సర్కారుపై సమరశంఖం

ABN , First Publish Date - 2021-12-02T13:49:09+05:30 IST

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే..

సర్కారుపై సమరశంఖం

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటం

ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ పిలుపు

వెంటనే పీఆర్సీ అమలు చేయండి 

హామీ ఇచ్చినట్టుగా సీపీఎస్‌ రద్దు చేయాలి

చేసిన పనికి మా కూలి ఇవ్వండి

లేదంటే 7 నుంచి రోజువారీ నిరసనలు

పరిష్కరించకుంటే ఉద్యమం మరింత ఉధృతం 

జేఏసీ నేతలు బండి, బొప్పరాజు హెచ్చరిక 

సీఎ్‌సకు ఉద్యమ కార్యాచరణ నోటీసు


అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 7 నుంచి రోజు వారీ నిరసనలు చేపడతామని ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ నేతలు హెచ్చరించారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని దశల వారీగా మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు 5 పేజీలతో కూడిన నివేదికను ఉద్యమ కార్యచరణ నోటీసు రూపంలో అందజేశారు. అనంతరం ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని లేకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.


‘‘ఇరు జేఏసీల పక్షాన సీఎ్‌సకు ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నోటీసు ఇచ్చాం. గత నెల రోజుల నుంచి కూడా అనేక దఫాలుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్‌, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌.. ఇలా అధికారులను కలిసి మా సమస్యలు వివరించాం. 11వ పీఆర్సీ ఇవ్వాలని విన్నవించాం. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరాం. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని, డీఏలు ఇవ్వాలని కోరాం. మేం దాచుకున్న డబ్బులు ఇవ్వాలని, ఏపీజీఎల్‌ఐ డబ్బులు ఇవ్వాలని అడిగాం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరాం. రెండు నెలలుగా తిరిగినా ప్రయోజనం లేదు. ఏ ఒక్క డిమాండ్‌ పరిష్కరించని కారణంగానే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంటు అని, నెలాఖరుకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పినా కూడా ఆ మాటలు కన్నీటి మూటలయ్యాయి’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. ‘‘ఉద్యమ కార్యాచరణ ప్రకటించి వెళుతున్నామంటే దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఎలా చర్చించాలని సీఎ్‌సకు తెలిపాం. నివేదికలో ఏమైనా చెప్పకూడని అంశాలు ఉన్నాయా? ఉద్యోగులను కించపరిచేలా మంత్రి బుగ్గన  వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకసారేమో ఉద్యోగులకు జీతభత్యాలు ఎప్పుడోసారి వస్తున్నాయి కదా అని అంటున్నారు. మరోసారి అసెంబ్లీలో 90 శాతం పేద ప్రజలకు ఇవ్వాలా? 10 శాతం మంది ఉద్యోగులకు ఇవ్వాలా అని అంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాల గురించి మాట్లాడుతున్న బుగ్గన ఏ రోజైనా ఉద్యోగులకు అందుబాటులో ఉన్నారా? మంత్రి అనుకున్న పేద ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు? ఉద్యోగులు కాదా’’ అని  ప్రశ్నించారు. మేం పని చేసిన దానికి మా కూలీ మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని ఏ ఒక్క అదనపు డిమాండ్‌ అడగడం లేదు.


చట్టబద్ధంగా మాకు ఇవ్వాల్సినవి అడుగుతున్నాం. ప్రజలు గమనించాలి’’ అని బొప్పరాజు అన్నారు. డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యాచరణ కార్యక్రమాలను ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీలు ఖరారు చేశాయి. తొలిదశ కార్యాచరణలో భాగంగా 7వ తేదీ నుంచి 10 తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామంలో నిరసనలు తెలుపుతారు. 13న అన్ని మండల, డివిజన్ల స్థాయుల్లో నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తారు. 16న తాలుకా, డివిజన్‌ అధికారుల కార్యాలయాలు, ఆర్టీసీ డిపోల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు నిర్వహిస్తారు. 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహాధర్నాలు నిర్వహించనున్నారు. 27న విశాఖపట్నం, 30వ తేదీన తిరుపతి, జనవరి 3న ఏలూరు, జనవరి 6న ఒంగోలులో నాలుగు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే రెండో దశ కార్యాచరణలోకి వెళ్లనున్నారు.

Updated Date - 2021-12-02T13:49:09+05:30 IST