జంగారెడ్డిగూడెం మృతులపై అసెంబ్లీ, మండలిలో రగడ

ABN , First Publish Date - 2022-03-14T17:45:07+05:30 IST

జంగారెడ్డి గూడెంలో జరిగిన వరుస మరణాలపై అసెంబ్లీ, శాసనమండలిలో రగడ నెలకొంది.

జంగారెడ్డిగూడెం మృతులపై అసెంబ్లీ, మండలిలో రగడ

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలో జరిగిన వరుస మరణాలపై అసెంబ్లీ, శాసనమండలిలో రగడ నెలకొంది. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాల నేపథ్యంలో సభ ఆర్డర్‌లో లేకపోవడంతో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఉభయ సభలను వాయిదా వేశారు. మరోవైపు జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై మంత్రులు పేర్నినాని, ఆళ్లనాని, కొడాలి నాని సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. జంగారెడ్డిలో మృతుల ఘటనకు సంబంధించిన విషయాలను వివరించారు. అలాగే ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి కూడా సీఎంతో భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెంలో ఎలా చనిపోయారన్నది వివరించారు. టీడీపీ శవరాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.


ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంకు బయలుదేరారు. నాటుసారా తాగి మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. నాటుసారా తాగి నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు అన్నారు. కల్తీసారా కారణంగా అనేకమంది చనిపోతున్నారని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?, ప్రాణాలు పోతున్నా స్పందించదా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

మరోవైపు చంద్రబాబు పర్యటను విఫలం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. నిన్న రాత్రి వైసీపీ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి చంద్రబాబును కలవద్దని ఒత్తిడి చేశారు. ఏలూరు కలక్టరేట్‌కు వెళ్లాలని అక్కడ రూ. 10 లక్షలు ఇస్తారని ఆశపెట్టారు. అయితే తాము చంద్రబాబును కలిసే తీరుతామని బాధిత కుటుంబాలు స్పష్టం చేశాయి.

Updated Date - 2022-03-14T17:45:07+05:30 IST