుతున్నారు.


నాడు లక్ష నుంచి 20 లక్షల దాకా సాయం..

టీడీపీ ప్రభుత్వంలో ప్రతిఏటా వేల మంది ఎస్సీ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా పలు రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారు. దీని కోసం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏటా సుమారు రూ.400 కోట్ల దాకా ఖర్చు చేసేవారు. ఎస్సీ యువతకు వారి అభిరుచి మేరకు వారికి నచ్చిన రంగంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసేందుకు 60 శాతం దాకా సబ్సిడీ అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న యువతకు బ్యాంకుల ద్వారా రుణమిప్పించి ఇన్నోవా కార్లు అందజేశారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పలు రకాల యంత్రాల కొనుగోలుకు టీడీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి సహకారమందించింది. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంత మందికి జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్‌), జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌టీఎ్‌ఫడీఎస్‌) సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలిచ్చింది. ఏటా 50వేల మంది ఎస్సీ, 5వేల మంది ఎస్టీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందుతుండేవారు. జగన్‌ సర్కారు వచ్చాక ఏకంగా స్వయం ఉపాధి పథకానికే స్వస్తి పలికారు. నవరత్నాల ద్వారా ప్రయోజనాలు కల్పిస్తున్నందున మరే ఇతర పథకాలు అవసరం లేదంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వయం ఉపాధిని మూసేశారు.


నిర్వీర్యం చేశారంటున్న ఎస్టీ యువత..

కాంగ్రెస్‌ హయాంలో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీని నాటి సీఎం చంద్రబాబు పునరుద్ధరించగా.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను నిలిపేసింది. దీంతో వేల మంది ఎస్టీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. గిరిజన యువతకు గొర్రెలు, బర్రెలు తదితర ఆర్థికాభివృద్ధి యూనిట్లను 90 శాతం సబ్సిడీతో అందించేవారు. గిరిజన మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, ఆటోలు, పెద్ద వాహనాలను కూడా 90 శాతం సబ్సిడీతో అందించేవారు. పేద ఎస్టీ రైతులకు విద్యుత్‌ సౌకర్యం, బోర్లు, మోటార్లు, పైపులు తదితర సౌకర్యాలన్నీ ఎస్టీ కార్పొరేషన్‌, ఆయా ఐటీడీఏల ద్వారా అందేవి. నవరత్నాలు అమల్లో ఉన్నందున ఆ పథకాలేవీ అవసరం లేదన్న కొత్త వాదనతో గిరిపుత్రులు అయోమయంలో పడ్డారు. ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనారిటీ వర్గాల్లో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారు. ముఖ్యంగా ముస్లిముల్లో ఎక్కువ మంది పట్టణాల్లో, మండల కేంద్రాల్లో వెల్డింగ్‌షాపులు, మెకానికల్‌ షాపులు, పాత ఇనుప సామాన్లు, చిన్న చిన్న స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.


ప్రభుత్వం ఇచ్చే సాయం ఇలాంటి వర్గాలకు అందితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశముంటుందని చంద్రబాబు సర్కారు స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చింది. ఎయిర్‌కండిషన్‌, ఫ్రిజ్‌, ఆటోమొబైల్‌ రంగంలోనూ, డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌గాను, వెబ్‌డిజైనింగ్‌, బుక్‌ పబ్లిషింగ్‌లోను, బ్యాంకింగ్‌ రంగంలో, అక్కౌంట్స్‌, మెడికల్‌ ల్యాబ్‌, సోలార్‌ టెక్నీషియన్లుగా ఇలా పలు రకాల కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించారు. బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షలు రుణమిప్పించి అందులో సబ్సిడీగా ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చింది. దీంతో పాటు దుకాణ్‌, మకాన్‌ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా 1,000 మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించింది. జగన్‌ సర్కారు వచ్చిన మొదట్లో స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తామని దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. కానీ ఇంటర్వ్యూలు అర్ధాంతరంగా నిలిపేశారు. నవరత్నాలు ఇస్తున్నందున మళ్లీ స్వయం ఉపాధి యూనిట్లు ఎందుకని ప్రభుత్వ పెద్దలు సెలవివ్వడంతో అధికారులు ప్రక్రియను నిలిపేశారు. దీంతో అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే మైనారిటీ, క్రిస్టియన్‌ కార్పొరేషన్లు యువతకు స్వయం ఉపాధి యూనిట్లు అందించలేకపోయాయి. 


కొందరికే బీసీ సంక్షేమం..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.14 కోట్ల బీసీ జనాభాలో కేవలం ఐదు కులాలకు చెందినవారి సంక్షేమమే బీసీ సంక్షేమమంటూ.. మిగతావారిని గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం 137 రకాల బీసీ కులాలను కలిపి.. 13 కార్పొరేషన్లు, 9 ఫెడరేషన్ల ద్వారా ఏటా రూ.1,000 కోట్లకు పైగా స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తే.. ఈ ప్రభుత్వం నవరత్నాల పేరిట కేవలం 4.37 లక్షల మందికి ఏడాదికి రూ.10 వేలు మంజూరుచేసి.. బీసీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఆదరణ పనిముట్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆయా కులాల వారికి అధునాతన పనిముట్లను కేవలం రూ.10 శాతం చెల్లిస్తే రూ.90 శాతం సబ్సిడీగా అందించారు. రజకులకు వాషింగ్‌ మెషీన్లు, నాయీ బ్రాహ్మణులకు సెలూన్ల పరికరాలు, టైలర్లకు సరికొత్త కుట్టుమిషన్లు.. ఇలా వారి వారి వృత్తినైపుణ్యాలు పెంచుకునేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం రూ.750 కోట్లు ఖర్చు చేసింది. దీంతో పాటు ఏటా 60 వేల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుచేసి ఒక్కొక్కరికీ రూ.లక్ష సబ్సిడీ అందించింది. ఐదేళ్లలో మూడు లక్షల మందికి పైగా బీసీలకు ప్రయోజనం కల్పించారు.


ఐదేళ్లలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు కొనుగోలు, ఆదరణ పనిముట్లను సబ్సిడీ రూపంలో అందించడం ద్వారా రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చుచేసింది. ఒక్కో బీసీ లబ్ధిదారు సుమారు రూ.లక్ష వరకు సబ్సిడీ పొందారు. 3 లక్షల మందికి పైగా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆదరణ ద్వారా అధునాతన పనిముట్లు కూడా పొందారు. ఈ ఫలాలు బీసీల్లోని 137 కులాలకూ అందాయి. తద్వారా బీసీ వర్గాల్లో స్వయం ఉపాధి స్పూర్తి కల్పించినట్లయింది. తాను పొందిన సబ్సిడీ, రుణంతో యూనిట్‌ను అభివృద్ధి చేసి ఆయా వృత్తుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు మార్గం సుగమమైంది. జగన్‌ సర్కారు వీటన్నిటినీ అటకెక్కించింది. కొన్ని కులాలకు, కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చి.. 2 కోట్ల మందికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ఊదరగొడుతోందని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.

Updated Date - 2021-10-11T15:19:34+05:30 IST