ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ కోతలు

ABN , First Publish Date - 2022-04-29T16:45:18+05:30 IST

విద్యుత్ కొనుగోలు చేద్దామంటే పవర్ ఎక్సేంజ్‌లో విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో...

ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ కోతలు

అమరావతి: విద్యుత్ కొనుగోలు చేద్దామంటే పవర్ ఎక్సేంజ్‌లో విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. ముందు చూపు లేకపోవడం వంటి కారణాలతో ఏపీలో ప్రజలకు మండు వేసవిలో నరకం కనిపిస్తోంది. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్ మధ్య అంతరాయం పెరుగుతోంది. రోజు రోజుకు కోతలు పెరుగుతున్నాయి. విద్యుత్ ఉత్పాదనకు ప్రధానమైన ధర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు కొరత వెంటాడుతోంది. దీంతో థర్మల్ స్టేషన్లలో ఉత్పాదన తగ్గించివేస్తున్నారు. దీనికి తోడు సోలార్ విద్యుత్ ఉత్పాదన కూడా సగటున 6 వందల మెగావాట్లకు మించి రావడంలేదు. హైడల్, గ్యాస్, విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి.


జగన్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో పవర్ ఎక్సేంజ్‌లో పీక్ టైమ్‌లో విద్యుత్ కోనుగోలు చేసేందుకు గత ఏడాది అక్టోబర్‌లోనే టెండర్లు వేయాలి. కానీ ఆరోజు నిధుల కొరతతో టెండర్లు వేయలేదు. వివిధ రాష్ట్రాలు, పవర్ ఎక్సేంజ్‌లో టెండర్ వేసి ఒప్పందాలు కుదుర్చుకుని పీక్ టైమ్‌లో విద్యుత్‌ను వాడుకుంటున్నాయి. నాడు టెండర్లు వేయలేని ఏపీ ప్రభుత్వం నేడు ప్రజలను విద్యుత్ కోతలతో అల్లాడిస్తోంది. పవర్ ఎక్సేంజ్‌లో విద్యుత్ కొనుగోలు చేయాలన్నా విద్యుత్ లభ్యం కావడంలేదు. యూనిట్‌కు రూ. 12 వెచ్చించినా అందుబాటులోలేకుండా పోయింది. దీంతో పట్టాణాలు, పల్లెల్లో ఏ సమయంలో విద్యుత్ ఉంటుందో కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2022-04-29T16:45:18+05:30 IST