జల జగడం : ఎన్వీ రమణ మాటను అంగీకరించని జగన్ సర్కార్.. బదిలీ చేసిన Supreme Court

ABN , First Publish Date - 2021-08-04T18:12:19+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడనలే...

జల జగడం : ఎన్వీ రమణ మాటను అంగీకరించని జగన్ సర్కార్.. బదిలీ చేసిన Supreme Court

న్యూ ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడనలేదు. కృష్ణా జలాల వివాదంలో ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై సీజేఐ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. సోమవారం నాడు జరిగిన విచారణలో ఈ వివాదానికి మధ్యవర్తిత్వమే మంచిదని రమణ చెప్పిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. న్యాయపరంగానే సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఏపీ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే కోర్టుకు తెలిపారు. మరోవైపు.. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం చెప్పింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. అనంతరం ఈ కేసును మరో ధర్మాసనానికి రమణ బదిలీ చేశారు. కాగా.. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.


ముందు చెప్పినట్లుగానే.. 

మధ్యవర్తిత్వం కుదరదంటే ఈ పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తానని ముందుగా చెప్పినట్లే బుధవారం నాడు రమణ బదిలీ చేసేశారు. అంతేకాదు.. ధర్మాసనమే విచారించాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ రమణ తోసిపుచ్చారు. అయితే.. ఈ కేసు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది..? ఎప్పుడు విచారణకు వస్తుంది..? విచారణ అనంతరం తీర్పు ఎలా ఉంటుందనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 


కేసీఆర్ ఆగ్రహం..!

అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం, జగన్ సర్కార్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని.. ఇంత జరుగుతున్నా జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు. అంతటితో ఆగని కేసీఆర్.. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణా జలాల వివాదంపై చర్యలు చేపడుతామని చెప్పుకొచ్చారు.


ఇదివరకు రమణ ఏం చెప్పారు..!?

జల వివాదాలను సామరస్యంగా తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చేమో, దయచేసి పరిశీలించండి. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుంది. ఈ విషయంలో అనవసరంగా కోర్టు జోక్యం చేసుకోవాలని భావించడంలేదు. తెలంగాణ ప్రభుత్వ అసంబద్ధ, అన్యాయమైన చర్యలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులకు భంగం కలుగుతోంది. చట్టబద్ధంగా దక్కాల్సిన జలాలు దూరమవుతున్నాయి. లీగల్‌గా ఈ పిటిషన్‌పై వాదనలు వినలేను. ఎందుకంటే... నేను రెండు రాష్ట్రాలకూ చెందిన వాడిని. న్యాయపరమైన విచారణే కావాలని, కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పదని భావిస్తే ఈ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానుఅని సోమవారం నాడు జరిగిన విచారణలో రమణ ఈ కీలక సూచనలు చేశారు.

Updated Date - 2021-08-04T18:12:19+05:30 IST