మమ్మల్ని తెలంగాణలో కలపండి.. ఏపీలో వద్దు

ABN , First Publish Date - 2022-07-22T00:58:41+05:30 IST

కురుక్షేత్ర యుద్ధానికి ఐదు ఊళ్లే కారణం. మహాభారతం ప్రకారం కురువంశంలో ధ్రుతరాష్ట్రుడు, పాండురాజు సోదరులు.

మమ్మల్ని తెలంగాణలో కలపండి.. ఏపీలో వద్దు

భద్రాద్రి: కురుక్షేత్ర యుద్ధానికి ఐదు ఊళ్లే కారణం. మహాభారతం ప్రకారం కురువంశంలో ధ్రుతరాష్ట్రుడు, పాండురాజు సోదరులు. ఈ సోదరుల సంతానం విషయానికి వస్తే.. ధ్రుతరాష్ట్రుడికి వంద మంది పిల్లలు. పాండురాజుకు ఐదుగురు సంతానం. రాజ్యంలో సగభాగం ఇవ్వాలని పాండురాజు కుమారులు.. పాండవులు కోరతారు. అందుకు దుర్యోధనుడు ఒప్పుకోడు. చివరకు ఐదూళ్లిచ్చినా చాలంటూ శ్రీకృష్ణుడిని దూతగా పంపుతారు. మధ్యవర్తిగా కృష్ణుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగింది. ఈ కథ విన్న చాలా మంది అయ్యో.. పాండవులకు ఐదూళ్లు కూడా ఇవ్వారా.. ఇది అన్యాయం కాదా అంటూ అందరూ కౌరవులను తిట్టిపోశారు. ఇదంతా పురాణకాలంలో జరిగిందని చదువుకున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఐదూళ్ల పంచాయతీ మొదలైంది. తెలంగాణలో విలీనం చేయాలంటూ 5 పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. కన్నాయిగూడెం, పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. గోదావరి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేశారు. 


కన్నాయిగూడెం, పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక గ్రామాలకు భద్రాచలం నియోజకవర్గ కేంద్రం ఒకటి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కొత్తగూడెం జిల్లా కేంద్రం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఐదు గ్రామాలు ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గంలోకి వస్తాయి. రంపచోడవరం 120కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల తమ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఎనిమిదేళ్లుగా అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు వీటిని కూడా కలిపారు. ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. అందువల్ల తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. ప్రస్తుతం ఈ గ్రామాలు ఏపీ పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర విభజనతో తమ బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఈ గ్రామస్తులు వాపోతున్నారు. విద్య, వైద్యం లాంటి కనీస వసతులకు దూరంగా ఉన్నామని అంటున్నారు. 


ప్రతి సంవత్సరం గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయం చేయాలని ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం ముంపునకు గురి కాకుండా ఉండాలంటే ఆ ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత వివాదం మరింత ముదిరింది. భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో తీవ్ర వరద పరిస్థితులు ఏర్పడడానికి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని అజయ్ తెలిపారు. అజయ్ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఐదు గ్రామాల ప్రజలు తీర్మానం చేయడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

Updated Date - 2022-07-22T00:58:41+05:30 IST