మరో వెనెజులా కానున్న ఆంధ్రప్రదేశ్‌

ABN , First Publish Date - 2021-12-06T05:49:25+05:30 IST

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో వెనెజులా దేశంలా మారడం తథ్యమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.

మరో వెనెజులా కానున్న ఆంధ్రప్రదేశ్‌
కప్పస్తంభం వద్ద బండారు సత్యనారాయణమూర్తి

పంచగ్రామాల భూ వివాదంపై ప్రభుత్వం రాజకీయ క్రీడ 

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి

సింహాచలం, డిసెంబరు 5: త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో వెనెజులా దేశంలా మారడం తథ్యమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఆదివారం సింహాద్రి అప్పన్న స్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసిందని, రాష్ట్ర ఖజానాకు వచ్చే రాబడి మొత్తం అప్పులపై వడ్డీలకు సరిపడే పరిస్థితులు కూడా లేవన్నారు. దీంతో భవిష్యత్తులో వెనెజులా దేశంలో మాదిరిగా దయనీయ పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల కారణంగా రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. సంపదను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. అమరావతి రాజధానే లక్ష్యంగా రైతులు శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం భావ్యం కాదన్నారు. అన్నదాతలను గౌరవించడం అందరి బాధ్యత అని, రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రాకు వస్తే సొంత ఖర్చులతో స్వాగతిస్తానన్నారు. పంచగ్రామాల భూవివాదంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రజలతో స్వార్థం కోసమే రాజకీయ క్రీడ ఆడుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 229 జీవోపై వైసీపీ లీగల్‌ సెల్‌కు చెందిన వెంకటేశ్వరరావు కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవడం ద్వారా భూ సమస్యను సత్వరం పరిష్కరించే మార్గం ఉన్నప్పటికీ కమిటీలు, స్వామీజీల పేరుతో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. కాగా కుమారుడి వివాహ తొలి శుభలేఖను అప్పన్న స్వామి పాదాల చెంత వుంచి బండారు పూజలు జరిపించారు. 98వ వార్డు కార్పొరేటర్‌ పిసిని వరాహనరసింహం, టీడీపీ వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్‌ ఆయనకు స్వాగతం పలికారు. 

Updated Date - 2021-12-06T05:49:25+05:30 IST