గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం..!?

ABN , First Publish Date - 2021-10-24T15:06:37+05:30 IST

అరకొర జీతాలు పొందుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరుతో జీతాల్లో కోత విధించనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల నుంచే బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయడంతో నవంబరులో దీపావళి పండుగ ముందు అందుకునే..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం..!?

బయోమెట్రిక్‌ హాజరుతో జీతాల్లో కోతలు?

ఫీల్డ్‌ సిబ్బందికి ఎలా సాధ్యం!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన

పనిచేయని బయోమెట్రిక్‌ యంత్రాలతో ముప్పు

వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్‌

90 శాతం మందికి  కోత పడనుందని ఆవేదన

జగనన్న జీతం తగ్గింపు పథకమంటూ అసహనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అరకొర జీతాలు పొందుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరుతో జీతాల్లో కోత విధించనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల నుంచే బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయడంతో నవంబరులో దీపావళి పండుగ ముందు అందుకునే జీతాలు సంతోషం కాకుండా విషాదం మిగల్చనున్నాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఫీల్డ్‌ సిబ్బందికి సైతం బయోమెట్రిక్‌ అమలు చేస్తుండటంతో అక్టోబరు జీతాల్లో కోత పడుతున్నట్టు తెలిసిందని వాపోతున్నారు. తమతో సెలవు దినాల్లో సైతం పనిచేయిస్తున్నారని, సరిగా పనిచేయని బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటుచేసి, వాటి ఆధారంగా జీతాల్లో కోత విధిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు.


చాలా సచివాలయాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయడం లేదని, వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఫీల్డ్‌ సిబ్బంది కూడా సచివాలయానికి వచ్చి సకాలంలో హాజరు వేసుకోవాలనడం విచిత్రంగా ఉందంటున్నారు. 90 శాతం ఉద్యోగులకు అక్టోబరు జీతాల్లో కోత పడనున్నట్టు తెలియడంతో ఉద్యోగులు ఆందోళనతో వాట్సాప్‌ గ్రూపుల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. ఆన్‌డ్యూటీ, క్యాజువల్‌ లీవ్స్‌, పబ్లిక్‌ హాలిడేస్‌ కూడా పట్టించుకోకుండా జీతాలు కట్‌ చేస్తున్నారని వాపోతున్నారు. ఇది జగనన్న మెగా జీతం తగ్గింపు పథకం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు వచ్చే ఎక్కువ జీతాల వల్ల దీపావళికి టపాసులు ఎక్కువ పేల్చి వాతావరణాన్ని కాలుష్యం చేస్తారనే నవంబరు 4న వచ్చే జీతాల్లో కోత వేస్తున్నారంటూ సెటైర్లు వేసుకోవడం కనిపించింది. పట్టణాల్లో వార్డు సచివాలయం కార్యాలయం ఒక చోట ఉంటే, ఆ ఏరియా మరో చోట ఉంటోందని, దీంతో ఆ ప్రాంతంలో లేరంటూ బయోమెట్రిక్‌ యంత్రాలు ఉద్యోగుల వేలిముద్రలు స్వీకరించడం లేదని చెబుతున్నారు.


ఆయా ప్రాంతాల పరిధిలోనే సచివాలయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామీణులకు వైద్యసేవలు అందించే ఏఎన్‌ఎంలకూ జీతాల్లో కోత విధించడం అన్యాయమంటున్నారు. ఆదివారాలు, సెలవుదినాల్లోనూ ప్రత్యేక డ్రైవ్‌లంటూ ఎప్పుడంటే అప్పుడు సేవలందిస్తున్న వారికి బయోమెట్రిక్‌లో హాజరు లేదంటూ జీతాలు కోయడంలో న్యాయముందా? అని ప్రశ్నిస్తున్నారు. 


ప్రభుత్వ ఉద్యోగమని వస్తే ఇవేం కోతలు..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఎక్కువ జీతాలు పొందుతున్న చాలా మంది ఇది ప్రభుత్వ ఉద్యోగం కదా అని చేరితే... కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు కోత కోశారని, ఇప్పుడు తమ జీతాల్లోను కోత కోస్తే ఎలా జీవించాలని వాపోతున్నారు. ఇప్పటికే ప్రొబేషన్‌ పూర్తి చేసుకుని 25 రోజులవుతున్నా, ఇంకా ప్రొబేషనరీ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తమ గోడు పట్టించుకుని ప్రొబేషనరీ ప్రకటించాలని కోరుతున్నారు. 


సాంకేతిక సమస్యలు పరిష్కరించండి..

బయోమెట్రిక్‌ హాజరు అమల్లో సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. పనిచేయడం లేదని మరమ్మతులకు ఇచ్చిన బయోమెట్రిక్‌ యంత్రాలను ఇప్పటి వరకు సచివాలయాలకు తిరిగి ఇవ్వలేదని, వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని అభ్యర్థించింది. క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు నుంచి మినహాయింపులు ఇవ్వాలని, లేకుంటే హెచ్‌ఆర్‌ఎంఎ్‌స ద్వారా ఆన్‌లైన్‌ డ్యూటీ మార్క్‌ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది.


ఏజెన్సీ ప్రాంతాల్లో సాధ్యమేనా..?

ఏజెన్సీ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్‌ సమస్యల వల్ల బయోమెట్రిక్‌ హాజరు సాధ్యం కాదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తెలిపింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్‌ఎం/హెల్త్‌ సెక్రటరీ, డిజిటల్‌ అసిస్టెంట్‌/ఎడ్యుకేషన్‌ సెక్రటరీ తదితరులు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్న సందర్భంలో వారికి హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరింది., సెలవులను ఫిజికల్‌ డాక్యుమెంట్‌పై అధికారుల సంతకాలతో అప్‌లోడ్‌ చేసే విధానం కాకుండా ఆన్‌లైన్‌లోనే సంబంధిత అధికారి ఆమోదించే విధానం ప్రవేశపెట్టాలని కోరింది.


కార్యాలయాలకు కేటాయించిన మొబైల్‌, యంత్రాలు కార్యాలయాల్లోనే ఉండేలా సూచనలు జారీచేయాలని, యూజర్‌ పేరు, పాస్‌వర్డ్‌ ఒక్కరి దగ్గరే కాకుండా ప్రతి సచివాలయ ఉద్యోగికీ వ్యక్తిగత యూజర్‌ పేరు, పాస్‌వర్డ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ప్రత్యేకంగా బయోమెట్రిక్‌ యంత్రంతో సంబంధం లేకుండా మొబైల్‌ అప్లికేషన్‌ రూపొందించాలని కోరింది. మొబైల్‌ ఆధారిత హాజరు సాంకేతిక సమస్యలను పరిష్కరించలేని సందర్భంలో మిగిలిన అన్ని శాఖలకు ఇచ్చినట్లుగానే తమకూ వాల్‌మౌంట్‌ డివైజ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.



Updated Date - 2021-10-24T15:06:37+05:30 IST